Thursday, April 21, 2011

తెలుగు సినీ.....-2



......కళాఖండాలు--శంకరాభరణం

అసలు ఈయన (కే. విశ్వనాథ్) తో వచ్చిన గొడవేమిటంటే, తియ్యదలుచుకున్న సినిమాకి "స్క్రీన్ ప్లే" అంటూ వుండదు. వుంటే గింటే ఆయన బుర్రలోనే వుంటుంది. సినిమాకి ముఖ్యం అనుకున్న సీన్లు, క్యారెక్టర్లకోసం తనచుట్టూ తిరిగేవాళ్లనీ, హీరో హీరోయిన్లనీ పిలిచి గబగబా తీసేసి, వాటిని అతికేస్తాడు. తరవాత రషెస్ చూసి, అందులో బాగా ఆడడానికీ, కళాఖండం అని పేరు రావడానికీ యేమేమి లోపించాయో చూసి, మళ్లీ అవన్నీ రీళ్లు చుట్టేసి, ఆముక్కల్ని మళ్లీ సినిమాలో అతికించేస్తాడు. (నిజంగా అదొక కళ లెండి.)

ఈయనకీ, తెలుగు చిత్ర సీమకీ బాగా పేరు తెచ్చిన, ఇప్పటికీ "తరతరాల సాంప్రదాయాలని మరిచిపోకూడదు" అని చెప్పడానికి ప్రతీ వొక్కరూ వుపయోగించే "శంకరాభరణం" సినిమానే తీసుకోండి.

(అది ఓ కన్నడ సంగీత విద్వాంసుడి కథ అని కొందరంటారు.)

శంకర శాస్త్రి ఓ గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయనకి ప్రాణమైన రాగం శంకరాభరణం. ఆయన రాజమండ్రి గోదావరిలో, పుష్కరాల రేవులో మండుటెండలో స్నానం చేస్తూ, రాగాలు పాడుకొంటుంటే, ఓ బోగం పిల్ల (మంజు భార్గవి) ఆ లంకల్లో నాట్యం చేసేస్తూ వుంటుంది. 

ఈయనకి యెంత గోరోజనమంటే, ఓ సారి కచేరీ జరుగుతూ వుండగా, ఓ జమీందారు మంజుభార్గవీ వాళ్లమ్మతో మాట్లాడడానికి కుర్చీ లాక్కుని కూర్చుంటే, ఆ శబ్దాన్ని విని, కచేరీ ఆపేసి, వెళ్లిపోతాడు. (ఇలాంటి లక్షణాలవల్లనే ఆయనకి తరవాత కచేరీలు రాలేదు అని అర్థం రావడంలేదూ?)

సరే. మం. భా. ఓ రోజున ఆయన "శంకరాభరణమూ....." పాటని ఆస్వాదిస్తుండగా, (మధ్య మధ్యలో తానుకూడా పాడుకొంటూ, 'ఆహా...' అని పరవశిస్తూ వుంటే) ఆ జమీందారు వచ్చి, ఆవిడని "రేప్" చేసేసి వెళ్లిపోతాడు. (అక్కడ గ్రద్దా, పామూ బొమ్మ వ్రేళ్లాడం, రికార్డు అయిపోయాక కిర్రూ కిర్రూ అంటూ శబ్దం--ఇవీ సింబాలిజాలు.)

తరవాత ఆయన కన్నడదేశంలో కచేరీ చెయ్యడానికి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తూంటే, మం. భా. వచ్చి ఆయన పెట్టిలో యెక్కేస్తుంది. చాలా దర్పంగా బెంగుళూరులోనే అనుకుంటా, ఆయన దిగుతాడు. దండలతో స్వాగతం చెప్పడానికి వస్తారు--కచేరీ నిర్వాహకులు. కొంచెం గేప్ లో వెనకాలే మం. భా. దిగుతుంది. అక్కడ బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ సాధారణంగా యెవరూ గమనించి వుండరు--'యెంతవారలైనా, కాంతదాసులే!'--అంటూ! (అంటే దానర్థం? ఆయనకి కచేరీలు రాకుండా ఆగిపోవడానికి ఇదీ ఓ కారణమా?). నిర్వాహకులు ఈసడించుకొని, వెళ్లిపోతారు. ఆవిడని వాళ్లమ్మ తీసుకెళ్లిపోతుంది--యాగీ చేసి మరీ.

ఇంక అక్కడనించీ ఆయన ఇంట్లోనే వుండిపోయాడు అనుకోవాలి మనం. ఆయన కూతురు మడిగా నీళ్లు తెస్తూ, బిందె మొయ్యలేక కాలుజారి పడిపోతే, "నీకు వంట రాదా?" అని మం. భా. ని అడిగి, వండించుకు తింటాడు. (మళ్లీ ఆవిడ ఆయన యింటికి యెలా వచ్చిందో?) కులాలు మనుష్యులు యేర్పరచుకున్నవే, మన మనసుల్లోనే వుంటాయి అనో యేదో ఓ సందేశం అక్కడ.

తరవాత ఆమె మళ్లీ వేరే వూళ్లో ఓ పిల్లవాణ్ని (తులసి) కంటుంది. వాణ్ని మళ్లీ శంకర శాస్త్రి దగ్గరకి వెళ్లి, సంగీతం నేర్చుకోమంటుంది. (ఆ పిల్లవాడి తండ్రి జమీందారా? కాదు. శంకర శాస్త్రే అని నిర్ధారించడానికే ఆయన వారసుడిగా వాణ్ని క్లైమాక్స్ లో చూపించడం.)

సరే. ఆ కుర్రవాడు ఆయన సేవ చేసుకొంటూ, మళ్లీ ఓ విద్వాంసుడు అయిపోతాడు. క్లైమాక్స్ అందరికీ తెలిసిందే!

స్థూలంగా ఇదీ కథ. (నేను ఆ సినిమా రిలీజు అయినప్పుడు రెండో రోజునే భీమవరం వెంకట్రామా థియేటర్లో చూశాను. తరవాతోసారి 1990 ల్లో, వీసీపీలో చూశాను. అంతే. గుర్తున్నంతవరకూ వ్రాశాను. యేవైనా తప్పులు వ్రాస్తే, పూజ్య పాఠకులు నా దృష్టికి తీసుకు రండి.)

.........తరువాయి ఇంకోసారి.

No comments: