Tuesday, October 16, 2012

తెలుగు నాటక సాహిత్యంఒక గొప్ప రచన

ముత్యాలముగ్గు సినిమాలో 'మాడా' - రావు గోపాలరావుతో బేరమాడుతూ, "మర్డరుకీ సెపరేషనుకీ యెంతవుద్ది, సెపరేషనుకీ మేరేజికీ యెంతవుద్ది, మర్డరుకీ, సెపరేషనుకీ, మేరేజికీ యెంతవుద్ది..........వోలుమొత్తానికి యెంతవుద్ది? కన్సెసనేమైనా వుందా?" అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పిన 'పొడవాటి ' డైలాగు గుర్తుందా?

అంతకు యాభయ్యేళ్ల క్రితమే ఓ నాటకంలో ఈ క్రింది సంభాషణని గమనించండి.

"అలాగైతే, సంబంధాల విషయంలో మీయభిప్రాయము ఏమిటో సంగ్రహముగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక చదువూ, సంప్రదాయమా? సంప్రదాయమూ సంపత్తా? సంపత్తూ చక్కదనమూనా? చక్కదనమూ చదువూ; చదువూ సంపత్తూ--ఈ విధముగా వుండవలెనా?"

ముళ్లపూడివారికి ఈ సంభాషణే స్పూర్తి యేమో!

ఈ సంభాషణ కాళ్లకూరి నారాయణరావుగారి "వరవిక్రయము" అనే నాటకం లోనిది.

1921 వ సంవత్సరంలో మొట్టమొదట ప్రచురింపబడి, తరువాత అనేక ముద్రణలు పొందుతూ, జాతీయోద్యమంలో భాగంగా కొన్నివేల ప్రదర్శనలకి నోచుకొన్న ఈ నాటకం మరుగునపడినా, అందులో విమర్శింపబడ్డ "వరకట్న దురాచారం" మాత్రం ఇంకా సమసిపోలేదు.

గురజాడవారు విమర్శించిన "కన్యా శుల్కం" అనే ఆచారం సహజ మరణం చెందడానికి కారణం, అప్పట్లో "విధవా వివాహాలు" చెయ్యవలసిరావడం జోరందుకోబట్టే, దానికి బ్రాహ్మణ్యం మింగలేక, కక్కలేక వూరుకోవడమే అనే వాదన నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ వరకట్నానికి సహజమరణం ప్రాప్తించేలా అన్ని కులాల్లోనూ యే ప్రక్రియా వూపందుకోకపోవడమే అది ఇప్పటికీ వర్ధిల్లడానికీ, వృధ్ధిపొందడానికీ కారణమేమో!

యేదైనా, ఈ నాటకాన్ని విరివిగా ప్రదర్శిస్తే కొంతలో కొంతైనా వుపయోగం వుంటుందేమో. ఇక కన్యాశుల్క నాటకాన్ని వదిలేసి, ఈ వరవిక్రయాన్ని మీడియావాళ్లూ, సాహితీపరులూ, సంస్కరణాభిలాషులూ తలకెత్తుకొంటే, యేమైనా వుపయోగముండచ్చేమో!

యేమంటారు?

(ఆ నాటకం లోని కొన్ని చక్కటి సంభాషణలు విడతలవారీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను--మీరు చదవడానికి ఆసక్తి చూపితే.)

5 comments:

VSTSayee said...

http://andhrabharati.com/nATakamulu/varavikrayamu/index.html

Ammanamanchi Krishna Sastry said...


డియర్ VSTSayee!

చాలా సంతోషం.

కానీ మీరిచ్చిన లింకుతో ఆ సైట్ కంప్యూటర్ భాషలోనే తెరుచుకుంటోంది! చదవడానికి వీలవలేదు.

ధన్యవాదాలు.

VSTSayee said...

Dear KrishnaSastry gAru,
Please use InternetExplorer to browse.
Regards.

Ammanamanchi Krishna Sastry said...

డియర్ VSTSayee!

మీ వ్యాఖలో లింకు చూసినప్పటికి “తెలుగు వెలుగు” లో మీ అమోఘ కృషి గురించి వచ్చిన వ్యాసం ఇంకా చదవలేదు.

చదివిన తరవాత ఇతర కారణాలవల్ల మీ వెబ్ సైట్ చూడలేకపోయాను. ఇప్పుడే చూశాను.

నిజంగా అమోఘమైన కృషి. నా అభివందనాలు.

మీ కృషి కొనసాగించండి. మేమేమైనా సహాయం చెయ్యగలం అంటే, వ్రాయడానికి సందేహించకండి.

మరోసారి ధన్యవాదాలు.

Anonymous said...

sir, CP BROWN SEVA SAMITHI vaaru jaateeya sthaayilo PADYA, GEYA, NAATAKA rachanala poteeni nirvahistunnaaru. dayachesi, www.cpbrown.org lo vivaraalu choodandi.