రసన
మనుషులకి (జంతువులక్కూడా) వుండే అవయవాల్లో ఈ రసన అనబడే నాలుక, ఓ అతి విచిత్రమయిన అవయవం.
మరి దానికి తోడు "అంగుడి"!
నాలుకమీదవేసుకోగానే, పదార్థం రుచిని గ్రహించి, దాన్ని అంగుడికి హత్తగానే--ఓహ్! ఇదే స్వర్గం అనిపించేలా చేస్తాయి ఈ రెండూ!
ఇంగ్లీషువాళ్లు కూడా రుచి ని చెప్పడానికి "ప్యాలటబుల్"; "ఫర్ ది ప్యాలేట్"....ఇలా వాడతారు. అదీ అంగుడి ప్రాధాన్యం.
ఆ రెండూ లేకపోతే, మనం కూడా ఆకులూ, అలమలతోపాటు, మట్టీ, మశానమూ తింటూ వుండేవాళ్లం!
సాహిత్యంలో ఈ రసనకి ఓ విశిష్ట స్థానం వుంది. అనేక పద్యాలు వున్నాయి. "వివాహభోజనంబు" లాంటి పాటలూ వున్నాయి.
ఈ సందర్భంలో నాకో విషయం గుర్తొచ్చింది.
మా హైస్కూల్లో వుత్తరాంధ్రనుంచో, దక్షిణాంధ్రనుంచో ఇద్దరు ఆడపిల్లలు కొత్తగా చేరారు యేదో చిన్న క్లాసులో. మాకన్నా చిన్నవాళ్లు, అక్కచెల్లెళ్లు. ఆ సంవత్సరాంత సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ ప్రదర్శన ఇచ్చారు.
తెల్లటి పొడుగుచేతుల చొక్కాలూ, షరాయిలూ వేసుకొని, కుచ్చు తలపాగాతో, చేతిలో కంజరి లాంటి డప్పులతో (కాళ్లకి గజ్జెలు కూడా కట్టుకున్నారేమో) ఓ చక్కని సరదా పాట పాడారు. విషయం సరిక్రొత్తదవడంతో, అందరూ తలమునకలుగా ఆనందించారు. ఆ పాట ఇలా సాగుతుంది--నాకు ఙ్ఞాపకం వున్న రెండుమూడు లైన్లు......
(ఒక వూరికి)"......వచ్చారూ ముగ్గురు షరాబులూ.....ఒకడికి అంగుడేలేదూ, ఇద్దరికి మింగుడేలేదూ"
"అంగుడి మింగుడు లేనివారలూ దున్నారూ మూడెకరాలూ.....ఒకడికి అరకేలేదూ, ఇద్దరికి యెడ్లే లేవూ"
"నాగలి యెద్దులు లేనివారలూ వేశారు మూడు విత్తనాలూ....ఒకటి యెండేలేదు, రెండు పండేలేదు!"
.......అలా సాగుతుంది. (పైన వ్రాసినవికూడా కరెక్టు కాకపోవచ్చు!)
వాళ్లు ఈపాటికి బ్లాగులు చదువుతూ, వ్రాస్తూ వుండి వుంటారని నా అంచనా.
యెవరికైనా ఈ గీతం/గేయం తెలిస్తే, వెంటనే పూర్తిగా ప్రచురించండి.....అందరికీ పరిచయం చెయ్యండి.
బుర్రుపిట్ట పాటల్లాగే, ఇదీ సాహిత్య సేవే!
3 comments:
నా పేరు కనపడగానే ఆసక్తితో వచ్చా కానీ దాని వల్ల మంచి బ్లాగ్ చూడటం జరిగింది. ఈ పాట బాగుందండీ!
డియర్ రసజ్ఞ!
నా బ్లాగులకి స్వాగతం!
మీ టపాలు కూడా చదివాను. చాలా, చాలా బాగుంటున్నాయి.
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
నెనర్లండీ! మీరు చదివినందుకు చాలా సంతోషంగా ఉంది.
Post a Comment