Friday, December 11, 2009

తెలుగు


కారడవి


నేను 'తెలుగు సాహిత్యం' లేబెల్ తో, కారడవి శీర్షిక తో వ్రాసిన వచనం, పద్యాలూ అందరూ చదివే వుంటారు.  


అది శ్రీమదాంధ్ర మహా భాగవతం లోని 'గజేంద్రమోక్షం' ప్రారంభం లో, గజరాజు తిరిగే అడవి వర్ణన అది.  


చూశారా, యెంత చక్కగా వర్ణించాడో--బమ్మెర పోతన! యెన్నిరకాల వృక్షాలు, జంతువులు, పక్షులు--ఇలా 'ఫ్లోరా & ఫౌనా' అంతటినీ వర్ణించాడు!  


తెలుగు భాష, తెలుగు సాహిత్యం అంటే అది!  


జూనియర్ లెక్చరర్ల కోసం పెట్టే పరీక్షలో ఇస్తున్న--ఫలానా కవి యే శతాబ్దం లో జీవించాడు? ఫలానా రచనని యెవరికి అంకితం ఇచ్చాడు? ఫలానా కవికి వున్న బిరుదులేమిటి?--ఇలాంటివి కాదు!  


తెలుగుని ప్రేమిద్దాం--తెలుగు సాహిత్యాన్ని ప్రేమిద్దాం!



Saturday, December 5, 2009

అవలోకనం

గత ఐదారు నెలలుగా నా ‘సాహితీ….’ బ్లాగు మీద తెలుగు సాహిత్యాభిమానులూ, సాహిత్య పిపాసులూ ‘శీతకన్ను‘ వేస్తున్నారా అని సందేహం వస్తోంది.


శ్రీ భైరవభట్లవారు కూడా, వేడుకున్నా కరుణించడం లేదు మరి!

నిజమంటారా?

Saturday, November 14, 2009

శౌర్యం

సగమే.....

ఉ. "గండరగండడై యలవు గండను మెండుగ దాండవింపను
        ద్దండ విరోధికాండమును దర్పమునన్ విదళించిమించుచున్............."

ఓ చారిత్రక పద్యకావ్యం లోనిదీ పద్యం. కవి శ్రీ మరుపూరి కోదండరామి రెడ్డి గారని ఙ్ఞాపకం. మిగిలిన రెండు పాదాలూ యెంత గింజుకున్నా గుర్తు రావడం లేదు. మిత్రులు కరుణించండి మరి!




Sunday, September 20, 2009

ఓ పుష్పం తపన



ఫూల్ కీ ఇచ్చా  


చాహ్ నహీఁ సుర్ బాలాకే గహనోం మే గూంథా జావూఁ 
చాహ్ నహీఁ ప్రేమీ మాలా మే బింధ్ ప్యారీ కో లలచావూఁ 
చాహ్ నహీఁ సమ్రాటోంకే శవ్ పర్ హే హరి! డాలా జావూఁ 
చాహ్ నహీఁ దేవోం కే శిర్ పర్ చఢూఁ, భాగ్యపర్ ఇఠలావూఁ!  


ముఝే తోడ్ లేనా బన్ మాలీ.... 
ఉస్ పథ్ పర్ దేనా తుం ఫేంక్....  


మాతృ భూమిపర్ శీష్ చఢానే 
జిస్ పధ్ జాయేఁ వీర్ అనేక్!  


.........శ్రీ మాఖన్ లాల్ 'చతుర్వేది '





Saturday, August 22, 2009

ఆశు నింద
ఓ కవిగారు, ఒక కన్నే వుండే ఓ రాజుగారి దర్శనానికి వెళ్ళారట.

ఆ రాజు దర్శనమివ్వడానికే చాలా రోజులు తిప్పలుపడాల్సి వచ్చిందట! (ఈ లోగా ఆయనకో ప్రియురాలు—అంటే ‘చిన్నిల్లు’ కూడా వుందని తెలిసిందట.)

కొన్నాళ్ళ తరవాత ఆఖరికెప్పుడో దర్శనం లభించిందట.

గుర్రుగా వున్న మనసుతో, నిండు సభలో నిలబడి, ఈ క్రింది పద్యం ఆశువుగా చదివాడట…..

“అన్నాతినిగూడ హరుడవు
అన్నాతినిగూడకున్న అసురుల గురుడౌ
అన్నాతిరుమలరాయా
కన్నొకటి కలదుగాని కౌరవపతివే!”

(అర్థం అయినవాళ్ళు చాటుగా నవ్వుకున్నారట, లేని వాళ్ళు ‘ఆహా! యెంతబాగా పొగిడాడు!’ అనుకున్నారట!)

దీని భావమేమి పాఠకేశా?

Friday, August 14, 2009

తెలుగు సాహిత్యం

పేటికాంతర శవము.
పెరమల రామచౌదరీగారిచే రచియించబడిన

అత్యద్భుతాపరాధ పరిశోధక నవల.
ప్రస్తుతము మన ఆంధ్ర వాఙ్మయమునందుగల అపరాధక నవలలోనెల్ల నియ్యదియే మిన్నయని చెప్పకతప్పదు. ఇందుగల ప్రతివిషయమును అత్యద్భుతాశ్చర్యజనకమై నీతిబోధాత్మకమై, విరాజిల్లుచుండును. ఆనంద విషాదముల కునికిపట్టగు నీనవల చదువ మొదలుపెట్టినచో ముందేమిజరుగునో యను తహతహ వొడముచుండును. వేరొకచో జదువరుల గుండెలవిచ్చన్నముగా నుండవేమో యనునంత భయము పుట్టజేయును. ఇంకొక్కచోట నాహా! ఎంతయాశ్చర్యమని నొచ్చుకొనకపోరు. ఎట్టియద్భుతములు—యెంతలేసి చమత్కారములు—ఇందు—సత్ప్రవర్తనుడగు రమేశదత్తుపైబడిన నేరము—ఆయనను అరెస్టు చేయుట, ఇందిరానరేంద్రుల స్నేహవాత్సల్యము—రమాసుందరి విజయుల బద్ధానురాగము—పాపము!—నీలకంఠుని ఘోరమరణము—దివాకరజీగారి యపరాధపరిశోధనానైపుణ్యము—నరేంద్రవిజయుల గూఢచర్యలు—దాదుచెందుపై ననుమానము—అపరాధపరిశోధనయందుగల రమాసుందరి బుధ్ధికుశలత—మలయాకరజీ గారి మాయానటన (రక్షకభటోద్యోగము) ఎత్తుపైఎత్తులు, వింతలు పై వింతలు—ఘోరహత్యలు—యుక్తిప్రదర్శనములు—శక్తిసామర్ధ్యములు—కపటానురాగములు మాయవేషములు మోసములు చదివితీరవలెనేగాని వ్రాయనలవికావు. ఇంతయేల ఇట్టినవల ఇదివరకు మీరు చదివి యుండరనియే చెప్పవచ్చును. ఛక్కని కాగితములపై డెమ్మీసైజున 250 పేజీలు గలిగియుండును. మృదుమధురములగు పదములతో తేలిక శైలిలో నతిచక్కగా వ్రాయబడినది. వెంటనే పుస్తకములకు వ్రాయుడు. ఆలస్యమైనచోనాశాభంగమే.
వెల రు. 1—0—0.
శ్రీ బాలకృష్ణా బుక్ డిపో., బుక్సెల్లర్సు, రాజమండ్రి.

(ఇది 1929 వ సంవత్సరం పి.వి.రామయ్య అండ్ బ్రదర్సు, శ్రీ బాలకృష్ణా బుక్ డిపో, రాజమండ్రి వారు ప్రచురించిన ఓ పుస్తకం మొదటి లోపలి అట్ట పై ప్రచురించిన వాణిజ్య ప్రకటన! మరి 1929 లోనే తెలుగులో (బెంగాలీ ప్రభావం తోనే కావచ్చు) అపరాధ పరిశోధక నవల వెలిసిందన్నమాట! కానీ 1940 ల్లో శ్రీ కొవ్వలి లక్ష్మీనరసిం హారావు గారు వ్రాసిన (పేరు గుర్తు లేదు) నవలనే తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవలగా గుర్తించారు! బహుశా మిగిలినవి అలభ్యాలు కాబట్టి యేమో!)

యెవరైనా ఈవిషయం లో యేమైనా చెప్పగలరా?


Monday, August 3, 2009

కారడవి


వ. అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూతకేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాలతక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కుసుమిత ఫలిత లలితవటపవిటపి వీరున్నివహాలంకృతంబును, మణివాలు కానేక విమల పులినతరంగిణీసంగత విచిత్రవిద్రుమలతామహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుటనిర్దళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కమనీయ సలిలకాసార కాంచనకుముదకల్ హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భారపరిశ్రాంత కాంతా సమాలింగితకుమార మత్తమధుకర విట సముదయ సమీప సంచారసముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బక బలాక కోయాష్టికముఖర జలవిహంగవినర వివిధకోలాహల బధిరీభూత భూనభోంతరాళంబును, దుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతటదరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాపసంగీత ప్రసంగమంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గకంఠీరవ శరభ శార్దూల చమర శల్యభల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాధ సమూహ సమరసన్నాహసం రంభ సంచకిత శరణాగతశమనకింకరంబునునై యొప్పునప్పర్వత సమీపంబునందు.

క. భిల్లీ భిల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ * బలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక
మల్లాద్భూత కాక ఘూక * మయ మగునడవిన్.

శా. అన్యాలోకన భీకరంబులు జితా * శానేక పానీకముల్
వన్యేభంబులు గొన్ని మత్తతనులై * వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరిభూధరదరీ * ద్వారంబులందుండి సౌ
జన్య క్రీడల నీరుగాలిపడి కా * సారావగాహర్థమై

ఇదేమిటి? తెలుగంటారా?

అవును--ఇదే తెలుగు మరి!

వారం అవుతోంది, వ్యాఖ్యలేమీ రాలేదేమిటబ్బా!

యేమిటి.....కొరుకుడుపడడం లేదా? హా! తెలుగుతల్లీ!



Saturday, July 11, 2009

ఆడ త్రాచుపాము.....



చ|| అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయివోయ భ
గ్గన దరిగొన్న భీషణ హుతాశన కీలయనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు దన చెక్కుల కుంకుమ పత్రభంగ సం
జనిత నవీనకాంతి వెదజల్లగ గద్గద ఖిన్నకంఠియై!

ఈపద్యం మీద మీ కామెంట్ యేమిటి?


Wednesday, July 1, 2009

ఆణి ముత్యాలు--3

ఇదెక్కడిదండోయ్?

గురుగుం జెంచలి తుమ్మియు లేదగిరిసాకు దింత్రిణీదళో

త్కరముగా నూనియలందలిర్చి, కట్టారు కుట్టారుగో

గిరముల్మెక్కి, బసుల్పొలమువో, క్రేపుల్మెయినాక, మే

కెరువుం గుంపటి మంచమెక్కిరి రెడ్లజ్జడిన్!


Monday, June 22, 2009

ఆణిముత్యాలు--2

ఈ ఆణిముత్యాన్ని అస్వాదించండి!

| అలఘు ఫణీంద్ర లోక కుహరాంతర దీప్త మణిస్ఫురత్ప్రభా

వళి గలదాని శశ్వదుదవాస మహావ్రత శీతపీడితా

చల మునిసౌఖ్య హేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబులన్

వెలిగెడిదాని గాంచిరరవింద నిభాననలమ్మహోదధిన్|

మరి మీ వ్యాఖ్యలు?


Tuesday, June 16, 2009

ఆణి ముత్యాలు


చ| అటజనిగాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరర్ ఝరీ

పటల ముహుర్ముహుర్లుట ధభంగ,మృదంగ, తరం గ నిస్వన

స్ఫుట టనానుకూల పరిఫుల్ల కలాపి కలాపి జాలమున్

కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్|

యెత్తైన చోటునించి క్రిందకి పడుతున్న నీళ్ళ 'సర్ సర్ ' మనే చప్పుళ్ళూ,

'ధభీ' మని పడడం, 'మృదంగ ' ధ్వని చెయ్యడం,

'స్ స్ ' అని శబ్దం చెయ్యడం, 'ట ట ' అని పడి,

మళ్ళీ 'ఫెళ్ళు ' మని యెగయడం, తరవాత 'గల గల ' అనే శబ్దం చెయ్యడం,

'తళుక్ తళుక్' అనిపించడం--ఇవన్నీ ఈ 'శబ్దాలంకారా శిరోభూషణం' లో వినిపించడం లేదూ!


Tuesday, June 2, 2009

స్వభార్యా సౌందర్యం

పెద్దిభొట్టుగారు ఓ ప్రఖ్యాత కవి! మంచి మంచి కవితలూ, ఖండికలూ గట్రా వ్రాశేవాడు.

ఒక రోజు, మామూలుగా ఆయన కవితా వ్యవసాయం ప్రారంభించబోతూం డగా, పాపం ఆయన భార్య, ‘యేమండీ, మీ కవితల్లో అనేకమంది నాయికల్నీ, వివిధ అందాల్నీ, వర్ణిస్తారు కదా? దయ చేసి, నా మీద ఒక పద్యం వ్రాయరూ?’ అని బెల్లించింది!

వెంటనే అందుకున్నారు మన పెద్దిభొట్టు గారు:

‘మేరు మంధర సమాన మధ్యమా!
తింత్రిణీదళ విశాల నేత్రీ!
అర్క శుష్కఫల కోమల స్థనీ!
పెద్దభొట్ట గృహిణీ విరాజతే!’

అని!

ఆవిడ పాపం, ‘అబ్బో! మేరువులూ, మంధరాలూ, తింత్రిణీ దళాలూ, అర్క ఫలాలూ—అబ్బో! భలేగా వర్ణించారులెండి!’ అని ఆనందించిందిట!

దీని భావమేమి అంటే—మేరు మంధర పర్వతాలతో సమానమైన నడుము తో, చింతాకులంత విశాలమైన కళ్ళతో, యెండిన జిల్లేడు కాయలవంటి స్థనాలతో, పెద్దిభొట్ట గృహిణి విరాజిల్లుతోంది—అని!

చూశారా! యే మొగుడుకైనా తన పెళ్ళాం యెంత అందంగా కనిపిస్తుందో!

అదే పక్కింటివాడి పెళ్ళాం అయితేనా?

అది మరోసారి!

Saturday, April 18, 2009

శ్రీ దేవులపల్లి


ఓ పెద్దాయన ప్రాక్టికల్ జోక్

కొన్ని దశాబ్దాల క్రితం, ఆలిండియా రేడియో, విజయవాడ కేంద్రం ఉద్దండులచే గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించే రోజుల్లో జరిగిన కథ……..

కేంద్ర సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావుగారు….ఓ సంక్రాంతి పండుగ సందర్భంగా, పిల్లలకోసం రూపొందించిన ఓ సంగీత రూపకం “బావొచ్చాడు”! దాని రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి.

కార్యక్రమం రూపొందడానికి చాలా ముందు, ఓ రోజు శ్రీ గొల్లపూడి మారుతీ రావు కనపడగానే, దేవులపల్లివారు (పాపం అప్పటికే బొంగురుగా ఒక్కొక్క మాటే మాట్లాడేవారు—ఆయన గొంతు శాశ్వతంగా మూసుకుపోవడానికి కొంచెం ముందు అన్నమాట) ‘మాష్టారూ!’ అని పిలిచి, కాగితం మీద “నేను వ్రాసిన సంగీత రూపకం లో మీరో ముఖ్య పాత్ర వెయ్యాలి! నేనే వేద్దునుగానీ, నా మొహం ఉత్త రాగి చెంబులా వుంటుంది! అందుకని" అని వ్రాశారట!

