Wednesday, July 1, 2009

ఆణి ముత్యాలు--3

ఇదెక్కడిదండోయ్?

గురుగుం జెంచలి తుమ్మియు లేదగిరిసాకు దింత్రిణీదళో

త్కరముగా నూనియలందలిర్చి, కట్టారు కుట్టారుగో

గిరముల్మెక్కి, బసుల్పొలమువో, క్రేపుల్మెయినాక, మే

కెరువుం గుంపటి మంచమెక్కిరి రెడ్లజ్జడిన్!


2 comments:

కామేశ్వరరావు said...

ఇది ఆముక్తమాల్యదలో పద్యం. అచ్చుతప్పులున్నాయి. సరైన పద్యం ఇది:

గురుగుం జెంచలి దుమ్మి లేదగిరిసాకుం దింత్రిణీపల్లవో
త్కరముం గూడ బొరంటి నూనియలతో గట్టావికుట్టారుగో
గిరము ల్మెక్కి, తమిం బసుల్పొలము వో గ్రేపు ల్మెయి న్నాక, మే
కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్లజ్జడిన్

ఇది typical రాయలవారి పద్యం, ఒక్క ముక్క కూడా అర్థం కాదు :-)

ఇది వర్ష ఋతు వర్ణనలో వచ్చే పద్యం. జడివానలు కురిసే వానాకాలంలో కూడా రెడ్డిదొరలు ఎంత నిశ్చింతగా జీవనాన్ని సాగిస్తున్నారో చెప్పే పద్యం. గురుగు, చెంచలి మొదలైన ఆకులతో చింతచిగురు చేర్చి, నూనెపోసుకొని, కూరలు కలుపుకొని తృప్తిగా భోంచేసి మంచమెక్కుతారు. ఆవులు, ఎడ్లు మేతకి వెళ్ళతాయి. దూడలు వెళ్ళవు. అలా ఉన్న దూడలు, యీ పడుకున్న రెడ్లని నాకుతూ ఉంటాయి. మేక పేడతో చేసిన పిడకలతో నిప్పుపెట్టిన కుంపట్లు మంచాల కింద వెచ్చదనం ఇస్తూ ఉంటే, హాయిగా వాటిమీద నిద్రపోతారట!

A K Sastry said...

డియర్ భైరవభట్లవారూ!

చాలా సంతోషం!

అవి ‘అచ్చుతప్పులు’ కాదు—నా మెదడు ‘గుచ్చు తప్పులు!’ అది మత్తేభ వృత్తమే అనిపించింది కానీ, నిజంగా, రెండు రోజులు కుస్తీ పట్టాను—సరిగ్గా గుర్తు తెచ్చుకొని, ఆ వృత్తానికి సరిపెడదామని! ఇక మీరున్నారు కదా అనే ధైర్యంతోనే, అలాగే పబ్లిష్ చేసేశాను!

‘కట్టావి’ కాదనుకుంటా—కడు + ఆరు = కట్టారు (బాగా అరిపోయినటువంటివి) అని చదివిన గుర్తు—బహుశా పాఠాంతరమేమైనా వుండొచ్చు!

ఇక ‘జడ్డి’ వాళ్ళైన రెడ్లు (పాలి కాపులూ మొదలైనవాళ్ళు) ఆ వర్షపు చలిని జయించడానికి, అన్నీ వేడి చేసే చవుక ఆధరువులతో భోజనం చేసి, మేకెరువు కుంపట్లు మంచం క్రింద పెట్టుకొని, దూడలు కూడా నాకుతుంటే వచ్చే వేడిని అనుభవిస్తూ, మంచమెక్కారంటే—నిజం గా కృష్ణదేవరాయలే వ్రాశాడా ఈ పద్యం అని సందేహం రాక మానదు!

మరి దీనికి వ్యతిరేకం గా, శ్రీమంతులూ, రాజులూ యేమేమి తిన్నారో, యెలా నిద్రించారో వర్ణించే పద్యం ఇంకోటి వుంది—అది చదివితే, పై సందేహం పటాపంచలు అయిపోతుంది!

లక్షా తొంభై అలోచనలతో క్రిక్కిరిసిన నా మెదడుకి చచ్చినా గుర్తుకురావడం లేదు!
(ఇలాంటివి చదివిన వెంటనే యెందుకు యెక్కడైనా వ్రాసి పెట్టుకోలేదా అని ఇప్పుడు నన్ను నేనే తిట్టుకొంటూంటాను!)

దయచేసి, నాకోసం, మన మితృలకోసం—ఆ పద్యాన్ని కూడా ఉటంకించి, వివరించరూ!

(మీరు వ్రాసిన ‘అసలు’ పద్యాన్ని సేవ్ చేసుకున్నాను! ధన్యవాదాలు!)