Tuesday, April 26, 2011

తెలుగు సినీ.....-4



......శంకరాభరణం

ఇంక, చిత్ర విజయానికి దోహదం చేసిన సంగీతం (మహదేవన్), సాహిత్యం (వేటూరి) ల గురించి కొంచెం.

మహదేవన్, మనం యే మాటలు వ్రాసేసినా, వాటికి ట్యూను కట్టెయ్యగలడు. గమనించవలసిందేమిటంటే, రాజేశ్వరరావు, పెండ్యాల మొ. వారు కట్టిన పాటల్లో, పల్లవీ, చరణాలూ వుండేవి. కానీ, చరణాలు అన్నీ ఒకే వరసలో వుండేవి! మహదేవన్ మాత్రం, మాటల్ని ఇష్టం వచ్చిన వరసల్లో, వాయించేస్తాడు....ఓ వరస క్రమం లేకుండా!

వేటూరివారు--సహజకవి! అలతి అలతి పదాలతో.......అని ఇంతకు ముందే వ్రాశాను. "తొలిసంజ వేళలో, తొలిపొద్దు పొడుపులో, వినిపించే రాగం భూపాలం.....కనిపించే వర్ణం సింధూరం" (రచయిత దా. నా. రా.) పాటని ఘోస్టుగా ఈయనే వ్రాశాడు అని చెవులు కొరుక్కొంటారు సినీ పండితులు.

ఈ సినిమాకోసం చక్కటి పాటలు వ్రాశాడు. 

మొదటిగా, "ఓం! ఓం! ఓం! ఓంకారనాదానుసంథానమౌ రాగమే...శంకరాభరణమూ...." బాగుంది. శంకరాభరణ రాగం ఓంకారనాదానికి అనుసంధానమట. 

"శంకర గళ నిగళము" అంటే శంకరుడి గళాన్ని (కంఠాన్ని) పట్టుకొని, వ్రేళ్లాడేది--పాము! సరే.

"శ్రీహరి పదకమలమూ...." ఇదేమిటీ? శ్రీహరి పాదాలదగ్గర కమలం లా వుండేది....అనా? అంటే, ఆది శేషుడు అని కాబోలు కవి హృదయం!

"రాగ రత్న మాలికా తరళము...." అంటే, రాగాలు అనే రత్నాలు అన్నీ మాలికగా కూర్చితే, ఆ దండ 'తేలుతూ' వుండే రాగం--శంకరాభరణం అని. బాగుంది కదూ!

"శారద వీణా రాగ చంద్రికా...పులకిత శారద రాత్రము, నారద, నీరద, మహతీనినాద, గమకిత శ్రావణ మేఘము!"

అహో! యెంత గంభీరం! సరస్వతి వీణలోపలికే రాగ చంద్రికలతో పులకితమైన శరద్రాత్రి (లో), నారదుడి మహతి నాదం చేస్తుంటే, నీరదమైన శ్రావణమేఘము గమిస్తూందట....(పాములా!).

"రసికులకనురాగమై, రసగంగలో తానమై, పల్లవించు--సామ వేద మంత్రము--శంకరాభరణమూ"!

అంటే??!! యేమో. పాములకీ, శంకరాభరణ రాగానికీ, ఈ మాటలకి యెలా సమన్వయం కుదురుతుందో అర్థం కాలేదు--ఒక్క సామవేద మంత్రము పల్లవిస్తుంది అని తప్ప.

ఇలా ప్రతీ పాటనీ అర్థ తాత్పర్యాలు గ్రహించడానికి ప్రయత్నిస్తే......ప్చ్! వుపయోగమేమిటి!

కానీ, ఒక విషయం. సందర్భం వివరించి, దానికి తగ్గ పాట వ్రాయమంటే, పాపం చాలా కష్టపడి అలాగే వ్రాశాడు. వాటిని సినిమాలో వాడుకోవడమే.....ఇష్టం వచ్చినట్టు చేశాడు దర్శక యెడిటర్.

సినిమా యెత్తుగడలో భాగంగా, శం. శా. "క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్" కోసం, ఆయన ప్రఖ్యాతినీ, ఆయన వైదుష్యాన్నీ, ఆయనకి ఆ రాగమంటే వుండే ఇష్టాన్నీ, జనం నీరజనాలు పట్టడాన్నీ చూపించవలసిన "టైటిల్ సాంగ్" ని, జమీందారు కుర్చీలాగడానికీ, మం. భా. ని రేప్ చెయ్యడానికీ....ఇలా వుపయోగించుకోవడం యేమి బాగుంది?

"దొరకునా ఇటువంటిసేవ...." పాట, తులసి ఆయనకి శుశ్రూష చేస్తూ, సంగీతం నేర్చుకొనే సందర్భంలో వ్రాసినది. అది క్లైమాక్స్ పాట అయి కూచుంది.

"రాగం, తానం, పల్లవీ.....కడతేరమన్నవి" అనే పాట క్లైమాక్స్ కోసం వ్రాసినది. మధ్యలో ఇంకో కచేరీలో దూరింది.

క్యామెడీకోసం, కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను అని పట్టాభి చేత చెప్పించి, వెరయిటీగా "బ్రోచేవారెవరురా..." కీర్తనని పాడించి, (ఇలా చెయ్యకూడదు అని చెప్పడానికి అలా చెయ్యడమే చూపిస్తూ!), సంగీతోధ్ధరణ కోసం, దాన్ని మళ్లీ శం. శా. చేత పాడిస్తూ, తులసి నేర్చుకున్నట్టు చూపించవలసి వచ్చింది!

"సామజవర...."ని మధ్యలో చరణాలు చొప్పించి, రొమాన్సు కోసం చూపించడం జరిగింది.

ఆయన "ఫ్రస్ట్రేషన్"తో "శంకరా, నాదశరీరా" అంటూ వర్షంలో చిందులు వెయ్యడం కోసం వుపయోగించబడింది ఆ పాట.

యెంత సమర్థంగా వినియోగించుకున్నాడో చూడండి పాటలన్నిటినీ!

నిజానికి మొదటిసారి చూసినప్పుడు యెవరికీ అర్థంకాదు ఈ సినిమా. అందుకే మొదటివారం కలెక్షన్లు నిల్లు. తరవాత పాటలు హిట్ అవడంతో, (మొదట్లో పాటలు రేడియోలో విన్నవాళ్లు అవి మంగళంపల్లి వారు పాడారనుకున్నారు చాలా మంది. అంత గొప్పగా పాడాడు బాలు అని చెప్పడమే నా వుద్దేశ్యం.) క్యామెడీ, రొమాన్సూ, కీర్తనలూ, సంగీతోధ్ధరణ డైలాగులూ, సందర్భాలూ బాగా పండడంతో, అక్కడనించీ రజతోత్సవం దాకా వెళ్లిపోయింది ఈ సినిమా.

దానికి ముఖ్య కారణం--హీరో శంకర శాస్త్రే. మూస కథలతోటీ, మొహం మొత్తిన హీరోలతోటీ, సినిమాలు వస్తున్న రోజుల్లో, ఆయనని హీరోగా పెట్టి సినిమా తియ్యడం ఓ సాహసమే. అదే నచ్చింది జనాలకి.

తరవాత, మహదేవన్ సంగీత నిర్వహణ. విమర్శకులకి బాగా నచ్చిన వేటూరి వారి సాహిత్యం. వెరైటీ హీరోయిన్ మంజు భార్గవి. చంద్రమోహన్, అల్లు, సాక్షి ఇలా కొంతమంది తప్ప అందరూ కొత్త నటీ నటులే కావడం. (వాళ్ల స్థానంలో కూడా కొత్తవాళ్లని పెడితే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.) తులసి అబ్బాయి వేషం బాగా కుదరడం.

ఇలా అన్నీ కలిసొచ్చాయి.      

.........తరువాయి ఇంకోసారి.

2 comments:

Anonymous said...

కృష్ణశ్రీ గారు, మీరు పొగుడుతున్నారో లేక తిడుతున్నారో తెలియడంలేదు. అంతేకాకుండా "దొంగ పడ్డ ఆరునెలలకు...." విధంగా ఎప్పుడో వచ్చిన చిత్రం గురించి దాని గొప్పతనాన్ని ఒప్ప్పుకోకుండా దర్శకుడు ఇలా ఎందుకు చేసాడు, అలా ఎందుకు చేసాడు అని వాపోవడంలో అర్ధం లేదు. మీ కవి హృదయం ఏమిటో అర్ధం కావడం లేదు. అంతే కాకుండా తెలుగు చలన చిత్ర రంగానికి మకుటం లేని మహారాజులయిన ప్రతిష్టాత్మక కళాకారులను ఏక వచనంలొ సంబొధించడం బాగులేదు.

A K Sastry said...

పై అన్నోన్!

ఈ విషయంలో నేనిప్పటికి 4 టపాలు వ్రాశాను. మొదటి టపాలో ఇచ్చిన రిఫరెన్సుతో సహా అన్ని టపాలూ, వాటిమీద వ్యాఖ్యలూ, నా సమాధానాలూ అన్నీ చదివి వ్యాఖ్యానిస్తే బాగుంటుంది. అయినా ఈ మాత్రం వ్యాఖ్యకి అన్నోన్ గా యెందుకు? (దొంగ పడ్డాడంటారా? యెవరు దొంగ?)

నాకు యెవరినీ, యేవిషయాన్నీ పొగడాల్సిన, తిట్టాల్సిన, దేనిగురించీ వాపోవాల్సిన అవసరం లేదు.

ఇక, సో కాల్డ్ యేకవచన ప్రయోగం గురించి ఓ టపా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. వోపికుంటే చదవండి.