Friday, January 8, 2010

సంపాదన


ఖర్చు


"రైదాసు" ఒక చర్మకారుడు.  


గంగానది ముందు ఓ చెట్టు క్రింద కూర్చొని, చెప్పులు కుట్టుకుంటూ జీవనం చేసేవాడు.  


ఉదయాన్నే డ్యూటీ యెక్కి, మధ్యాహ్న భోజన సమయం వరకూ, అక్కడే కూర్చొని, తన పని అయిపోగానే--భగవంతుడిమీద కీర్తనలు పాడుకొంటూ వుండేవాడుట.  


ఒక రోజు ఓ పెద్దాయన అతనిని 'నువ్వు రోజుకి యెంత సంపాదిస్తావు? దాన్ని యెలా ఖర్చు పెడతావు? ఈ పాటలు మానేస్తే, ఇంకా యెక్కువ సంపాదించుకోవచ్చు కదా?' అని అడిగితే--అతను ఇచ్చిన సమాధానం ఇది!  


'అయ్యా--నేను రోజూ నాలుగు రూపాయలు మాత్రమే సంపాదిస్తాను! ఆ నాలుగూ చాలు నాకు!  


అందులో ఒకటి నేను తింటాను--నాకూ, నా భార్యకీ ఆ రూపాయి సరిపోతుంది.  


రెండోది అప్పు ఇస్తాను--అంటే నా పిల్లలకి పెడతాను! నా వృధ్ధాప్యం లో మళ్ళీ వసూలు చేసుకొనే అప్పు అదే కదా?  


మూడోది అప్పు తీరుస్తాను--అంటే నా తల్లిదండ్రులకి పెడతాను--వారి ఋణం తీర్చుకొనే మార్గం అదే కదా?  


ఇక నాలుగోది నూతిలో పారేస్తాను--అంటే దాన ధర్మాలు చేస్తాను--పరలోకం లో పనికి వచ్చే పుణ్యానికి అదే మార్గం కదా?  


ఇంక ఖాళీగా వుడే సమయం లో ఆ పరమాత్ముణ్ణి కీర్తించుకొంటూ వుంటాను! అంతే!' అన్నాడట!  


అతనే తరవాత 'సంత్ రవిదాసు' గా ప్రసిధ్ధి పొందాడట!

No comments: