Wednesday, May 18, 2011

అన్నమయ్య కీర్తనలు



ముద్దు కారే....

అప్పటికి మూడున్నరేళ్ల నా మనుమడు మా యింటి ముందున్న, వేంకటేశ్వర స్వామి గుళ్లో, ప్రతిరోజూ వాయించేస్తున్న ఈ కీర్తనని వింటూ, ఓ రోజు పాడేశాడు...."ముడ్డికారే యశోద....." అంటూ! వాడి తప్పేమైనా వుందా?

మన తితిదే వారు కొన్ని పదుల సంవత్సరాల క్రితమే, కొన్ని కోట్ల ఖర్చుతో "అన్నమాచార్య ట్రస్ట్" స్థాపించి, కొంతమందిని ఆయన కీర్తనలని తాళ పత్రాల్లోంచీ, రాగి రేకుల నుంచీ "దీ కోడ్" చెయ్యమని నియమించారు. 

ఆ "పరిశోధకులు" యెస్వీ యూనివర్సిటీ నుంచి "డాక్టరేట్లు" తెచ్చుకున్నారు--వాటిని పరిష్కరించడమే కాదు--తమకి తోచిన రాగ, తాళ, లయ లతో, పాడేశారు కూడా. వొక్క (ఛార్లెస్ కాదు) శోభారాజు గురించేకాదు నేను వ్రాస్తున్నది.

(నా చిన్నతనంలోనూ, నేను పుట్టక క్రితం కూడా, మల్లంపల్లి వారూ, తాపీ వారూ, తూమాటి వారూ, అక్కిరాజు వారూ.....ఇలా చాలా మంది, తమకి అందుబాటులో వున్న "పరిమిత" వనరులతో, "సిధ్ధాంత" వ్యాసాలు వ్రాశారు. దానిగురించి మరోసారి.)

అన్నమయ్య, తాను వ్రాసిన ప్రతీ గేయానికీ/గీతానికీ, నిర్దిష్టంగా ఓ రాగాన్ని, తాళాన్ని (మన ప్రాచీన వాగ్గేయకారులు త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్ ల లాగ) నియమించారు. 

శంకరాభరణం శంకరశాస్త్రి చెప్పినట్టు, మన "పరిశోధకులు" తమ "మిడిమిడి" ఙ్ఞానంతో వాటిని "భ్రష్టు" పట్టించారు! దానికి మన ప్రభుత్వ, తితిదే వారి ప్రోత్సాహం తోడు!

ఇంతకీ, అన్నమయ్య వ్రా/డిన ఈ గీతం యేమిటీ?

"ముద్దుకాడే! యశోద ముంగిటి ముత్యము వీడు" అని. 

అంటే, ఇక్కడ "శ్లేష"....ముద్దు కాడా? అనీ, "ముద్దుకాడు"--చెలికాడు, విలుకాడు, వన్నెకాడు--ఇలా (అంతేగాని కన్నడంలో లా కాడు అంటే "అడవి" అనీ, మన తెలుగులోలా "వల్లకాడు" అనీ కాదు!) ముద్దువచ్చేవాడు అని. 

మరి ముద్దు "కారడం" యేమిటి? అందులోనూ యశోదకి?

ఇప్పటికైనా సరిదిద్దండి--పాడేవారూ, వినిపించేవారూ వగైరాలు.

Friday, May 6, 2011

తెలుగు హాస్య సాహిత్యం-2



"గణపతి"

(ఇలా వ్రాసి, క్రింద "గణపతి" లోని ఆ భాగాన్ని ప్రచురిస్తే బాగుంటుందని ఇది తయారు చేశాను. కానీ, కొంచెం సస్పెన్స్ వుంటే బాగుంటుందేమో అనిపించి, ఆ భాగాన్ని ముందు ప్రచురించాను.) 

నేను నా జిన్నతనముననే వావిళ్లవారో నెవరో బ్రచురించిన జిలకమర్తివారి గణపతి ని జదివితిని. తరువాత, నా యున్నత విద్యా కాలమున మరల "ఎమెస్కో" (ఇది నామవాచకమైనందున బదము మొదటి యచ్చు దప్పదు!) వారో మరి యెవరో బ్రచురించిన గణపతిని మరలజదివితిని. అదే కాలములో నాకాశవాణి ద్వారా బ్రసారము కాబడిన నండూరి వారు గణపతిగా నటించిన (శ్రవణించిన) యా నాటకమో, నాటికనో--బలుసార్లు వింటిని. టేపురికార్డరను నొక సాధనము (అన్వేషణ యను జలన చిత్రమున జూపించినటువంటిది) నాదగ్గరుండుటచే, ఆ "రేడియో" నాటికను "రికార్డు"జేసుకొని, మరల మరల వినియానందించుచుంటిమి మా యింటిల్లపాదియును!

మొన్ననీమధ్యన "విశాలాంధ్ర" వారు "చంద్ర"యనునొక నార్టిస్ట్ వ్రాసిన (గణపతి తన బొగజుట్ట నుండి వెలువరించుచున్న బొగతో "గణపతి" యని వ్రాసినట్లు బ్రచురించిన ముఖజిత్రముతో) పునర్ముద్రించిన బుస్తకమునుగూడా గొంటిని. నా "యింటి గ్రంధాలయమున" బ్రస్తుతమా బుస్తకమున్నది.

నా దెలుగు బ్లాగ్మితృలకునోజిన్న గానుకనొసంగగోరి, నీక్రింది టపాను బ్రచురించుచున్నాను. 

(తెలుగు బ్లాగ్ మితృలూ, బ్లాగ్ పోలీసులూ, పైన వ్రాసిన వాక్యాల్లోని "అచ్చులనీ, హల్లులనీ", "పరుషాల"నీ, "సరళాల"నీ వాటి "స్థానాలనీ" గమనించగోర్తాను. అరసున్నాలుండవలసిన చోట అవి వ్రాయడానికోపిక లేక వదిలేశాను. దయచేసి అవి వున్నట్టే భావించవలసినదిగా ప్రార్థన.)

"గణపతి" ప్రథమ భాగము, నాల్గవ ప్రకరణము, నుండి (నేను జదివిన, విన్న, యంశములుమాత్రమే, యథాతథముగా) వ్రాయుచున్నాను....నా బ్లాగు సహోదరులవధరింప బ్రార్థన.

....తరువాయి మరియొకసారి.

Thursday, May 5, 2011

తెలుగు హాస్య సాహిత్యం




ఇది చదివారా?

"వివాహ సంబంధములైన వేడుకలు విశేషముగా వర్ణింపదలచుకొనలేదు. అయినను, ముఖ్యమైన వొకటి రెండు గలవు. పప్పుభొట్లవారితో నన్నంభొట్లవారు వియ్యమందినప్పుడు వారి కుభయులకు ననాది బంధువులైన నేతివారు దయచేసి వారితో గలసి మెలసి వివాహమునకెంతో శోభదెచ్చిరి. నేతివారుగాక ముఖ్యముగ నన్నంభొట్ల వారికి బంధువులైన కందావారు, చెమ్మకాయలవారు, బీరకాయలవారు, చేమకూరవారు, వంకాయలవారు, మిరియాలవారు, దోసకాయలవారు దయచేసి, రేయింబవళ్లు తిరిగి, రెక్కలు ముక్కలగునట్లు పనిచేసి మెప్పువడసిరి. ఉప్పువారు మొదటినుండియు నచ్చటనేయుండిరి. కాని వారికన్నంభొట్లవారితో నంతయైకమత్యము లేదు. ఉప్పువారికిని మన పప్పువారికిని నతికినట్లన్నంభొట్లవారితో నతకదు. ఉప్పువారికిని బంధుమిత్రులకుగూడ నెక్కువ కలయిక యుండెను. గొల్లప్రోలు నుండి చల్లావారు మొదట నేకారణముచేతనో రాక కడపట విచ్చేసిరి. కడపట విచ్చేసిననను మొదటి నుండియు నన్నంభొట్లవారికాప్తులగుటచేత వారి సమాగమ మెంతో రసవంతముగ నుండెను"