Wednesday, May 26, 2010

సహజకవి

‘వేటూరి…..

….సుందర రామ్మూర్తి'…..ఇకలేరు!

గొప్ప కవి ఆయన—యెందుకంటే—అర్థం లేని అలతి అలతి పదాలతో, గొప్ప గొప్ప సినిమా పాటలు వ్రాసేశాడు.

గొప్ప కవిత్వం వ్రాశాడు ఆయన—కానీ దాన్ని ఖూనీ చేసి, ఆయన వ్రాసిన సినిమాకికాకుండా వేరే సినిమాలో చిత్రీకరించి, ఆయన వ్రాసిన సన్నివేశానికి కాకుండా, వేరే సన్నివేశం లో చిత్రీకరించి, ఆయన వ్రాసిన వరుస(క్రమం)లో కాకుండా వేరే క్రమం లో చరణాలని మార్చేసి చిత్రీకరించి—కళాఖండాలు నిర్మించారు కళా తపస్వులు!

ప్రముఖ ‘కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం (అన్నీ)’ చేసేవాళ్ళకి ‘ఘోస్ట్’ గా వ్రాసిన పాటల దగ్గర నించీ, ఆయన మంచిపాటలే వ్రాశాడు.

కాని నాకుమాత్రం, మొహమాటం లేకుండా చెపుతున్నా—వ్రేళ్ళ మీద లెఖ్ఖ పెట్ట దగినన్ని పాటలే నచ్చాయి! (సినిమాలలో వచ్చినవి!)

‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ…..’ ఆయన వెళ్ళాడనీ, అక్కడైనా చక్కని కవిత్వం వ్రాసుకుంటాడనీ, ఆశిస్తాను.

Wednesday, May 5, 2010

పద్యసాహిత్యం

ఆణిముత్యాలు

"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్పవింటివో! కలనైనన్ రఘూద్వహుడు కానలలోనను త్రోయబంచునే?"

ఈ పద్య పాదం కంకంటి పాపరాజు వ్రాసిన 'ఉత్తర రామ చరిత్ర' లోది.

పాపరాజు చక్కటి తెలుగులో ఖండకావ్యాలూ, కావ్యాలూ వ్రాశారు. 

సన్నివేశం--లక్ష్మణుడు, సీతని గర్భవతిగా వున్నప్పుడు, రాముడు ఆవిడ కోరిక ప్రకారం వనసీమలలో విహారానికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్పి, అక్కడికి చేరాక, చావుకబురు చల్లగా చెప్పాడు--అక్కడ వదిలేసి రమ్మన్నాడని.

అప్పుడు ఒక్కసారిగా షాక్ తిన్న సీత, ఆ షాక్ లక్షణాలని లక్ష్మణుడికి ఆపాదిస్తూ, 'నువ్వే కలవరపాటు తో ఇలా చెపుతున్నావో? లేక ఆయన చెప్పిన మాటలు పరాగ్గా వుండి యేమి విన్నావో! కలలోనైనా, రాముడు నన్ను అడవుల్లో త్రోయమని పంపిస్తాడా!' అని ప్రశ్నిస్తుంది సీత.

ఆవిడకెంత నమ్మకమో రాముడి మీద--పిచ్చి తల్లి!

పద్యం పూర్తిగా గుర్తుకి రాలేదు--యెవరూ పూరించలేదు!

సరే.

"రంతుల్ మానుము కుక్కుటాధమ......ఉలూఖల.....తండులముల్...."

యెవరైనా పూరించగలరా?