Sunday, July 3, 2011

అన్నమయ్య సాహిత్యం.....

 .....తి తి దే ప్రాజెక్టూ

నా ఈ ఆంతర్యం (బ్లాగు)లో "ముద్దు కారే" టపా వ్రాసిన నెలా పదిహేనురోజులకి ఓ స్పందన వచ్చింది వులిమిరి సూర్యనారాయణ గారి నుంచి. అంతలో మరో స్పందన--లలిత గారి నుంచి! ఇద్దరూ మంచి సమాచారం ఇచ్చారు. వులిమిరివారైతే, గరిమెళ్ల వారి పాటల లింకు రూపంలో వో ఖజానానే ఇచ్చారు. లలితగారు పిల్లలకోసం మంచి బ్లాగ్ నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ నా ప్రత్యేక అభినందనలు.

కానీ--నేను విమర్శిస్తూవస్తున్నది తి తి దే వారి సోకాల్డ్ అన్నమాచార్య ప్రాజెక్టునీ, అందువల్ల తెలుగు వాళ్లకి వొనగూడిన "ప్రయోజనాన్నీ"! ఆ ప్రాజెక్టూ, వాళ్లు పరిష్కరించామని చెప్పుకుంటున్న అప్పటి తెలుగు లిపి గురించీ! నా ఇదివరకు టపాలలో, "పదివేల శేషులు" యెక్కడనించి వచ్చారూ? "పన్నగంపు" అంటే యేమిటీ? "దోమతెరలు" అప్పుడు వున్నాయా?--ఇలాంటి వాటి గురించి వ్రాశాను. మెచ్చుకున్నవాళ్లు మెచ్చుకున్నారు. ఇప్పుడే కాస్త "సబ్జెక్ట్" వున్నవారి స్పందనలు వచ్చాయనుకుంటా.

నా బాధంతా, పాతకాలంలో కూడా వాళ్లకి "అందుబాటులోవున్న పరిమిత" వనరుల ఆథారంగా, మల్లంపల్లివారూ, రాళ్లపల్లివారూ, తాపీ వారూ, తూమాటివారూ, అక్కిరాజువారూ--మనకి తెలియని, యెప్పటికీ తెలుసుకోలేని, పాళీ, పైశాచీ, ప్రాకృత, ప్రాచీన తెలుగు లాంటి భాషలలో వున్న శాసనాలూ వగైరాలని, "మనకి అర్థం అయ్యేలా, సంతృప్తి కలిగేలా" వివరించగలిగారు.

మరి "జాను తెనుగు"లో వ్రాసిన అన్నమయ్య కీర్తనలని, సామాన్య భక్తుల మనోభావాలని ప్రతిబింబిస్తూ, వ్రాసిన అన్నమయ్య కీర్తనలు అర్థం లేనట్టుగా, మనకి అర్థం కానట్టుగా యెందుకు పరిష్కరించారు? వాటిని మనం గుడ్డివాళ్లలా అనుసరించాలా? ఇవీ ప్రశ్నలు.

మేము హైస్కూల్లో వున్నప్పుడు, మా తెలుగు పాఠ్య గ్రంధాల్లో, "కమలాక్షునర్చించు కరములు, కరములు" లాంటి పద్యాలూ, అందులో అలంకారాలూ చదువుకున్నాము. అలాగే అప్పటికి అందుబాటులో వున్న కొన్ని అన్నమయ్య కీర్తనలగురించీ, ఆయన జీవితం గురించీ, 32 వేలకు పైగా కీర్తనలు వ్రాశాడనీ, వాటిని ఓ రాజుగారు రాగిరేకులమీద వ్రాయించి భద్రం చేశాడనీ చదువుకున్నాము. వాటిలో సందేహాలేమాత్రం లేవు.

మరి శోభారాజులు ప్రాచుర్యంలోకి తెచ్చిన "అదివో! అల్లదివో"; "విన్నపాలు వినవలె"; "ముద్దుకారే యశోద" లాంటి కీర్తనల్లోనే యెందుకు సందేహాలు వస్తున్నాయి? గరిమెళ్లవారుగానీ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గానీ, లతా మంగేష్కర్ గానీ, మంగళంపల్లి గానీ--తమకి అందుబాటులో వున్న "సాహిత్యానికి" ట్యూన్లు కట్టి, వీనులవిందుగా పాడారేగానీ, ఆ సాహిత్యాన్ని "ప్రశ్నించే" ప్రయత్నం చెయ్యలేదు! చాపక్రింది నీరులా, ఆ "సాహిత్యమే" వ్యాపించి, పూజలందుకొంటోంది!

నాకు తెలిసీ, తెలుగు సాహిత్యంలో విశ్రాంతి యెరుగకుండా, అలుపన్నది లేకుండా, (తనకి అంత సమయం యెలా వచ్చేదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే!)  కృషి చేసినవాడు "ఆరుద్ర!" ఆయన "సమగ్రాంధ్ర సాహిత్యం", "నిఘంటువు", "వేమన్న వేదం" లాంటి యెన్నో "బృహద్గ్రంధాలని" వ్రాశాడు. (నేనేమీ ఆరుద్ర అభిమానిని కాదు. ఇంకా అంటే "కె రా" అభిమానిని!).

వుదాహరణకి, ఆయన వ్రాసిన వేమన్న వేదంలో ప్రతీ పద్యానికీ, "మదరాసు ప్రాచ్య లిఖిత భాండాగారం" లోని 54 సంపుటాలలో వున్న పద్యాలనే "ప్రామాణికంగా" తీసుకొన్నాడు. పైగా, వాటిని "బ్రౌన్ దొరగారు" సేకరించిన పద్యాలతోటీ, ఆయన నిఘంటువులోని పద "అర్థాల"తోటీ బేరీజు వేస్తూ, ఆయన రచన కొనసాగించాడు. వుదాహరణకి లలితగారు తమ ఆంతర్యంలో పెట్టిన, అంతర్జాతీయంగా ప్రతి తెలుగువాడూ ఇప్పుడు అదే సరియైనది అనుకుంటున్న "అనువుగాని చోట" పద్యం తీసుకొంటే, వేమన వ్రాసిందీ(?!), ఆరుద్ర చెప్పిందీ--అసలు పద్యం.......

"అనువుగానిచోట నధికులమనరాదు, యొదిగి యొక్కవంక నుండవలయు, మర్రియాకుపైన మాధవుడుండడా? విశ్వదాభిరామ వినురవేమ!"

ఇదీ అసలు పాఠం! (ఇలాంటివి కొన్నివేలున్నాయి--శ్రధ్ధ పెడితే!)

(అప్పట్లో తమిళనాడుని "మదరాసు" రాష్ట్రం అనేవారు. దాని ముఖ్యపట్టణం (నేటి చెన్నై) ని కూడా "మదరాసు" అనే అనేవారు. ఆరుద్ర చెప్పిన "ప్రాచ్య లిఖిత భాండాగారం", తంజావూరులో నెలకొన్న "సరస్వతి మహల్" వొకటేనో వేరువేరో నాకు తెలీదు).

కానీ, "వెయ్యేళ్ల ప్రాచీన భాష" గా తెలుగుని గుర్తించి, కేంద్రం ఇచ్చిన యెన్నో కోట్లతో మనం యేమి చేశామో? కనీసం ఆ ప్రాచ్య లిఖిత భాండారాల్లోనుంచి మన "తెలుగు" కి సంబంధించిన "తాళ పత్రాలనీ", ఇతర "అముద్రిత" గ్రంధాలనీ మన "రాష్ట్రానికి" తెచ్చుకున్నామా? కనీసం ప్రయత్నం చేశామా?

అమెరికలో "తానా" మహాసభలూ, ఇంకేవో (చిట్టెన్ రాజుగారన్నట్లు 'తంతా') సభలూ వగైరా నిర్వహిస్తున్నాం. కానీ, "యెవరాతల్లి? యెవడికి తల్లి?" అన్నవాణ్ని యేమంటాము?

......తరువాయి మరోసారి.