Sunday, November 2, 2008

“వాడేదో చిన్న పిల్లవాడు……”

మావూళ్ళో, మా స్నేహితుడొకడిది శ్రోత్రియ వైదిక కుటుంబం. సహజంగానే మడీ, అచారాలు యెక్కువ.
వాడికి నలుగురు మేన మామలు.

వాళ్ళలో పెద్దాయన వయసు అప్పటికి 89 యేళ్ళు. మిగిలిన వాళ్ళందరికీ ఓ మూడు, నాలుగేళ్ళ తేడా. చివరాయన వయసు 78 యేళ్ళు!

వాళ్ళింట్లో జరుగుతున్న యేదో ఒక కార్యక్రమం లో, మడీ, తడీల్లో ఓ చిన్న లోపం గమనించిన ఆఖరాయన, తన తరవాత పెద్ద అయినాయనతో విసుక్కున్నాడు.

ఆయనంతకన్నానూ—‘నాకు చెప్పకపోతే అదేదో నువ్వే చెయ్యచ్చుగా’ అని కొంచెం గట్టిగా అన్నాడు!

‘పెద్దవాడివికదా అని నీకు చెప్పాను’

‘అదే! నాకు చెప్పేకంటే…….’

ఇలా కొంచెం కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారిద్దరూ!

అందర్లోకీ పెద్దాయన చెవిలో పడ్డాయీమాటలు.

‘యేమిట్రా విషయం’ అనడిగారు.

‘చూడన్నయ్యా……’ అంటూ ఇద్దరూ వివరించబోయారు.

పెద్దాయన, ఆఖరు వాణ్ణి చిన్నగా మందలించి, తరవాత ఆయనతో అంటున్నాడు—“వాడేదో చిన్న పిల్లవాడు! తొందరపడ్డాడనుకో, నువ్వెందుకలా ఆవేశపడి, గట్టిగా మాట్లాడావు? వూరుకోవచ్చుగా? యెవరూ ఊరుకోకపొతే దీనికి అంతెక్కడ?”

అని ఇద్దర్నీ మందలించారు!

అదీ సంగతి!

‘ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే’ అన్నట్టు—పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు యెప్పుడూ చిన్న పిల్లలే!

ఔనా?

No comments: