Saturday, December 4, 2010

పాపం ఆవిడెవరో....

.......యెందుకో?

క. ననునెవ్వతిగాజూచితి
    వనియంతర్భాష్పయగుచు నవనత ముఖియై
    ఘనతర గద్గదికా ని
    స్వనమున మఱిమాటలాడ శక్యముగామిన్.

ఉ. ఈసున బుట్టి డెందమున హెచ్చినశోకదవానలంబు చే
     గాసిలి యేడ్చె బ్రాణవిభుకట్టెదుటన్లలితాంగి పంకజ
     శ్రీసఖమైన మోముపయి జేల చెఱంగిడి బాలపల్లవ
     గ్రాసకషాయకంఠ కలకంఠ వధూకలకాకలీ ధ్వనిన్.

                                                   అర్థ సందర్భాలూ, తాత్పర్యం యెవరైనా చెపుతారా?

15 comments:

కొత్త పాళీ said...

వరూధినేకదా కోమల కోకిల ధ్వనిన ఏడ్వనేర్చినది!

మిస్సన్న said...

పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చేడని కృష్ణునిపై సత్య భామ అలిగినప్పటి సందర్భంలోనిదీ పద్యం.

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

మళ్లీ చతుర్లా!

వరూధిని యేడిచింది జిగట కాంభోజి లోనా, ఆరున్నొకటిలోనా అని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను గానీ....

'....కలకంఠ వధూ కల కాకలీధ్వని' మాత్రం సత్య భామా దేవిదే!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ మిస్సన్న!

చాలా సంతోషం. బ్లాగులోకం లో పద్య సాహిత్యాభిమానులకి కొదువ లేదు అంటూ మీలాంటివాళ్లు ఋజువు చేస్తూంటే, తెలుగుకి అతి ప్రాచీన భాష స్థానం దక్కినట్లే!

ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

చతురు కాదండి, జెనుయీన్ గానే పప్పులో కాలేశాను :)
కాంభోజిలో ఏడ్చింది రామరాజభూషణులవారి గిరిక. వరూధిని ఏడుపు పద్యం నాకూ ఇప్పుడు గబుక్కుని గుర్తు రావట్లేదు. పుస్తకం చూడాలి.

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

వరూధిని రాగం తొందరగా చెప్పి పుణ్యం కట్టుకుందురూ! నాక్కూడా కడుపుబ్బిపోతోంది.

'గిరిక' గురించి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు!

కొత్త పాళీ said...

అయ్యా దొరికింది
రెండో ఆశ్వాసములో 70 వ పద్యం
ఉ. పాటున కింతులోర్తురె కృపా రహితాత్మక! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె గనుంగొనుమంచు జూపి య
ప్పాటలగంధి వేదన నెపంబిడి యేడ్చె గలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందగన్

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

చాలా సంతోషం! మీ ఓపికకి నా జోహార్లు!

కానీ అందులో 'రాగం పేరు ' లేదే!? (మా తెలుగు మేష్టారు యేదో చెప్పారు....గుర్తొస్తే బాగుండును!)

కామేశ్వరరావు said...

కాంభోజిరాగంలో గిరిక ఏడ్పు ఇది:

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకానిశా
రాజశ్రీ సఖమైన మోమున బటాగ్రంబొత్తి యెల్గెత్తి యా
రాజీవానన యేడ్చె కిన్నరవధూ రాజత్కరాంభోజ కాం
భోజీ మేళ విపంచికారవ సుధాపూరంబు తోరంబుగన్

A K Sastry said...

భైరవభట్లవారూ!

చాలా కాలానికి--మంచి పద్యం ఇచ్చినందుకు చాలా సంతోషం.

ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

లేదుసార్, ఈ పద్యాన్ని ఇక్కడ ఉటంకించడానికి మనుచరిత్ర పుస్తకం తెరిచినప్పుడు ఈ పద్యానికి ముందూ వెనకా ఉన్న పద్యాలు కూడా చదివాను. రాగం ప్రసక్తి తేలేదు. కలస్వనంతోటే సరిపెట్టారు పెద్దన్నగారు.
పెద్దన - తిమ్మన - రామరాజభూషణుడు .. ఈ మూడు ఏడుపు పద్యాలూ చూస్తే ..
వరూధిని కలస్వనంతో ఏడ్చింది.
సత్యభామ లేత మావిడాకులు తిన్న ఆడకోకిల గొంతులో కాకలి నిషాద స్వరంలో ఏడ్చింది.
గిరిక కిన్నెర వధువు చేత కాంభోజిరాగంలో మేళవించిన వీణా నాదంలా ఏడ్చింది.
ఈ "ప్రోగ్రెషన్" చూస్తే శ్రుతి మించి రాగాన పడుతున్నట్టు లేదూ? :)
మీ పుణ్యమాని ంగూరు ముద్దుగుమ్మల మురిపాల ఏడుపుల్ని మళ్ళీ తల్చుకున్నాం, థేంక్యూ కృష్ణశ్రీ గారు!

కొత్త పాళీ said...

the mutilated word in the above comment should be "ముగ్గురు"

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

నేనూ పేజీలు తిరగేశాను. మా మేష్టారు చెప్పింది వరూధిని 'కాంభోజి' లో యేడిచింది అనే! పాపం ఆయన కూడా కన్‌ఫ్యూజ్ అయ్యుంటారు.

సాక్షాత్తూ అక్షర లక్షలు ఇచ్చేవాడుంటే, ఆమాత్రం రాగాన పడదూ--శృతి మించి!

మీ లాంటి వాళ్ల సత్సాంగత్యం లభించినందుకు నా డెందం అమందానంద కందళితమౌతోంది!

ఇంతకన్నా ఇంకేమీ చేప్పలేను!

మరీ మరీ ధన్యవాదాలు.

మిస్సన్న said...

ముగ్గురు ముద్దుగుమ్మల రాగాలాపనపై జరిగిన చర్చ కడు రమ్యంగాను ఆసక్తికరం గాను సాగింది ముఖ్యంగా కృష్ణశ్రీ మరియు కొత్తపాళీ గార్ల వ్యాఖ్యలు.
శ్రీ భైరవభట్ల వారు నేనెప్పుడో చదువుకొనే రోజుల్లో విన్న పద్యాన్ని గుర్తు చేసి మంచి ఆనందాన్ని కలిగించారు.

A K Sastry said...

డియర్ మిస్సన్న!

చాలా సంతోషం!

మీక్కూడా మరోసారి ధన్యవాదాలు.

నా ఇతర బ్లాగుల్లోని టపాలని చదివి, తమ అమూల్యాభిప్రాయాలని తెలుపమని ప్రార్థన!