Wednesday, May 18, 2011

అన్నమయ్య కీర్తనలు



ముద్దు కారే....

అప్పటికి మూడున్నరేళ్ల నా మనుమడు మా యింటి ముందున్న, వేంకటేశ్వర స్వామి గుళ్లో, ప్రతిరోజూ వాయించేస్తున్న ఈ కీర్తనని వింటూ, ఓ రోజు పాడేశాడు...."ముడ్డికారే యశోద....." అంటూ! వాడి తప్పేమైనా వుందా?

మన తితిదే వారు కొన్ని పదుల సంవత్సరాల క్రితమే, కొన్ని కోట్ల ఖర్చుతో "అన్నమాచార్య ట్రస్ట్" స్థాపించి, కొంతమందిని ఆయన కీర్తనలని తాళ పత్రాల్లోంచీ, రాగి రేకుల నుంచీ "దీ కోడ్" చెయ్యమని నియమించారు. 

ఆ "పరిశోధకులు" యెస్వీ యూనివర్సిటీ నుంచి "డాక్టరేట్లు" తెచ్చుకున్నారు--వాటిని పరిష్కరించడమే కాదు--తమకి తోచిన రాగ, తాళ, లయ లతో, పాడేశారు కూడా. వొక్క (ఛార్లెస్ కాదు) శోభారాజు గురించేకాదు నేను వ్రాస్తున్నది.

(నా చిన్నతనంలోనూ, నేను పుట్టక క్రితం కూడా, మల్లంపల్లి వారూ, తాపీ వారూ, తూమాటి వారూ, అక్కిరాజు వారూ.....ఇలా చాలా మంది, తమకి అందుబాటులో వున్న "పరిమిత" వనరులతో, "సిధ్ధాంత" వ్యాసాలు వ్రాశారు. దానిగురించి మరోసారి.)

అన్నమయ్య, తాను వ్రాసిన ప్రతీ గేయానికీ/గీతానికీ, నిర్దిష్టంగా ఓ రాగాన్ని, తాళాన్ని (మన ప్రాచీన వాగ్గేయకారులు త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్ ల లాగ) నియమించారు. 

శంకరాభరణం శంకరశాస్త్రి చెప్పినట్టు, మన "పరిశోధకులు" తమ "మిడిమిడి" ఙ్ఞానంతో వాటిని "భ్రష్టు" పట్టించారు! దానికి మన ప్రభుత్వ, తితిదే వారి ప్రోత్సాహం తోడు!

ఇంతకీ, అన్నమయ్య వ్రా/డిన ఈ గీతం యేమిటీ?

"ముద్దుకాడే! యశోద ముంగిటి ముత్యము వీడు" అని. 

అంటే, ఇక్కడ "శ్లేష"....ముద్దు కాడా? అనీ, "ముద్దుకాడు"--చెలికాడు, విలుకాడు, వన్నెకాడు--ఇలా (అంతేగాని కన్నడంలో లా కాడు అంటే "అడవి" అనీ, మన తెలుగులోలా "వల్లకాడు" అనీ కాదు!) ముద్దువచ్చేవాడు అని. 

మరి ముద్దు "కారడం" యేమిటి? అందులోనూ యశోదకి?

ఇప్పటికైనా సరిదిద్దండి--పాడేవారూ, వినిపించేవారూ వగైరాలు.

8 comments:

కొత్త పాళీ said...

Interesting take.
ముద్దుగారడమన్న వాడుక ఉన్నదే. అసహజం కాదు. కావ్యప్రయోగాల సంగతి నాకు తెలియదుగాని అన్నమయ్య పదాల్లోనే ఇంకెక్కడే చూశాను. త్యాగరాజ కృతుల్లోనూ ఉన్నది, ముద్దుగారు మోము అని.

A K Sastry said...

డియర్ కొత్త పాళీ!

మీరన్నదికూడా కరెక్టే. "ముద్దుఁగారు" (కష్టపడి అరసున్నా వ్రాసేశాను చూశారా?) మోమువాడు అనే ప్రయోగం వుంది. కానీ సందర్భానికి తగినట్టు వుండాలి కదా?

పైగా ముద్దు కారే....అంటే యెంత "ఇది"గా వుంది!

ధన్యవాదాలు.

Dr.Suryanarayana Vulimiri said...

కృష్ణశ్రీ గారు, ఆ కీర్తనలోని సాహిత్యం "ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు, తిద్దరాని మహిమల దేవకీ సుతుడు" అని. "ముద్దుకాడే" కాదు, "ముద్దుగారే" అన్నది సరియైన ప్రయోగం. అన్నమయ్య వాడిన పదాలలో "పకృతి వికృతిలు" విరివిగా వాడాడు. నిజానికి "ముత్యము" బదులు "ముత్తెము" అన్న వికృతి వాడాడు. అయితే చాలమంది పాడినవారు తప్పు పాడుతున్నారని "ముత్తెము" ను "ముత్యము" గా సరిదిద్దుతుంటారు. రెండు పదాలు ఒకే అర్ధాన్నిస్తాయి, కాకపోతే ఒకటి ప్రకృతి మరొకటి వికృతి. అన్నమయ్య వాడినది వికృతి. అలాగే రెండవ పంక్తిలో "తిద్దరాని" అని వాడాడు. దానికి సరియైన అర్ధం నాకు తెలియదు. కాని చాల మంది "దిద్దరాని" మహిమల, అని సరిచేసి పాడుతుంటారు. అయితే అన్నమాచార్య ప్రోజెక్టులో నాకు తెలిసి శ్రీ గరిమెళ్ళ బాల కృష్ణ ప్రసాద్ గారు చక్కని ఉఛ్చారణతో, భావం చెడకుండా సరియైన పద విరుపుతో కీర్తనలను ఆలపిస్తారు. నేను వారిని కొలబద్దగా తీసుకుంటాను. ఏమైనా, చక్కని అంశాన్ని ప్రస్తావించారు. మీకు ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ 'Vulimiri'వారూ!

