Sunday, May 20, 2012

బాపు సృష్టి.....


.....శ్రీరామరాజ్యం

మన టీవీ వాళ్ల పుణ్యమా అని, ఇవాళ (20-05-2012) వుదయం ఓ ఛానెల్లో "లవకుశ"; సాయంత్రం ఇంకో ఛానెల్లో "శ్రీరామరాజ్యం" రెండు సినిమాలూ చూడగలిగాను. (ఇంతవరకూ శ్రీరామరాజ్యం చూసే అవకాశం రాలేదు.)

లవకుశ సినిమాలో ప్రతీ ఫ్రేమూ ఇప్పటికీ నాకు గుర్తున్నా, మళ్లీ ఓ సారి పునశ్చరణ చేసుకొనే అవకాశం వచ్చింది.

ఇంక శ్రీరామరాజ్యం గురించి ఆ సినిమా విడుదల అయినప్పటినుంచీ అనేకమంది చేసిన వ్యాఖ్యలూ, సమీక్షలూ, పొగడ్తలూ, తెగడ్తలూ, వెకిలి విమర్శలూ.......అనేకం చదివాను, విన్నాను.

కానీ, చాలామంది పెద్దవాళ్లూ, పండితులూ కూడా దృష్టిసారించని, ప్రస్తావించని విషయం ఒకటి వుంది అందులో.

అది నిజంగా ఓ "దృశ్యకావ్యమే!"--ఇది అందరూ చేసినలాంటి పొగడ్త కాదు.

సాధారణంగా "రీమేకులు" ఒకసారి డబ్బుచేసుకొన్న కథని, ఇంకో భాషలో మళ్లీ డబ్బుచేసుకోడానికి తీస్తారు. మరి ప్రపంచ ప్రఖ్యాత బాపూ, రమణలకి ఆ అవసరం వుందా? ముమ్మాటికీ లేదు. అందుకే లవకుశని రీమేక్ చెయ్యలేదు వాళ్లు!

లవకుశని పూర్తిగా భక్తి భావంతో, ఇతిహాసం యెలా వుందో అలా చిత్రీకరించి, జనాల్లో భక్తి భావాన్ని రేకెత్తించినందుకు ఆ సినిమా విజయవంతమయ్యింది.

నిజంగా, ఇతిహాసం ప్రకారం, "రామరాజ్యం"లో, "సీతానింద" జరిగింది. దానిద్వారా, "శ్రీరామ నిందా" జరిగింది. అసలు దాన్ని "ఖండించడానికే" కంకణం కట్టుకొని,  వాల్మీకి వుత్తర రామచరిత వ్రాశాడన్నట్టూ, దానిద్వారా, కుశలవులచేత ఆ రామరాజ్యంలోనే ప్రచారం చేయించి, ఆ నిందలని దూరం చెయ్యడానికి ప్రయత్నించాడన్నట్టూ.......చాలా విపులంగా చెప్పారు!

అదీ ఆ సినిమా "హైలైట్"!

"అక్కడెక్కడో" లంకలో జరిగిన అగ్నిపరీక్ష గురించి, అయోధ్య ప్రజలకి యెలా తెలుస్తుంది? అందుకే నిందవేస్తున్నారు--అని చెప్పించి, దాన్ని చక్కగా డెవలప్ చెయ్యడం చాలా బాగుంది!

(అసలు అగ్నిప్రవేశ ఘట్టమే "ప్రక్షిప్తం"; వుత్తరరామ చరిత్రకోసమే అది సృష్టించారు అనేవాళ్లు కూడా వున్నారనుకుంటా).

(ఈ బ్లాగరు విధానం 'కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్' ప్రకారం అనేక లోటుపాట్లున్నాయి. కానీ, అవన్నీ--వారి దృష్టికి వచ్చినా, వ్యవధానంలేక, చూసీ చూడనట్టు వదిలేసినవే అని ఖచ్చితంగా చెప్పగలడు!)

శ్రీరాముడి మేకప్ గురించి కొంచెం శ్రధ్ధవహించవలసింది లాంటి విమర్శలన్నీ అలాంటివే. సీతాదేవిలో "ఐటం గర్ల్" యెవరూ కనపడలేదు. (భూమ్మీద బోర్లా పడుకొని, తన పళ్లన్నీ బయటపెడుతూ దుఃఖిస్తున్నప్పుడు మాత్రం అందవికారంగా వుంది.) ఇతరపాత్రలూ, పిల్లల నటనా, గ్రాఫిక్సూ, సమకాలీనంగా, బాగున్నాయి.

ఈ సినిమాని ఆంధ్రదేశం మొత్తం మీద, ప్రతీరోజూ, యేదో ఒక థియేటర్లో కొన్ని సంవత్సరాలపాటు ప్రదర్శిస్తూ, జనాలకి దాన్ని చూసే భాగ్యం యెవరైనా కల్పిస్తే సంతోషించేవాళ్లలో మొదటివాణ్ని నేను.

