Saturday, January 22, 2011

సాహితీ సేవ



నేఁజేసిన ఓ మంచి పని

సాహితీ సేవ అంటే, మనం యేవో సాహిత్యం వ్రాసెయ్యడం, చదివెయ్యడమే కాదు--సాహితీ సేవ చేస్తున్నవాళ్లకి కాస్త ప్రోత్సాహం ఇవ్వడం కూడా.

మూడేళ్ల క్రితం నేను "ఆన్ లైన్" పత్రికల గురించి వెదికితే, "కౌముది" కనిపించింది. అప్పటినించీ ప్రతీ నెలా క్రమం తప్పక "చూస్తున్నాను", అందులో కొన్ని చదువుతున్నాను. 

మొన్నీ మధ్య, కొమ్మూరి సాంబశివరావు గారి (మా చిన్నప్పుడెప్పుడో చదివిన) '888' నవలని పూర్తిగా చదివాను. 

ఈ మధ్య, హారం లో టపాలు చదివి, వాటి మీద నచ్చో, నచ్చకో వ్యాఖ్యానిస్తే, చేదు అనుభవాలు యెదురయ్యాయి. నచ్చి, ఆ మాట వ్రాసినా, అదేదో బూతులు తిట్టినట్టు భావించి, ఒంటికాలిమీద నా మీదకొచ్చిన వాళ్లని చూశాను. 

ఆ సందర్భంగానే, మొన్న జనవరి 1న తీర్మానం చేసుకొని, ప్రకటించాను--ఇక యెవరి టపాలమీదా వ్యాఖ్యలు వ్రాయనని. (ఫణిబాబుగారొక్కరూ అలా కుదరదు అన్నారు అందుకే అయన టపాల మీద మాత్రం వ్యాఖ్యానిస్తున్నాను. మిగిలినవాటి మీద మానేశాను--ఇంక ఆపుకోలేకపోతే తప్ప.)

కాలక్షేపం కోసం, ఈనెల (జనవరి, 2011) కౌముదిని తిరగేస్తుంటే--ఆశ్చర్యం! అనేక కొత్త ధారావాహికలు మొదలయ్యాయి! దాంతోపాటు, అనేక వైవిధ్యమున్న కథలు, శీర్షికలు, (హాస్యం, కార్టూన్లు వగైరా కాకుండా) అనేక వ్యాసాలూ--ఓహ్! సాహిత్య విందు!

కాకతాళీయంగా ఇవన్నీ చూడకపోయి వుంటే, యెంత పోగొట్టుకొనేవాణ్ణి! వచ్చే సంచికలో యేమి వుంటాయో కాస్త ముందుగానే మనకి తెలిసే యేర్పాట్లు కౌముది వారు చేస్తే యెంత బాగుండునో కదా! 

అమ్మాయి "కిరణ్ ప్రభ" కి ప్రత్యేక అభివందనాలు. కీపిటప్!