ముందుగా నా బ్లాగుకి మీలాంటి సాహితీ పిపాసులకి స్వాగతం!

మీ "వాతాపి గణపతి" చూశాను. హేట్సాఫ్!

ఇంక, నేనిదివరకే వ్రాసినట్టు, "ముద్దుకారే" అన్నతరవాత, "మోము" ఖచ్చితంగా రావాలి. కానీ, వీళ్లు పాడుతున్నట్టు, ముద్దు కారడం యేమిటీ? అదీ యశోదకి? "ముద్దుకాడే?" అనడం ప్రశస్తంగాలేదూ? ముత్యము అన్నా, ముత్తెము అన్నా శృతిలో తేడా రాదు కదా? "తిద్దరాని"కి అర్థం లేదు. "దిద్దరాని మహిమలు" పొసగవు కదా? అందుకే, "తత్తరైన అడుగుల" లేదా, "మడుగుల" (మడగడం అన్నా నడవడం అనే అర్థం వుంది కదా?) అంటే సరిపోతుంది.

గరిమెళ్లవారి (ప్రాజెక్టులో ఆయన వున్నారన్నందుకు సంతోషం! మరి శోభారాజు కి వచ్చిన ప్రచారం ఆయనకి యెందుకు రాలేదో?) కీర్తనలు యేమైనా అందుబాటులోవుంటే నాకు ఓ లింకు పంపించగలరు.

ధన్యవాదాలు.

Dr.Suryanarayana Vulimiri said...

శ్రీ కృష్ణశ్రీ గారికి నమస్కారములు. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి ఈ క్రింది లింకులో చదవ వచ్చును. http://en.wikipedia.org/wiki/Garimella_Balakrishna_Prasad ఆయనవంటి నిగర్విని గాని, నిరాడంబరుని గాని నేను ఇప్పటి గాయకులలో చూడలేదు. ఆయన సాధారణంగా కమర్షియల్ కార్యక్రమాలు ఇవ్వరు. ఆయన తిరుపతిలో వుంటారు. ఒక అన్నమాచార్య అభిమాని తిరుపతిలో వుంటూ అతని ఇల్లు కనుక్కోవడానికి మూడు సంవత్సరాలు పట్టిందని రాసాడు. దానికి కారణం అతను బాలకృష్ణ ప్రసాద్ గారు ఏ భవంతిలో ఉంటారో అని వెదకి వెదకి ఆఖరుకు ఆయన ఒక చిన్న అద్దె ఇంటిలో ఉంటారని కనుక్కున్నాడు. శ్రీ ప్రసాద్ గారు ప్రముఖ విద్వాంసులైన నేదునూరి కృష్ణ మూర్తి గారి శిష్యులు. వారి బాణీలు సామాన్యులకు కూడ సులభంగా పాడుకొనే రీతిలో వుంటాయి. అన్నమయ్య కీర్తనలలోని సొబగులు అర్ధం చేసుకోవాలంటే శ్రీ బాల కృష్ణప్రసాద్ గారి గళంలో వినాలి. నా దగ్గర దాదాపు రెండు వందల వరకు వారు పాడిన కీర్తనలు ఉన్నాయి. This is a good site for Annamacharya Keertanas in his voice along with others. http://annamacharya-lyrics.blogspot.com/2006/09/2jo-achyutananda-jo-jo-mukunda.html There are several other links also.

లలిత (తెలుగు4కిడ్స్) said...

"ముద్దు గారే యశోద ముంగిటి ముత్యము" మీకు తప్పుగా తోచి ఉంటే సరే.
ముద్దుగారే అనే విశేషణం "యశోద ముంగిట్లో ముత్యము వంటి వాడైన చిన్ని కృష్ణుడిని" వర్ణిస్తున్నట్లు నాకనిపిస్తోంది.
అలాగే "దిద్దరాని మహిమల" అంటే దిద్దితే నేర్చుకోగలిగేవి కాదు ఆ మహిమలు (ఒకరు నేర్పిస్తేనో, చూసి సాధన చెస్తేనో లేదా ఇంకోలా చెప్పుకుంటే కాపీ కొడితోనో) అనే అర్థం నాకు స్ఫురిస్తోంది.
అంటే కృష్ణుడు ఒకరిని చూసి నేర్చుకున్నవి కాదు అనో లేదా మనం అతనిని చూసి కాపీ కొట్టగలిగేవి కాదు అనో అర్థం ఉండి ఉండవచ్చు అనిపిస్తోంది నాకు.

A K Sastry said...

డియర్ 'వులిమిరి' వారూ!

చాలా సంతోషం! నా తరువాతి టపా చదవండి.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ లలిత (*్%)!

సంతోషం. నా తరువాతి టపా చదవండి. మీ బ్లాగ్ ని సంస్కరించుకోండి!

ధన్యవాదాలు.