(నిజంగా రేడియోలో పాత్రలు కనపడవు అని ఆయనకి తెలియదా? తన మీద తనే జోకు వేసుకొనే ఆయన ప్రవృత్తీ, యెదుటివారి ప్రాముఖ్యతని గుర్తించామని పొగడడానికి సంకోచించక పోవడం!)

గొల్లపూడివారు ఉబ్బి తబ్బిబ్బై ఒప్పుకోగానే, ‘ఫలానా రోజున ప్రసారం…మీరు సిద్ధం అవండి’ అని వ్రాశారట.

కార్యక్రమం ప్రసారమయ్యే రోజు దాకా రిహార్సల్సూ లేవు, స్క్రిప్టు యేమిటో తెలియదు, తన పాత్ర యేమిటో, యెలా హావభావాలు పలికించాలో అని గుంపుతెంపులు పడుతున్నాడు శ్రీ గొల్లపూడి! పోనీ అడిగేద్దామంటే, పెద్దాయన!

సరే, ప్రసారవేళ రానే వచ్చింది. శ్రీ బాలాంత్రపు పిల్లల చేత పాటలు పాడిస్తున్నారట—పండుగ ప్రాశస్థ్యం గురించీ, అల్లుళ్ళు పండగకి అత్తారింటికి రావడం గురించీ, పిల్లల సరదాలూ—ఇలా అన్నీ దేవులపల్లివారు వ్రాసిన పాటలు ప్రసారమౌతున్నాయట! ప్రక్కగదిలో శ్రీ కృష్ణ శాస్త్రి చిరునవ్వుతో తిలకిస్తున్నారట!

కార్యక్రమం పూర్తి కావచ్చింది—చివరి నిమిషం వస్తూందనగా ఇంక వుండబట్టలేక ‘మరి నా హీరో పాత్ర…….’ అని నసిగారట గొల్లపూడివారు. వెంటనే గుర్తొచ్చినట్టు నవ్వి, ఓ చిన్న స్లిప్ మీద “యేమర్రా పిల్లలూ…..” అని వ్రాసిచ్చి, సైగ చేశారట.

చివర 50 సెకండ్లు వుండగా, రజనీకాంతరావు ఆయన్ని మైకు ముందుకు తోసి, డైలాగు చెప్పమనట్టు సైగ చేశారట.

గొల్లపూడి వారు, గొంతు సవరించుకొని, “యేమర్రా పిల్లలూ……..” అనగానే, పిల్లలందరూ “బావొచ్చాడు…బావొచ్చాడు” అని కేరింతలతో ఆయన చుట్టూ మూగుతుంటే, కార్యక్రమం ముగిసిందట!

చూశారా మన హీరో గారి ప్రాముఖ్యం!

(ఇది శ్రీ గొల్లపూడి 1982 లో వ్రాసిన ‘జీవనకాలం’ వ్యాసాల్లో స్వయంగా ఉటంకించిన ప్రహసనం)

Friday, February 20, 2009

ఆక్రోశం

ఆక్రోశం!

ఇంట్లో తండులాలు ‘నసంతి ‘

వంటింట్లో కుండలు ‘లుఠంతి ’

తిండానికైతే బహుమంది ‘వసంతి ‘

రండనాకొడుకులెల్ల ‘హసంతి ‘

చూశారా కవిగారి ఆక్రోశం!

పాపం ఆయనకి దత్తపదిలో అనుకుంటా—నసంతి, వసంతి, హసంతి, లుఠంతి—అని ఇచ్చారు.

ఆయన ఇంట్లో నిజ పరిస్థితిని వెళ్ళగక్కాడు! ఇలా!

అదండీ సంగతి!