(టీవీలో యే ఛానెల్ అయినా అలా ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది)

ఆ బాపూ రమణలకీ, జొన్నవిత్తులవారికీ నా పాదాభివందనాలు. (యేదైనా లోపం యెక్కువగా వుందంటే--అది ఇళయరాజా సంగీతమే!)

శుభంభవతు!

6 comments:

Gopal said...

లేరు సాటి బాపు రమణలకు ..
రామాయణగాథను చెప్పుటలో ....

నేను కూడా రెండు సినిమాలు నిన్న చూసాను. లవకుశ ఇంతకు ముందు ఒకసారి చూశాననుకోండి, కాని శ్రీరామ రాజ్యం నిన్ననే చూసాను (ప్రవాసాంధ్రులం కదా).

నన్నడిగితే శ్రీరామరాజ్యం లవకుశకు పూరకం. కొన్నికొన్ని విషయాలు లవకుశలో చూపించలేదు. లవకుశులు పుట్టడం, పేర్లు పెట్టడం లాంటివి. ఆలోటు ఇందులో తీర్చారు.

యుద్ధం దగ్గరకూడా లేటెస్టు టెక్నాలజీ వాడడం వల్ల చాలాబాగా పండింది. లవకుశలో పాతకాలం టెక్నాలజీ కదా .. మతాబులు, విష్ణుచక్రాలు .....

నాకయితే శ్రీరామరాజ్యం బాగా నచ్చింది. ఇంతకు ముందు బ్లాగుల్లో యనిమేషన్ బాగుండలేదని (జింకలు మొ.) రాసారు కాని నాకు బాగానే ఉంది. నెమలి ముక్కు మరీ పెద్దది పెట్టారు అదే కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

నాకు ఒక బ్లాగు పోష్టే చెయ్యాలనిపించింది కాని మీరు చేశారు కదా ... ఈ కామెటు తో తృప్తి పడతాను.

శ్యామలీయం said...

అగ్నిప్రవేశ ఘట్టమే "ప్రక్షిప్తం"; వుత్తరరామ చరిత్రకోసమే అది సృష్టించారు అనేవాళ్లు కూడా వున్నారనుకోవటం కష్టం. అయితే ఉత్తరకాండ ప్రక్షిప్తం అనే వాదన ఉన్నది. కాని దానితో కలిపిగాని వాల్మీకంలో ౨౪వేల శ్లోకాలు పూర్తికావు.

ఏమాటకామాట చెప్పుకోవాలి. నేను ఈ సినిమా snippets మాత్రం బుల్లితెరమీద చూసాను. నచ్చలేదు. సినిమా చూసే సాహసం చేయలేదు. నిన్న బుల్లితెరపైన వచ్చింది కాని ఆసక్తిలేక చూడలేదు.

యేదైనా లోపం యెక్కువగా వుందంటే--అది ఇళయరాజా సంగీతమేనని అన్నారు కాని, అదే సంగీతం నభూతోనభవిష్యతి అన్నవాళ్ళనీ చూసానండి.

మీరు క్షమిస్తానంటే సమకాలీనంగా బాగుండటం అన్నమాట నాబోటి చాదస్తులకు నచ్చదని మనవి చేసుకుంటున్నాను. రాబోయే మరొక తరంలో వెస్ట్రన్ మ్యూజిక్ తో పూర్తి వెస్ట్రన్ దుస్తుల్లో గిటార్లు వాయించే లవకుశులనూ సమకాలీనదృష్టితో తెలుగువాళ్ళు ఆదరించవలసి ఉండేమో తెలియదు. అది మరొక దృశ్యకావ్యరాజంగానూ కీర్తించబడవచ్చును.

Anonymous said...

i missed even now. have to wait for a repeat telecast.

A K Sastry said...

డియర్ D. Venu Gopal!

"నెమలి ముక్కు" మరీ పెద్దదిపెట్టారా? నేను గమనించలేదు సుమీ!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ శ్యామలీయం!

అగ్నిప్రవేశ ఘట్టం ఖచ్చితంగా "వల్మీకం"లో వుంది. కానీ ఇప్పటి జనాలు అనుకొనే, ప్రచారం చేసే విధంగా కాదు.

అందుకే బాపూ రమణల ఇంటర్ ప్రెటేషన్ బాగుంది అన్నది!

సినిమా విడుదలై యేడాదే అయినా, ఇప్పటికే అందులోని ఓ పాటచెప్పి, అది యెందులోది అని అడిగితే, వెంటనే చెప్పలేకపోతున్నారు యెవరూ! ఇది చాలదూ "లోపం" అనడానికి?

మీరు చాదస్తులంటే నేన్నమ్మనుగానీ, "అవతార్" సినిమాని రామాయణం అంటూ యెగబడ్డవాళ్లకి మనం యేమి చెప్పగలం!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ puranapandaphani!

ఈసారి తప్పక చూడండి.

ధన్యవాదాలు.