Saturday, April 30, 2011

యేకవచన ప్రయోగం



తెలుగు వారికి నా విఙ్ఞప్తి

తెలుగువారికీ, ముఖ్యంగా తెలుగు బ్లాగరు సోదరులకీ, నేను సంస్కృత/తెలుగు వ్యాకరణాలూ, ఇంగ్లీషు గ్రామరూ బోధిస్తున్నాను అనుకోక, నా చెప్పు ముక్కలు తమ చెవిని వేసుకొని, ఆలోచించమని ప్రార్థన. 

సంస్కృతంలోనైనా, తెలుగులోనైనా, నామవాచకాలు, సర్వనామాలూ వగైరాలు వున్నాయి. నామ వాచకమంటే, ఓ వ్యక్తి, వస్తువు లకు వ్యవహరింపబడే పేర్లు. సర్వనామాలంటే, ఆ నామవాచకాలని మళ్లీ మళ్లీ చెప్పవలసిన అవసరం లేకుండా, ప్రత్యామ్నాయంగా వాడే పదాలు.

ఓ నామవాచకం యొక్క స్థితిని తెలియచెయ్యడానికి సంస్కృతంలో "శబ్దాలూ", తెలుగులో "విభక్తులూ" వున్నాయి. అదే ఇంగ్లీషులో ఆ స్థితి వాచకాలు కూడా భాషా భాగాల్లో ఒకటిగానే వున్నాయి.

వుదాహరణకి, సంస్కృతంలో "రామః = రామ నామం కల వ్యక్తి". అదే తెలుగులో, "డు, ము, వు, లు--ప్రథమా విభక్తి" చేరి, "రాముడు" అవుతుంది ఆ వ్యక్తి పేరు. (ఛీ! యేకవచనమేమిటీ? శ్రీ రాములవారు.....అనాలి అందామా? ఈనాడు వారిలాగ?)

రాముని (ద్వితీయ), చేత (తృతీయ), కొరకు (చతుర్థీ), వలన (పంచమీ), కి, యొక్క (షష్ఠి), యందు (సప్తమీ)--కాకుండా "వాణ్ని" పిలవాలంటే, "ఓ రామా!"; "ఓరి రామా"; "ఓయి రామా" అనీ, అదే సీతనైతే, "ఓసి సీతా" అనే పిలవాలి--మన తెలుగు వ్యాకరణం ప్రకారం!

అంతేగాని, "రాములూ" వగైరా బహువచన ప్రయోగం యెందుకు?

అదే ఇంగ్లీషులో అయితే, 'ప్రిపొజిషన్స్' అని భాషాభాగాల్లోనే చేర్చుకొన్నారు వాళ్లు. "బై రామా", "ఫర్ రామా" ఇలాగ.

గత కొన్నేళ్లుగా, ప్రైవేటు కళాశాలలవాళ్లు "స్కోరింగు" సబ్జెక్ట్ గా సంస్కృతం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారట. మరి ఆ విద్యార్థులు ఆ "శబ్దాలనీ" వాటినీ సరిగ్గా వుచ్చరించగలుగుతున్నారో, వ్రాయగలుగుతున్నారో లేదోదానీ, మార్కులు మాత్రం వచ్చేస్తున్నాయట. అదే తెలుగులో 40 వేలమందికి పైగా "సున్నాలు" తెచ్చుకొన్నారట! రావూ మరి?! సంస్కృతం "రాని" మేష్టర్ల కన్నా, తెలుగు "రాని" మేష్టర్ల సంఖ్య యెక్కువ! 

మరి సర్వనామాలు, తెలుగులో, "అతడు, అమె, అది, ఆ" అనేవి. ఇంగ్లీషులో, "హి, షి, ఇట్, దె" అనేవి. 

తెలుగులో గ్రాంథికంలో అతడు, ఆమె అనేవి వాడినా, వ్యావహారిక భాషలో, వాటికి ప్రత్యామ్నాయంగా, వాడు,అది వారు/వాళ్లు అనే ప్రయోగాలు వచ్చేశాయి.

తెలుగు సాహిత్యం లో కూడా, భగవంతుణ్ని అయినా, వాడు, వీడు అనే అంటారు. "కలడు, కలండనెడి 'వాడు' కలడో, లేడో!" అనీ, "బ్రోచేవారెవరు 'రా'..." అని!

ఇంగ్లీషులో కూడా, వుదాహరణకి, "జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. హి (వాడు/అతడు) శాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఆన్ ది క్రాస్" అంటారు కదా?

"మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్నే ఆయుధం చేసుకొన్నాడు. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు".....అంటారు గానీ, "మహారాజశ్రీ మహాత్ములవారు గాంధీగారు"....చేసుకొన్నా"రు"....తెచ్చా"రు" అంటారా?

ఇక, వా 'రు'; తమ'రు' లాంటి ప్రయోగాలు మన బానిసతనానికి చిహ్నంగా భాషలోకి ప్రవేశపెట్టబడ్డవి. అప్పటి దేశపాలకులని, అప్పటి బానిస వ్యక్తులు అనవసరంగా కీర్తిస్తూ వాడిన పదాలవి. "సర్" ని "అయ్యా"/"ఆర్యా" అనీ;(మ్‌లేఛ్ఛుడు ఆర్యుడు యెలా అవుతాడు?) "నువ్వు" (ఇంగ్లీషులో యు) ని మీ'రు' అనీ, మళ్లీ ఆ మీరు ని తమ 'రు' అనీ; "ఘనతవహించిన"; "మహాఘనతవహించిన"; "శాయంగల విన్నపములు"; "దయయుంచి" (ప్లీజ్); "కరుణతో" (కైండ్లీ); "దఖలు"/"దాఖిలు"/"దాఖలు" చేస్తున్నాను (సబ్మిట్); (హిందీలో దాఖిల్ కర్నా అంటే విన్నపం చేస్తున్నాను, లేదా, మీ దృష్టికి తెస్తున్నాను/సమర్పిస్తున్నాను అని). 

ఇవన్నీ అవసరమా? 

{ఇప్పటి ఆఫీసుల్లో కూడా, ఇంగ్లీషులో యేదైనా వ్రాస్తే, దాంట్లో యెన్ని 'రిక్వెస్టులూ', 'ప్లీజ్ లూ', 'కైండ్లీలూ', 'సబ్మిట్ లూ' వున్నాయో చూసుకొని, పైన 'రెస్పెక్టెడ్' వుందా లేదా చూసుకొని, చివర థాంకింగ్ యూ తరవాత "సర్" వుందా లేదా చూసుకొని, అవన్నీ లేకపోతే, "వీడు వొట్టి (స్వంత చిరునామా లేనివాళ్లని--కేరాఫ్ గాళ్లనీ 'అనామకం గాడు (నస్మరంతి)' అనే అనుకుంటా బాపూ-రమణలు అన్నది) ఇన్ సబార్డినేట్ గాడు" అని ముద్రవేసేస్తారు!}

చెప్పొచ్చేదేమిటంటే, మనం ఇంగ్లీషు వాళ్లమూ కాదు, భారతీయులమూ కాదు, తెలుగు వాళ్లమూ కాదు--ఓ ప్రత్యేక జాతి! 

ఈ దౌర్భాగ్యాలు మనని వదిలేదెప్పుడో??!!

Tuesday, April 26, 2011

తెలుగు సినీ.....-4



......శంకరాభరణం

ఇంక, చిత్ర విజయానికి దోహదం చేసిన సంగీతం (మహదేవన్), సాహిత్యం (వేటూరి) ల గురించి కొంచెం.

మహదేవన్, మనం యే మాటలు వ్రాసేసినా, వాటికి ట్యూను కట్టెయ్యగలడు. గమనించవలసిందేమిటంటే, రాజేశ్వరరావు, పెండ్యాల మొ. వారు కట్టిన పాటల్లో, పల్లవీ, చరణాలూ వుండేవి. కానీ, చరణాలు అన్నీ ఒకే వరసలో వుండేవి! మహదేవన్ మాత్రం, మాటల్ని ఇష్టం వచ్చిన వరసల్లో, వాయించేస్తాడు....ఓ వరస క్రమం లేకుండా!

వేటూరివారు--సహజకవి! అలతి అలతి పదాలతో.......అని ఇంతకు ముందే వ్రాశాను. "తొలిసంజ వేళలో, తొలిపొద్దు పొడుపులో, వినిపించే రాగం భూపాలం.....కనిపించే వర్ణం సింధూరం" (రచయిత దా. నా. రా.) పాటని ఘోస్టుగా ఈయనే వ్రాశాడు అని చెవులు కొరుక్కొంటారు సినీ పండితులు.

ఈ సినిమాకోసం చక్కటి పాటలు వ్రాశాడు. 

మొదటిగా, "ఓం! ఓం! ఓం! ఓంకారనాదానుసంథానమౌ రాగమే...శంకరాభరణమూ...." బాగుంది. శంకరాభరణ రాగం ఓంకారనాదానికి అనుసంధానమట. 

"శంకర గళ నిగళము" అంటే శంకరుడి గళాన్ని (కంఠాన్ని) పట్టుకొని, వ్రేళ్లాడేది--పాము! సరే.

"శ్రీహరి పదకమలమూ...." ఇదేమిటీ? శ్రీహరి పాదాలదగ్గర కమలం లా వుండేది....అనా? అంటే, ఆది శేషుడు అని కాబోలు కవి హృదయం!

"రాగ రత్న మాలికా తరళము...." అంటే, రాగాలు అనే రత్నాలు అన్నీ మాలికగా కూర్చితే, ఆ దండ 'తేలుతూ' వుండే రాగం--శంకరాభరణం అని. బాగుంది కదూ!

"శారద వీణా రాగ చంద్రికా...పులకిత శారద రాత్రము, నారద, నీరద, మహతీనినాద, గమకిత శ్రావణ మేఘము!"

అహో! యెంత గంభీరం! సరస్వతి వీణలోపలికే రాగ చంద్రికలతో పులకితమైన శరద్రాత్రి (లో), నారదుడి మహతి నాదం చేస్తుంటే, నీరదమైన శ్రావణమేఘము గమిస్తూందట....(పాములా!).

"రసికులకనురాగమై, రసగంగలో తానమై, పల్లవించు--సామ వేద మంత్రము--శంకరాభరణమూ"!

అంటే??!! యేమో. పాములకీ, శంకరాభరణ రాగానికీ, ఈ మాటలకి యెలా సమన్వయం కుదురుతుందో అర్థం కాలేదు--ఒక్క సామవేద మంత్రము పల్లవిస్తుంది అని తప్ప.

ఇలా ప్రతీ పాటనీ అర్థ తాత్పర్యాలు గ్రహించడానికి ప్రయత్నిస్తే......ప్చ్! వుపయోగమేమిటి!

కానీ, ఒక విషయం. సందర్భం వివరించి, దానికి తగ్గ పాట వ్రాయమంటే, పాపం చాలా కష్టపడి అలాగే వ్రాశాడు. వాటిని సినిమాలో వాడుకోవడమే.....ఇష్టం వచ్చినట్టు చేశాడు దర్శక యెడిటర్.

సినిమా యెత్తుగడలో భాగంగా, శం. శా. "క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్" కోసం, ఆయన ప్రఖ్యాతినీ, ఆయన వైదుష్యాన్నీ, ఆయనకి ఆ రాగమంటే వుండే ఇష్టాన్నీ, జనం నీరజనాలు పట్టడాన్నీ చూపించవలసిన "టైటిల్ సాంగ్" ని, జమీందారు కుర్చీలాగడానికీ, మం. భా. ని రేప్ చెయ్యడానికీ....ఇలా వుపయోగించుకోవడం యేమి బాగుంది?

"దొరకునా ఇటువంటిసేవ...." పాట, తులసి ఆయనకి శుశ్రూష చేస్తూ, సంగీతం నేర్చుకొనే సందర్భంలో వ్రాసినది. అది క్లైమాక్స్ పాట అయి కూచుంది.

"రాగం, తానం, పల్లవీ.....కడతేరమన్నవి" అనే పాట క్లైమాక్స్ కోసం వ్రాసినది. మధ్యలో ఇంకో కచేరీలో దూరింది.

క్యామెడీకోసం, కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను అని పట్టాభి చేత చెప్పించి, వెరయిటీగా "బ్రోచేవారెవరురా..." కీర్తనని పాడించి, (ఇలా చెయ్యకూడదు అని చెప్పడానికి అలా చెయ్యడమే చూపిస్తూ!), సంగీతోధ్ధరణ కోసం, దాన్ని మళ్లీ శం. శా. చేత పాడిస్తూ, తులసి నేర్చుకున్నట్టు చూపించవలసి వచ్చింది!

"సామజవర...."ని మధ్యలో చరణాలు చొప్పించి, రొమాన్సు కోసం చూపించడం జరిగింది.

ఆయన "ఫ్రస్ట్రేషన్"తో "శంకరా, నాదశరీరా" అంటూ వర్షంలో చిందులు వెయ్యడం కోసం వుపయోగించబడింది ఆ పాట.

యెంత సమర్థంగా వినియోగించుకున్నాడో చూడండి పాటలన్నిటినీ!

నిజానికి మొదటిసారి చూసినప్పుడు యెవరికీ అర్థంకాదు ఈ సినిమా. అందుకే మొదటివారం కలెక్షన్లు నిల్లు. తరవాత పాటలు హిట్ అవడంతో, (మొదట్లో పాటలు రేడియోలో విన్నవాళ్లు అవి మంగళంపల్లి వారు పాడారనుకున్నారు చాలా మంది. అంత గొప్పగా పాడాడు బాలు అని చెప్పడమే నా వుద్దేశ్యం.) క్యామెడీ, రొమాన్సూ, కీర్తనలూ, సంగీతోధ్ధరణ డైలాగులూ, సందర్భాలూ బాగా పండడంతో, అక్కడనించీ రజతోత్సవం దాకా వెళ్లిపోయింది ఈ సినిమా.

దానికి ముఖ్య కారణం--హీరో శంకర శాస్త్రే. మూస కథలతోటీ, మొహం మొత్తిన హీరోలతోటీ, సినిమాలు వస్తున్న రోజుల్లో, ఆయనని హీరోగా పెట్టి సినిమా తియ్యడం ఓ సాహసమే. అదే నచ్చింది జనాలకి.

తరవాత, మహదేవన్ సంగీత నిర్వహణ. విమర్శకులకి బాగా నచ్చిన వేటూరి వారి సాహిత్యం. వెరైటీ హీరోయిన్ మంజు భార్గవి. చంద్రమోహన్, అల్లు, సాక్షి ఇలా కొంతమంది తప్ప అందరూ కొత్త నటీ నటులే కావడం. (వాళ్ల స్థానంలో కూడా కొత్తవాళ్లని పెడితే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.) తులసి అబ్బాయి వేషం బాగా కుదరడం.

ఇలా అన్నీ కలిసొచ్చాయి.      

.........తరువాయి ఇంకోసారి.

Saturday, April 23, 2011

తెలుగు సినీ.....-3



......శంకరాభరణం

ఇంతాచేస్తే, రషెస్ చూస్తే,సినిమా అరగంటకూడా రాలేదు.

ముఖ్యమైన క్యారెక్టర్లు--శం. శం. శా., మం. భా., వాళ్లమ్మా, జమీందారూ, కొంతమంది కచేరీ నిర్వాహకులూ (జూనియర్ ఆర్టిస్టులు), శం. శా. కూతురూ (ఓ చిన్న పిల్ల--తరవాత రాజ్యలక్ష్మి అవుతుంది), అబ్బాయి (తులసి)--అంతే! 

మరి బాగా ఆడాలంటే, సగటు సినిమాకి అవసరమైన "క్యామెడీ" యేదీ? "రొమాన్సు" యేదీ? కళాఖండం అనిపించుకోవాలంటే, "సపోర్టు" యేదీ? (ఇంకోగంట సినిమా తియ్యొచ్చుకదా? ఇవన్నీ కూడా కలిపేస్తే పోలా!) అనుకొన్నాడు. 

అప్పుడొచ్చాడు--యెవరూ? ఆయన చిన్నప్పటి స్నేహితుడినంటూ అల్లు రామలింగయ్య. కొన్ని లింకులు కుదిరాయి--'తమిళ తంబిలకీ, కన్నడ సహోదరులకీ మాటిచ్చేశాను--కచేరీ జరిపించాల్సిందే, తరవాత నీ యిష్టం;' అంటూనూ, 'అమ్మయిని అన్నవరం పంపిస్తున్నావు. అంతే;' అంటూనూ, 'పెళ్లి చూపులకి వాళ్లొస్తారు, తరవాత నీ యిష్టం'--అంటూ. (అది క్యామెడీ). (అప్పటికి శం. శా. భార్యని కూడా చూపించినట్టు గుర్తు. ఆవిడ యెప్పుడు యెలా పోయిందో తెలీదు). 

మరి రొమాన్సెక్కడా? ఆయన కూతురు పెద్దదయి, రాజ్యలక్ష్మిగా అవతరించి, చంద్రమోహన్, నిర్మలా, చెంబుసీన్లూ, "సామజవరగమనా" పాటా! "ఆ వృషభం...." అంటూ మళ్లీ క్యామెడీ! చీల్చి చెండాడాడు ఆయన క్యారెక్టరు ప్రకారం సోమయాజులు. 

మరి "కళాఖండం" యెలా? ఆయన ఇంటి ముందు ఓ మేడపై కొందరు హిప్పీలూ, అర్థరాత్రి శోకాలూ, మళ్లీ ప్రొద్దున్నే తులసి వచ్చేటప్పటికి పాటలూ, దానికి వాడి డ్యాన్సూ, సోముగారు వాడిని చెంపదెబ్బ కొట్టడం, మళ్లీ అర్థరాత్రి వాళ్ల రూముకి వెళ్లి, "రా రా రి రీ.....రిబ రిబ రిబ (ఇంకో మూడు సార్లు), రా రా రా రి రి రీ రీ......ఓయ్! అని పాడేసి, ఓ చిన్న లెక్చరు దంచేసి, వచ్చెయ్యడం! 

తన కూతుర్ని మండుటెండలో గోదావరిలో పీకలోతువరకూ ములగబెట్టి, చలికి వణుకుతున్నట్టూ, తెల్లవారుఝామున అలాగే చలిలో సంగీత సాధన చెయ్యాలి అన్నట్టూ ఓ సీను! (ఇది సామజవరగమనా కి పునాది!) 

"సామజ..." తరవాత కూతుర్ని "శారదా..." అంటూ తిట్టెయ్యడం, మహాకవి కాళిదాసు లెవెల్లో, చంద్రమోహన్ "మాణిక్యవీణాం....." పాడడం, ఆయన వాణ్ణి అల్లుడుగా వొప్పుకొని పెళ్లికి అంగీకరించడం....కొసమెరుపు! (అదంతా క్యామెడినే! కాకుండా ఇంకా అనేక "రసాలు" కూడా చూశారు 'సగటు' విమర్శకులు!)

సరే. క్లైమాక్స్ ముందే తీసేశాడుకదా. దానికి తగ్గ డైలాగులు...."ఆ దాత యెవరో....శిరసువంచి...." వగైరాలు. వారసుడిగా తులసిని ప్రకటిస్తూ, తన గండపెండేరం వాడికి తొడిగి, తనువు చాలించడం, ఆయన పాదాలపై వ్రాలి, మం. భా. కూడా చనిపోవడం.....! శహభ్భాష్! 

ఇంకేం! కళాఖండమంటే ఇదీ!

.........తరువాయి ఇంకోసారి.

Thursday, April 21, 2011

తెలుగు సినీ.....-2



......కళాఖండాలు--శంకరాభరణం

అసలు ఈయన (కే. విశ్వనాథ్) తో వచ్చిన గొడవేమిటంటే, తియ్యదలుచుకున్న సినిమాకి "స్క్రీన్ ప్లే" అంటూ వుండదు. వుంటే గింటే ఆయన బుర్రలోనే వుంటుంది. సినిమాకి ముఖ్యం అనుకున్న సీన్లు, క్యారెక్టర్లకోసం తనచుట్టూ తిరిగేవాళ్లనీ, హీరో హీరోయిన్లనీ పిలిచి గబగబా తీసేసి, వాటిని అతికేస్తాడు. తరవాత రషెస్ చూసి, అందులో బాగా ఆడడానికీ, కళాఖండం అని పేరు రావడానికీ యేమేమి లోపించాయో చూసి, మళ్లీ అవన్నీ రీళ్లు చుట్టేసి, ఆముక్కల్ని మళ్లీ సినిమాలో అతికించేస్తాడు. (నిజంగా అదొక కళ లెండి.)

ఈయనకీ, తెలుగు చిత్ర సీమకీ బాగా పేరు తెచ్చిన, ఇప్పటికీ "తరతరాల సాంప్రదాయాలని మరిచిపోకూడదు" అని చెప్పడానికి ప్రతీ వొక్కరూ వుపయోగించే "శంకరాభరణం" సినిమానే తీసుకోండి.

(అది ఓ కన్నడ సంగీత విద్వాంసుడి కథ అని కొందరంటారు.)

శంకర శాస్త్రి ఓ గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయనకి ప్రాణమైన రాగం శంకరాభరణం. ఆయన రాజమండ్రి గోదావరిలో, పుష్కరాల రేవులో మండుటెండలో స్నానం చేస్తూ, రాగాలు పాడుకొంటుంటే, ఓ బోగం పిల్ల (మంజు భార్గవి) ఆ లంకల్లో నాట్యం చేసేస్తూ వుంటుంది. 

ఈయనకి యెంత గోరోజనమంటే, ఓ సారి కచేరీ జరుగుతూ వుండగా, ఓ జమీందారు మంజుభార్గవీ వాళ్లమ్మతో మాట్లాడడానికి కుర్చీ లాక్కుని కూర్చుంటే, ఆ శబ్దాన్ని విని, కచేరీ ఆపేసి, వెళ్లిపోతాడు. (ఇలాంటి లక్షణాలవల్లనే ఆయనకి తరవాత కచేరీలు రాలేదు అని అర్థం రావడంలేదూ?)

