Monday, September 19, 2011

తెలుగు సినీ సాహిత్యం



.....హిట్/ఫట్ పాటలు

ఓ ముఫై ఐదేళ్ల క్రితం అనుకుంటా, రేడియోలో ఓ కార్యక్రమం ప్రసారం అయ్యేది--అందులో ఒక పాటని ప్రసారం చేసేవారు. శీర్షిక "సినిమాలో మాత్రమే వినిపించిన పాట" అనో యేదో వుండేది. (అంటే బయట "హిట్" కాని, మంచి పాట అని అనుకుంటా వాళ్ల వుద్దేశ్యం). 

ఆ శీర్షికలో నాకు బాగా జ్ఞాపకం వున్న పాట, "బ్రహ్మ పట్నం పోదమంటే దారి తెలియదు అన్నయా! సూటిగా చుక్కానిపట్టీ నావ నడపవే చెల్లెలా!" అనేది. తరవాత ఇంకోపాట--"దేవీ సేమమా? దేవరవారూ సేమమా?" అనే పాట అని గుర్తు. 

మొదటి పాట సంగతి నాకు గుర్తులేదు గానీ, రెండో పాట వ్రాసినది మాత్రం, మా గురువుగారు, "ఆచార్య ఆత్రేయ"! అప్పట్లో ఓ జోకుండేది--కృష్ణశాస్త్రి వ్రాసి (జనాలని) యేడిపిస్తే, ఆత్రేయ వ్రాయక (నిర్మాతలని) యేడిపిస్తాడు--అని! ఇంకా, ఆత్రేయకి ఓ 5స్టార్ హోటల్లో బసయేర్పాటుచేసి, ఓ వారంపాటు జాగ్రత్తగా చూసుకొంటే (ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ నిరంతరాయంగా అందిస్తే) ఓ వారంలో ఖచ్చితంగా ఓ "హిట్" పాట వస్తుంది అని! (అదే స్కాచ్ బదులు ఇండియన్ విస్కీ అందిస్తే, ఇలాంటి పాటలే వస్తాయి అని కూడా చెప్పుకునేవారు!). ఇవన్నీ "పాప్యులర్ గాసిప్సే" అయ్యుండవచ్చు. తరువాత ఆయన "కోడెనాగు" సినిమాలో శోభన్ బాబుకి గురువుగా నటించారు కూడా.

ఇంకో గొప్పపాట, ఎస్ పీ కోదండపాణి పాడిన "ఇదిగో....దేవుడు చేసిన బొమ్మా....ఇది నిలిచేదేమో మూడురోజులు, బంధాలేమో పదివేలు!". చాలా మంచి పాట. ఆ విధంగా ఆయన తప్ప ప్రపంచంలో యెవరూ పాడలేరు మరి!

అలాగే, హిందీ గీత రచయిత "ఆనంద్ బక్షీ" ఉప్ హార్ అనే సినిమాలో ఓ పాట పాడారు--"బాగోం మే బహార్ ఆయీ, హోఠోం పే పుకార్ ఆయీ, ఆజా, ఆజా, ఆజమేరి రాణీ" అంటూ. అది కూడా అనితర సాధ్యం!

ఎస్ డీ బర్మన్ పాతకాలంలో పాడిన ఓ పాట వుంది--"ధీరెసె జానా ఖటియన్ మే, ఓ ఖట్ మల్, ధీరెసెజానా ఖటియన్ మే!" అనో, "ధీరెసెజానా బగియన్ మే, ఓ భౌఁరా, ధీరెసెజానా బగియన్ మే!" అనో!

ఇలాంటి చమక్కులు ఇప్పుడు లేవు!

ఇప్పుడన్నీ "ఓయ్, ఓయ్"; "డోయ్, డోయ్" లే మరి!


No comments: