Monday, March 22, 2010

సాహిత్య ప్రక్రియ

అవధానాలు

పందొమ్మిదో శతాబ్దం నుంచీ ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకూ రెండురకాల అవధానాలు ప్రసిధ్ధమైనవి—అష్టావధానం, శతావధానం.

వీటి గురించి అందరికీ తెలుసు. ఆష్టావధానం అంటే, యెనిమిది మంది పృఛ్ఛకులు అవధానిగారిని యెనిమిది విషయాల్లో ప్రశ్నించేవారు. కొన్ని చోట్ల కొన్ని అంశాలు మార్చినా, యెనిమిది మంది పృచ్చకులూ మారలేదు.

ఉదాహరణకి—దత్తపది; వ్యస్థాక్షరి; నిషిధ్ధాక్షరి; సమస్యా పూరణం; వర్ణన; కావ్య పఠనం; ఘంటా గణనం; తేదీలు చెప్పి వారం అడగడం; ఆశువు—ఇంకా అప్రస్తుత ప్రసంగం—ఇలా వుండేవి.

ఇక శతావధానం అంటే, ఓ వందమంది పృఛ్ఛకులకి, వారడిగిన ఛందస్సులో, వారడిగిన విషయం పై, మొదటగా అందరికీ మొదటి పాదం, మళ్ళీ మొదటివారి దగ్గరనించి రెండోపాదం—అలా నాలుగు పాదాలూ పూరించడమే కాకుండా ఆఖర్న ఆ వంద పద్యాలూ ఒకదాని వెనుక ఒకటి మళ్ళీ పూర్తిగా చెప్పడం!

ఈ ప్రక్రియల్లో అనేకమంది ప్రజ్ఙ్ఞావంతులున్నా, ప్రత్యేక స్థానం తిరుపతి వెంకట కవులది. (వీరు సాహిత్యం లో బహుముఖ కృషి చేశారు. కథలూ, కావ్యాలూ, నాటకాలూ, వ్యాసాలూ, విమర్శలూ—ఇలా అనేక ప్రక్రియల్ని ప్రతిభావంతం గా నిర్వహించారు.)

ఇక తరవాత విషయానికొస్తే, అష్టావధానాలు—ద్విగుణిత, త్రిగుణిత, చతుర్గుణిత—ఇలా పృఛ్ఛకుల సంఖ్యా, విషయాలూ పెంచి, అవధానాలు నిర్వహించిన వారున్నారు.

శతావధానాల్లో, సహస్రావధానులు వచ్చారు.

కొత్తగా, నాట్యావధానం; సంగీతావధానం; నేత్రావధానం—ఇలా కొత్త ప్రక్రియలు చేపట్టి, ప్రతిభావంతం గా ప్రదర్శించినవారున్నారు. కానీ ఇవి అంత ప్రాచుర్యం పొందినట్లు లేదు.

ఆష్టావధానుల విషయానికొస్తే, మేడసాని మోహన్; కవితా ప్రాసాద్; గరికపాటివారూ, కట్టమూరివారూ—ఇలా అనేకమంది ప్రసిధ్ధులు.

శతావధానుల్లో, కడిమెళ్ళవారు ‘సహస్రావధాని ‘

యెటొచ్చీ మిగిలిన వాటిల్లోనే ఒకళ్ళిద్దరు తప్ప యెవరూ ప్రసిధ్ధులవలేదు—ఇప్పుడెవరూ వాటిని సాధన చేస్తున్నవాళ్ళు వున్నట్టు కనపడదు.

నేత్రావధానం తీసుకొంటే, ఇద్దరు ‘సిస్టర్స్ ‘ అలవోకగా చేశేవారు. పృచ్చకులు ఇచ్చిన సందేశాన్ని ఒకామె తన నేత్రాలతో సైగలు చేస్తూంటే, కొంతదూరం లో వున్న రెండో ఆమె ఆ సైగల్ని గ్రహించి, ఆ సందేశాన్ని యథాతథం గా వ్రాసి, అందర్నీ ఆశ్చర్యపరిచేది.

బోయ్ స్కౌట్స్/గైడ్స్ లో జెండాలతో ‘సిగ్నలింగ్’ నేర్పించేవారు. అది మోర్స్ కోడ్ లాంటిది.

మరి నేత్రావధానానికి మోర్స్ కోడ్ కీ యేమైనా సంబంధం వుందోలేదో నాకు తెలియదు.

తరవాతది, నాట్యావధానం. అంటే ‘నటన ‘ లో అవధానం. ప్రసిధ్ధులు ధారా రామనాథ శాస్త్రి సోదరులు ప్రతిభావంతం గా నిర్వహించేవారు.

ప్రక్రియ యేమిటంటే, పృఛ్ఛకుల్నించి యేదైనా సన్నివేశం ఆహ్వానించి, సమస్య ఇచ్చిన 15 నిమిషాల లోపల—ఆహార్యం, వాచికం, సంగీతం—ఆశువుగా నిర్వహిస్తూ, ఆ సన్నివేశాన్ని నటించి చూపించేవారు!

పృఛ్ఛకుల్ని వీలైనంత వెరైటీ చూపించమనేవారు—ఒకరు పౌరాణికం; ఒకరు సాంఘికం; ఒకరు చారిత్రకం; ఒకరు జానపదం—ఇలా సన్నివేశాలనిమ్మని.

ఉదాహరణకి, ‘శాపగ్రస్తుడైన కర్ణుడి చావు ‘—ఒకరు కర్ణుడు, ఒకరు అర్జునుడు; గురజాడవారి గిరీశం, మొక్కపాటివారి బారిష్టరు పార్వతీశం కలుసుకొంటే, యెలా వుంటుంది (ఒకరు గిరీశం, ఒకరు పార్వతీశం); కళింగ యుద్ధం అయిపోయాక, అశోకుడూ, బుధ్ధుడూ (వివరించక్కర్లేదుకదా—యెవరెవరో?)—ఇలా!
మేమిచ్చిన కర్ణుడి సన్నివేశం లో, పొరపాటున ఆయన కొంచెం గట్టిగా మొత్తుకోగానే, ఓ కర్ణాభరణం జారి పడిపోయింది!

ఆయన డైలాగు—‘ఆహా! నా కర్ణాభరణము నేలవ్రాలుట కూడ అశుభమునే సూచించుచున్నది! హా! హతవిధీ! అన్నిశాపములతోను, నా విధికూడ నన్ను వెక్కిరించుచున్నదికదా! అర్జునా! ఆగుము! నిస్సహాయుని వధించుట వీరత్వమనిపించుకోదు!’

ఇంకేమి చెప్పాలి?

ఇక సంగీతావధానం గురించి మరోసారి.

Tuesday, March 16, 2010

దైవదత్తం

పుంభావ సరస్వతి

సరస్వతిదేవి కళలకి కాణాచి. ఆమెని పురుషుడిగా భావిస్తే, ఆ వ్యక్తిని పుంభావ సరస్వతి అంటారు.

అలాంటివాళ్ళలో మొదటివాడు కాళిదాసు!

రెండోవాడు మన గరికపాటి నరసిం హా రావు! ఇవాళ ఓ చానెల్లో ఆన్ లైన్ అష్టావధానాన్ని అలవోకగా నిర్వహించాడు!

యెంతమందినో అవధానులని చూశానుగానీ, ఇలా అలవోకగా నిర్వహించేవాడు ఈయనే!

ఓం హ్రీం క్లీం ఐం లం యం.....వీటిని బీజాక్షరాలు అంటారు.

ఈ బీజాక్షరాలతోనే మంత్రాలు మొదలవుతాయి--దైవపూజకైనా, క్షుద్రపూజకైనా.

కాళిదాసు తన భార్యా పిల్లలతో కాళికాలయం లో ఆశ్రయం పొందుతూ, తన అపాండిత్యాన్ని అందరూ హేళన చేస్తే, భార్య కూడా ప్రశ్నిస్తే, కాళిక విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకోబోతుంటే, కాళికాదేవి అతని నాలుక పై బీజాక్షరాలు వ్రాసిందట--అవేమిటో తెలియదుగానీ, అతను మహా కవి అయిపోయాడు.

ఓ సారి భోజరాజు ఆస్థానం లో పెద్ద సమస్య వచ్చి, నవరత్నాలలో యెవరు గొప్ప కవి, పండితుడు అనే పోటీ వచ్చినప్పుడు, స్వయం గా కాళికాదేవిని అడగడానికి వెళ్ళారందరూ.

అప్పుడు కాళికాదేవి 'కవిర్దండిః, కవిర్దండిః, భవభూతిః పండితః!' అందట.

కోపం వచ్చిన కాళిదాసు, 'కోహం రణ్డే?' అనడిగితే......

'త్వమేవాహం! త్వమేవాహం! న సంశయః!' అందట.

దండి కవి, భవభూతి పండితుడు అని చెప్పిన కాళికని, మరి నేనెవరినే రండా? అని కాళిదాసు అడిగితే, నువ్వే నేను, నేనే నువ్వు--అందట! 

అంటే, నేను రండనైతే, నువ్వూ అదే అనేకదా?

యెలావుంది?