సరే. మం. భా. ఓ రోజున ఆయన "శంకరాభరణమూ....." పాటని ఆస్వాదిస్తుండగా, (మధ్య మధ్యలో తానుకూడా పాడుకొంటూ, 'ఆహా...' అని పరవశిస్తూ వుంటే) ఆ జమీందారు వచ్చి, ఆవిడని "రేప్" చేసేసి వెళ్లిపోతాడు. (అక్కడ గ్రద్దా, పామూ బొమ్మ వ్రేళ్లాడం, రికార్డు అయిపోయాక కిర్రూ కిర్రూ అంటూ శబ్దం--ఇవీ సింబాలిజాలు.)

తరవాత ఆయన కన్నడదేశంలో కచేరీ చెయ్యడానికి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తూంటే, మం. భా. వచ్చి ఆయన పెట్టిలో యెక్కేస్తుంది. చాలా దర్పంగా బెంగుళూరులోనే అనుకుంటా, ఆయన దిగుతాడు. దండలతో స్వాగతం చెప్పడానికి వస్తారు--కచేరీ నిర్వాహకులు. కొంచెం గేప్ లో వెనకాలే మం. భా. దిగుతుంది. అక్కడ బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ సాధారణంగా యెవరూ గమనించి వుండరు--'యెంతవారలైనా, కాంతదాసులే!'--అంటూ! (అంటే దానర్థం? ఆయనకి కచేరీలు రాకుండా ఆగిపోవడానికి ఇదీ ఓ కారణమా?). నిర్వాహకులు ఈసడించుకొని, వెళ్లిపోతారు. ఆవిడని వాళ్లమ్మ తీసుకెళ్లిపోతుంది--యాగీ చేసి మరీ.

ఇంక అక్కడనించీ ఆయన ఇంట్లోనే వుండిపోయాడు అనుకోవాలి మనం. ఆయన కూతురు మడిగా నీళ్లు తెస్తూ, బిందె మొయ్యలేక కాలుజారి పడిపోతే, "నీకు వంట రాదా?" అని మం. భా. ని అడిగి, వండించుకు తింటాడు. (మళ్లీ ఆవిడ ఆయన యింటికి యెలా వచ్చిందో?) కులాలు మనుష్యులు యేర్పరచుకున్నవే, మన మనసుల్లోనే వుంటాయి అనో యేదో ఓ సందేశం అక్కడ.

తరవాత ఆమె మళ్లీ వేరే వూళ్లో ఓ పిల్లవాణ్ని (తులసి) కంటుంది. వాణ్ని మళ్లీ శంకర శాస్త్రి దగ్గరకి వెళ్లి, సంగీతం నేర్చుకోమంటుంది. (ఆ పిల్లవాడి తండ్రి జమీందారా? కాదు. శంకర శాస్త్రే అని నిర్ధారించడానికే ఆయన వారసుడిగా వాణ్ని క్లైమాక్స్ లో చూపించడం.)

సరే. ఆ కుర్రవాడు ఆయన సేవ చేసుకొంటూ, మళ్లీ ఓ విద్వాంసుడు అయిపోతాడు. క్లైమాక్స్ అందరికీ తెలిసిందే!

స్థూలంగా ఇదీ కథ. (నేను ఆ సినిమా రిలీజు అయినప్పుడు రెండో రోజునే భీమవరం వెంకట్రామా థియేటర్లో చూశాను. తరవాతోసారి 1990 ల్లో, వీసీపీలో చూశాను. అంతే. గుర్తున్నంతవరకూ వ్రాశాను. యేవైనా తప్పులు వ్రాస్తే, పూజ్య పాఠకులు నా దృష్టికి తీసుకు రండి.)

.........తరువాయి ఇంకోసారి.

Friday, April 15, 2011

తెలుగు సినీ.....



......కళాఖండాలు

(నా "సహజకవి" టపామీద యెవరో తనకి 'అనుమానాలు' వచ్చాయి అనీ, వాటిని 'నివృత్తి' చెయ్యాల్సిన బాధ్యత నాదే అనీ వ్రాశారు. అందుకే ఈ టపా. 'కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్' తప్ప నాకు యెవరినీ కించపరిచే వుద్దేశ్యం లేదు అని గమనించండి.)

