Tuesday, October 16, 2012

తెలుగు నాటక సాహిత్యంఒక గొప్ప రచన

ముత్యాలముగ్గు సినిమాలో 'మాడా' - రావు గోపాలరావుతో బేరమాడుతూ, "మర్డరుకీ సెపరేషనుకీ యెంతవుద్ది, సెపరేషనుకీ మేరేజికీ యెంతవుద్ది, మర్డరుకీ, సెపరేషనుకీ, మేరేజికీ యెంతవుద్ది..........వోలుమొత్తానికి యెంతవుద్ది? కన్సెసనేమైనా వుందా?" అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పిన 'పొడవాటి ' డైలాగు గుర్తుందా?

అంతకు యాభయ్యేళ్ల క్రితమే ఓ నాటకంలో ఈ క్రింది సంభాషణని గమనించండి.

"అలాగైతే, సంబంధాల విషయంలో మీయభిప్రాయము ఏమిటో సంగ్రహముగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక చదువూ, సంప్రదాయమా? సంప్రదాయమూ సంపత్తా? సంపత్తూ చక్కదనమూనా? చక్కదనమూ చదువూ; చదువూ సంపత్తూ--ఈ విధముగా వుండవలెనా?"

ముళ్లపూడివారికి ఈ సంభాషణే స్పూర్తి యేమో!

ఈ సంభాషణ కాళ్లకూరి నారాయణరావుగారి "వరవిక్రయము" అనే నాటకం లోనిది.

1921 వ సంవత్సరంలో మొట్టమొదట ప్రచురింపబడి, తరువాత అనేక ముద్రణలు పొందుతూ, జాతీయోద్యమంలో భాగంగా కొన్నివేల ప్రదర్శనలకి నోచుకొన్న ఈ నాటకం మరుగునపడినా, అందులో విమర్శింపబడ్డ "వరకట్న దురాచారం" మాత్రం ఇంకా సమసిపోలేదు.

గురజాడవారు విమర్శించిన "కన్యా శుల్కం" అనే ఆచారం సహజ మరణం చెందడానికి కారణం, అప్పట్లో "విధవా వివాహాలు" చెయ్యవలసిరావడం జోరందుకోబట్టే, దానికి బ్రాహ్మణ్యం మింగలేక, కక్కలేక వూరుకోవడమే అనే వాదన నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ వరకట్నానికి సహజమరణం ప్రాప్తించేలా అన్ని కులాల్లోనూ యే ప్రక్రియా వూపందుకోకపోవడమే అది ఇప్పటికీ వర్ధిల్లడానికీ, వృధ్ధిపొందడానికీ కారణమేమో!

యేదైనా, ఈ నాటకాన్ని విరివిగా ప్రదర్శిస్తే కొంతలో కొంతైనా వుపయోగం వుంటుందేమో. ఇక కన్యాశుల్క నాటకాన్ని వదిలేసి, ఈ వరవిక్రయాన్ని మీడియావాళ్లూ, సాహితీపరులూ, సంస్కరణాభిలాషులూ తలకెత్తుకొంటే, యేమైనా వుపయోగముండచ్చేమో!

యేమంటారు?

(ఆ నాటకం లోని కొన్ని చక్కటి సంభాషణలు విడతలవారీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను--మీరు చదవడానికి ఆసక్తి చూపితే.)

Sunday, May 20, 2012

బాపు సృష్టి.....


.....శ్రీరామరాజ్యం

మన టీవీ వాళ్ల పుణ్యమా అని, ఇవాళ (20-05-2012) వుదయం ఓ ఛానెల్లో "లవకుశ"; సాయంత్రం ఇంకో ఛానెల్లో "శ్రీరామరాజ్యం" రెండు సినిమాలూ చూడగలిగాను. (ఇంతవరకూ శ్రీరామరాజ్యం చూసే అవకాశం రాలేదు.)

లవకుశ సినిమాలో ప్రతీ ఫ్రేమూ ఇప్పటికీ నాకు గుర్తున్నా, మళ్లీ ఓ సారి పునశ్చరణ చేసుకొనే అవకాశం వచ్చింది.

ఇంక శ్రీరామరాజ్యం గురించి ఆ సినిమా విడుదల అయినప్పటినుంచీ అనేకమంది చేసిన వ్యాఖ్యలూ, సమీక్షలూ, పొగడ్తలూ, తెగడ్తలూ, వెకిలి విమర్శలూ.......అనేకం చదివాను, విన్నాను.

కానీ, చాలామంది పెద్దవాళ్లూ, పండితులూ కూడా దృష్టిసారించని, ప్రస్తావించని విషయం ఒకటి వుంది అందులో.

అది నిజంగా ఓ "దృశ్యకావ్యమే!"--ఇది అందరూ చేసినలాంటి పొగడ్త కాదు.

సాధారణంగా "రీమేకులు" ఒకసారి డబ్బుచేసుకొన్న కథని, ఇంకో భాషలో మళ్లీ డబ్బుచేసుకోడానికి తీస్తారు. మరి ప్రపంచ ప్రఖ్యాత బాపూ, రమణలకి ఆ అవసరం వుందా? ముమ్మాటికీ లేదు. అందుకే లవకుశని రీమేక్ చెయ్యలేదు వాళ్లు!

లవకుశని పూర్తిగా భక్తి భావంతో, ఇతిహాసం యెలా వుందో అలా చిత్రీకరించి, జనాల్లో భక్తి భావాన్ని రేకెత్తించినందుకు ఆ సినిమా విజయవంతమయ్యింది.

నిజంగా, ఇతిహాసం ప్రకారం, "రామరాజ్యం"లో, "సీతానింద" జరిగింది. దానిద్వారా, "శ్రీరామ నిందా" జరిగింది. అసలు దాన్ని "ఖండించడానికే" కంకణం కట్టుకొని,  వాల్మీకి వుత్తర రామచరిత వ్రాశాడన్నట్టూ, దానిద్వారా, కుశలవులచేత ఆ రామరాజ్యంలోనే ప్రచారం చేయించి, ఆ నిందలని దూరం చెయ్యడానికి ప్రయత్నించాడన్నట్టూ.......చాలా విపులంగా చెప్పారు!

అదీ ఆ సినిమా "హైలైట్"!

"అక్కడెక్కడో" లంకలో జరిగిన అగ్నిపరీక్ష గురించి, అయోధ్య ప్రజలకి యెలా తెలుస్తుంది? అందుకే నిందవేస్తున్నారు--అని చెప్పించి, దాన్ని చక్కగా డెవలప్ చెయ్యడం చాలా బాగుంది!

(అసలు అగ్నిప్రవేశ ఘట్టమే "ప్రక్షిప్తం"; వుత్తరరామ చరిత్రకోసమే అది సృష్టించారు అనేవాళ్లు కూడా వున్నారనుకుంటా).

(ఈ బ్లాగరు విధానం 'కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్' ప్రకారం అనేక లోటుపాట్లున్నాయి. కానీ, అవన్నీ--వారి దృష్టికి వచ్చినా, వ్యవధానంలేక, చూసీ చూడనట్టు వదిలేసినవే అని ఖచ్చితంగా చెప్పగలడు!)

శ్రీరాముడి మేకప్ గురించి కొంచెం శ్రధ్ధవహించవలసింది లాంటి విమర్శలన్నీ అలాంటివే. సీతాదేవిలో "ఐటం గర్ల్" యెవరూ కనపడలేదు. (భూమ్మీద బోర్లా పడుకొని, తన పళ్లన్నీ బయటపెడుతూ దుఃఖిస్తున్నప్పుడు మాత్రం అందవికారంగా వుంది.) ఇతరపాత్రలూ, పిల్లల నటనా, గ్రాఫిక్సూ, సమకాలీనంగా, బాగున్నాయి.

ఈ సినిమాని ఆంధ్రదేశం మొత్తం మీద, ప్రతీరోజూ, యేదో ఒక థియేటర్లో కొన్ని సంవత్సరాలపాటు ప్రదర్శిస్తూ, జనాలకి దాన్ని చూసే భాగ్యం యెవరైనా కల్పిస్తే సంతోషించేవాళ్లలో మొదటివాణ్ని నేను.

(టీవీలో యే ఛానెల్ అయినా అలా ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది)

ఆ బాపూ రమణలకీ, జొన్నవిత్తులవారికీ నా పాదాభివందనాలు. (యేదైనా లోపం యెక్కువగా వుందంటే--అది ఇళయరాజా సంగీతమే!)

శుభంభవతు!

Sunday, March 11, 2012

వేదికలపై............వాక్ప్రవాహాలు

మీరెన్నయినా చెప్పండి......అతి సర్వత్ర వర్జయేత్!

ఈమధ్య అనేక సభలూ, సమావేశాల్లో, సన్మానాల్లో, వివిధ కార్యక్రమాల్లో మనం చూస్తూనే వున్నాము. స్వడబ్బాలు అంతగా లేకపోయినా, పరడబ్బాలూ, పరస్పర డబ్బాలూ యెక్కువై పోయాయి.

ప్రతీ వ్యక్తీ తన జీవితకాలంలో తగిన సాఫల్యం చెందాలనే తన ప్రయాణం ప్రారంభిస్తాడు. 

ఓ కళాకారుడైనా, కవీ, రచయితా, సినీ కవీ--ఇలా యెవరైనా అందుకు కఠోర దీక్షతో శ్రమిస్తారు. కానీ కొంతమందికే "సాఫల్యం"......యేదో ఒక రూపంలో లభిస్తుంది.

వుదాహరణకి, పింగళీ, ఆత్రేయా, వేటూరీ, సిరివెన్నెలా.....ఇలా అందరూ కొన్ని వేల పాటలు వ్రాశారు. ఫలానా పాటకి ఫలానాది స్పూర్తి...అని కూడా ప్రకటిస్తూ వుంటారు. 

వాళ్లు వ్రాసిన పాటల్లో నిజంగా "మంచి పాటలు" ఒక శాతం కూడా వుండవు. సమీక్షకులూ, విమర్శకులూ, సాహితీ బంధువులూ వగైరాలూ, వారి వెనుక జనసామాన్యం "మంచిపాటలు"గా గుర్తించినవి ఓ 2 నుంచి 3 శాతం వుండొచ్చు. 

రికార్డు కంపెనీలూ, క్యాసెట్ కంపెనీలూ, ఇప్పుడు సీడీ/డివీడీ కంపెనీలూ "హిట్"లుగా చెప్పేవి ఓ 5 శాతం వుండొచ్చు. 

కానీ, మిగిలిన వాటి సంగతేమిటీ? ఆ మాత్రానికి....అంత అవసరమా?  

ఆవేశంలో వచ్చినట్టే, వుద్వేగంలో మాటలొచ్చేస్తాయి-- 

సంతోషం ప్రకటించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, పొగడ్డానికి--ఇలా ప్రవాహంగా వచ్చేస్తూ వుంటాయి!

మనసులో యేర్పడుతున్న ఆలోచనల గొలుసుకట్టుని వెంటవెంటనే మాటల్లోకి మార్చుకొని, చక్కగా వారి భావాలని శ్రోతలకి, మనసుల్లోకి చొచ్చుకొనిపోయేలా చెప్పడం అనేది--పుంభావ సరస్వతులకి మాత్రమే సాధ్యం!

కాళా తపస్వులకీ, ఎస్పీ బాలు లాంటివాళ్లకీ, సిరివెన్నెల లాంటి వాళ్లకీ, సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల--ఇలా చాలా మందికి అది వుగ్గుతో అబ్బిన విద్య.

కానీ.......

అక్కడే సంయమనం అవసరం. 

చూసేవాళ్లకీ, వినేవాళ్లకీ "అంతుందా?" అనిపిస్తే, మీ నటన (అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్) యేమి సాధించినట్టు?

ఎస్పీ ఈ మధ్య కొంతవరకు సంయమనం పాటిస్తున్నాడు....ఇంతకన్నా నేను ఇంక యెక్కువ మాట్లాడను....అనేస్తున్నాడు. 

రెండు సంవత్సరాలుగా, శివరాత్రిరోజున, "పాడుతా తీయగా"కి తనికెళ్ల భరణి ని ఆహ్వానించి, ఆయన "తుస్....బుస్....ఖస్....శంకరా" అంటూ చదువుతున్న కవితలని బాగా మోసేస్తున్నాడు. సందేహం లేదు--భరణి అలౌకిక ప్రజ్ఞ కల కవీ, రచయితా. 

కానీ......

"హూష్.....
స్పేస్........
సుభాష్...
చంద్రబోస్ లా.....

అంతా ఖామోష్!"

ఇది వ్రాసిందెవరో గుర్తొచ్చిందా?

మరెందుకీ శషభిషలు?

"ఆయన నాకు తండ్రితో సమానం...వాడిక్కూడా తండ్రితో సమానం అంటున్నాడుకాబట్టి, వాడు నాకు సోదరుడితో సమానం....." ఇలా భాషణం సాగాల్సిన అవసరం వుందా?

పెద్దలు నామాటలని "విమర్శగా" కాకుండా, ఓ సలహాగా స్వీకరిస్తే సంతోషిస్తాను. 

ముఖ్యంగా......ఇలాంటివాటివల్ల కొన్నివర్గాల ప్రేక్షకులనీ, శ్రోతలనీ, సామాన్య జనాన్నీ దూరం చేసుకొంటున్నారని గమనిస్తే......ఇంకా సంతోషం!

గ్రహించండి.

Saturday, February 11, 2012

తెలుగు సాహిత్యంసాహిత్యం అంటే....

(ఇదివరకటి నా టపా "చక్కని సాహిత్యం అంటే....ఇలా వుండాలి ట" కి కొందరైనా సాహితీపరులు స్పందిస్తారనుకున్నాను. అంతకు ముందు టపాలకి కూడా స్పందన లేదు....యెందుకో మరి)

కవీ, రచయితా, చిత్రకారుడు, ఇంకా చాలా అయిన "బహుముఖ ప్రజ్ఞావంతుడు" అడివి బాపిరాజు 1946 లో వ్రాసిన "కోనంగి" నవలలోనివి ఆ టపాలో వ్రాసిన పేరాలు.....అక్కడక్కడా సేకరించినవి.

ప్రతి పిచ్చిరాతా "సాహిత్యం"గా చెలామణి అయిపోతున్న ఈ రోజుల్లో, అలాంటి సాహిత్యం అరుదుగా కనిపిస్తుంది అనే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాశాను.

ఒక సమయంలో, సినీ పరిశ్రమలో అ, ఆ లు అంటే, "అక్కినేని, ఆదుర్తి" అనేవారు. అవేరోజుల్లో, అక్కినేని "అ ఆ లు" (అక్కినేని ఆలోచనలు) అనే పేరుతో కవితలు వ్రాస్తే, "వీడికి అదొక్కటే తక్కువ" అన్నవాళ్లున్నారు. 

ఇప్పుడొస్తున్న కవితలూ, తవికలూ, హైకూలు, నానీలు, నానోలు, తాతీలు, తాతూలు లాంటి "కవిత్వం" తో పోలిస్తే, అవి గొప్పకవితలు అనిపిస్తాయి.

అవి ఇప్పుడు యెక్కడైనా దొరుకుతున్నయో లేదో!