"కళా తపస్వి" కాశీనాథుని విశ్వనాథ్. నిజంగా కళలలో ఓ తపస్సు చేశాడు. ఆయనంటే నాకు చాలా గౌరవం. తెలుగు సినిమాకి ఓ విలక్షణమైన ముద్ర తీసుకొచ్చాడు. (నర్తనశాల లాంటి సినిమాలకి అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాక, అలాంటివి సాధించింది ఈయనే.)

అలా అని, గొర్రెలమందలో ఒకడిగా (క్షమించండి......ప్రేక్షక దేవుళ్లెవరినీ కించపరచడం లేదు.) 'ఓహో అంటే ఓహో' అనడం నాకు చేతకాదు.

ఆయన సినీరంగంలో మొదటిగా చేపట్టింది "ఎడిటర్" ('కూర్పు' అనేవారు) పని. తరవాత "ఆత్మ గౌరవం" తో దర్శకుడి బాధ్యతలు చేపట్టారు. ఆ రోజుల్లో, వొకే వొక ప్రసిధ్ధ సినీ పత్రిక 'విజయ చిత్ర' లో, ఆయన గురించి అనేక వ్యాసాలు వచ్చేవి......ఎడిటర్ దర్శకుడిగా మారడంతో 'సౌలభ్యం' యేమిటో, యెంతో, దానివల్ల సినిమా యెలా విజయవంతం అవుతుందో.......ఇలా.

నిజంగా ఆ సినిమా "హిట్" అయ్యింది. (అది బెంగాలీ కథో యేదో గుర్తులేదు). అక్కడినించే ఆయన పయనం ప్రారంభం అయ్యింది "దర్శకుడి"గా. అదే (ఎడిటర్ డైరెక్టరుగా మారడం) అనే ఆయన బలం, బలహీనతగా రూపొందింది.

తరవాత ఆయన దర్శకుడిగా తీసిన సినిమాలలో మొదటి "సూపర్ హిట్" సిరిసిరిమువ్వ.

దానికోసం వ్రాయించిన పాటల్లో, "ఆది నుంచి ఆకాశం మూగదీ" అనే చరణం, తరవాత ఇంకో సినిమాలో వుపయోగించుకున్నాడు.....సందర్భ రహితంగా. (వీటికి ఋజువులూ, సాక్ష్యాలూ అడగద్దు. వీలైతే ఆయన్నే అడగండి.)

.........తరువాయి ఇంకోసారి.

Tuesday, April 12, 2011

సినీ సాహిత్యం



మన 'సు' కవి ఆత్రేయ

ఆయనెప్పుడూ "పాటకచేరీ" చెయ్యలేదు. వ్రాసి శ్రోతల్నీ, వ్రాయక నిర్మాతల్నీ "యేడిపించాడంతే"! దటీజ్ మా గురుతుల్యుడు "ఆత్రేయ".

నిజంగా కోడూరి కౌసల్యాదేవి వ్రాసిన ఆ నవల్లో "కళ్యాణ్" కి అంత సీను లేకపోయినా, "లత" అత్మాభిమానంతో అతన్ని వేధించినా, వాళ్లని నిజంగా జీవింపచేసినవాడు ఆత్రేయ.

ఈ పాటని యెంతబాగా వ్రాశాడో చూడండి.

"యెవరో రావాలి! నీ హృదయం కదిలించాలి. నీ తీగలు సవరించాలి. నీలో రాగం పలికించాలి." (కళ్యాణ్ స్థితిని యెంతబాగా చెప్పాడో చూడండి!)

"రాచ నగరున వెలసినావు, రస పిపాసకు నోచినావు, శక్తి మరచీ, రక్తి విడచీ, మత్తు యేదో మరగినావు! మరచిపోదగునా?"

"మూలదాగి, ధూళిమూగి, మూగవోయిన మథురవీణా, మరచిపోయిన మమతలాగ, మమతలుడిగిన మనిషిలాగా,  మాసిపోతగునా?"

"యెన్నిపదములు పలికినావో! యెన్ని కృతులని నేర్చినావో! కొనగోటమీటినచాలు. నీలో కోటి స్వరములు పలుకునే!"

యెవరో..............రావాలి!

పాట అయిపోయిన వెంటనే యే యెన్నార్ ఎక్స్ ప్రెషన్...."యెవరో రావాలి! ప్చ్! యెవరో????.....!"

అదీ పాటంటే. సాహిత్యమంటే. సన్నివేశానికీ, పాత్రలకీ తగ్గ సినీ గీతం అంటే!

(నాలోని "కవి" విజృంభించి, చరణాల్లో అనేక 'పాఠ్యాంతరాలని ' ప్రవేశపెట్టదలిచినా, గురువుగారు వ్రాసిన సాహిత్యాన్ని యథాతథంగా వ్రాయడానికి ప్రయత్నించాను. ఇంకా యేమైనా తప్పులుంటే క్షంతవ్యుణ్ణి.) 

Monday, April 4, 2011

సినీసాహిత్యం



సి నా రె

కవులమధ్య కూడా 'స్పర్థలూ', 'మనస్పర్థలూ' వుండేవి, వుంటాయి. (స్పర్థ అంటే పోటీ అని బాలసుబ్బు చెప్పాడు). 

శ్రీ శ్రీ తన సిప్రాలి లో "సినారె! భళారె!" అన్నాడొకచోట.

సినారె గొప్పకవే. సినీసాహితీకారుడు కూడా. గొప్ప గొప్ప పాటలు వ్రాశాడు, 'హిట్' చేశాడు.

మొన్నీమధ్య, స్వాతి ముత్యం సినిమాలో తాను వ్రాసిన "సువ్వీ సువ్వీ....సువ్వాలమ్మా...." గురించి తన అమూల్య అనుభూతులని మనతో పంచుకున్నాడు. (నిజంగా అవి ఆయనే వ్రాశాడో, పత్రికలవాళ్లు నాలాంటివాడి చేత వ్రాయించి, ప్రచురిస్తున్నారో తెలియదు!)

ఆయన మాటల్లోనే.....ఈ గీతానికి ప్రేరణ తాను అంతకు ముందు జీవితచక్రం సినిమాలో వ్రాసిన "సువ్వీ సువ్వీ" అనే పాట. పల్లవి సిధ్ధమౌతుంటే, 'కళాతపస్వి' ఆ పాటలో హీరోయిన్ కీ, హీరోకీ, రామాయణానికీ లింకు పెట్టమంటే, "సీతాలమ్మా" అని వ్రాసెయ్యగానే, పల్లవి పూర్తయ్యిందట!

చెన్నై నుంచి హైదరాబాదో, హైదరాబాదు నుంచి చెన్నై ఫ్లైట్లో వెళుతూనో, ఓ సినిమాకి కావలసిన డజను పాటల్నీ అలవోకగా వ్రాసిపారేసే సినారె కి ఇదేమీ బ్రహ్మవిద్యేమీ కాదు కదా!

అంతవరకూ బాగానే వుంది. తరవాత, "అండా దండా వుండాలని, కోదండా రాముని నమ్ముకుంటే, గుండేలేని 'మనిషల్లే' నిను కొండా కోనల వదిలేశాడా?" తో వచ్చింది అసలు చిక్కు. దానికి ఆయన సమర్థన--రాముడు సీతని వదిలినట్టే, హీరోయిన్ వాళ్లాయన ఆవిణ్ణి వదిలేశాడు. హీరోయేమో, 'చూస్తున్నాడూ పైవాడు' అని రాబోయే కథని చెప్పేస్తాడు--ఇలా యేదో! అందులోనే అరణ్యవాసం వగైరాల ప్రస్థావన! (అసలు ఆ సినిమాలో హీరోయిన్ 'వృత్తి' యేమిటో యెవరైనా "ఠక్కున" చెప్పగలరా? అది కూడా ఆయన చెపితేనే నాకు తెలిసింది.) 

అసలు "కోదండరాముడు" యెప్పుడయ్యాడు? రామరావణ యుధ్ధంలో కదా? సీతమ్మని వదిలేసింది, రావణవథ జరిగి, సీతను తెచ్చుకొని, పట్టాభిషేకం అయ్యి, తరవాతెప్పుడో వుత్తర రామచరిత్రలో కదా? 

రాముడు 'మర్యాదాపురుషోత్తముడు' అనీ, దేవుడుకాదు, మనిషి కాబట్టే, అలా ప్రవర్తించాడనీ పండితులు చెపుతూంటారు. కానీ ఈయన (ఆయన దేవుడు అయినా, గుండేలేని) 'మనిషల్లే' ప్రవర్తించాడు అంటాడా?

అంత బాధెందుకు? ప్రాసకోసం పాట్లు పడ్డాను. యేదో వ్రాశాను, హిట్టయ్యింది! జనాలకి నచ్చింది! అంటే గొడవొదిలిపోనుకదా? ఈ సమర్థనలెందుకు?

పెద్దలు యేమి చేసినా చెల్లుతుంది మరి.