Saturday, December 4, 2010

పాపం ఆవిడెవరో....

.......యెందుకో?

క. ననునెవ్వతిగాజూచితి
    వనియంతర్భాష్పయగుచు నవనత ముఖియై
    ఘనతర గద్గదికా ని
    స్వనమున మఱిమాటలాడ శక్యముగామిన్.

ఉ. ఈసున బుట్టి డెందమున హెచ్చినశోకదవానలంబు చే
     గాసిలి యేడ్చె బ్రాణవిభుకట్టెదుటన్లలితాంగి పంకజ
     శ్రీసఖమైన మోముపయి జేల చెఱంగిడి బాలపల్లవ
     గ్రాసకషాయకంఠ కలకంఠ వధూకలకాకలీ ధ్వనిన్.

                                                   అర్థ సందర్భాలూ, తాత్పర్యం యెవరైనా చెపుతారా?

Saturday, September 25, 2010

తల్లులు

పాకీవాళ్లు


'పాకీపిల్ల 'వటంచు నిన్ను నిరసింపజూతురమ్మా స్వయం
పాకస్వాములు కొంతమంది, ఇది యే పాపంబో! మూన్నాళ్లలో
నే కన్నులు తలకెక్కి వెన్‌క గనరీ నిర్భాగ్య దామోదరుల్
పాకీదేగద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ!

వృత్తి ధర్మం గా పారిశుధ్య పని చేశేవాళ్లని 'పాకీ వాళ్లు ' అని ఈసడించుకుంటే, ప్రతీవాడి తల్లీ పాకీదే కదా? అని ప్రశ్నించాడు కవి "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి!

మా చిన్నప్పుడు స్కూల్లో, ప్రక్కవాడిని నువ్వు చిన్నప్పుడు పాకేవాడివా? దేకేవాడివా? అనడిగి, పాకేవాణ్ని అని వాడు సమాధానం చెప్పగానే--యేయ్! వీడు పాకీవాడట! అని వెక్కిరించేవాళ్లం!




Saturday, August 7, 2010

అవధానాలు

దత్తపది

క్రికెట్ వీరులు జడేజా, ద్రావిడ్, కాంబ్లీ, కుంబ్లే పేర్లతో, రామాయణార్థం లో చెప్పమంటే--సంస్కృతం లో

ఏషా జడేజా వికటాని హన్యా, తద్రావిడేఢ్యా జలధి 
ప్రసిధ్ధాన్ తద్వానరో.....కాంబ్లీతి కుంబ్లే రవంచకారా

అని చెప్పారుట.

అంటే, హనుమంతుడు లంకను ప్రవేశించబోయినప్పుడు సిం హళ కోట ద్వారం వద్ద కాపలాగా వున్న సిం హిక అనే రాక్షసిని హనుమంతుడు ముష్టిఘాతాలతో చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ రాక్షసి "కాంబ్లీ--కుంబ్లే" అంటూ ఆర్తనాదాలు చేసిందట!

Thursday, July 1, 2010

ఇదెక్కడిదో!

గుర్తు చెయ్యండి

"అంజనాచల గర్వ భంజనాచల లీల నీలి వర్ణపు మేని డాలు తనర....."

దీన్ని పూర్తి చెస్తారా?

Wednesday, May 26, 2010

సహజకవి

‘వేటూరి…..

….సుందర రామ్మూర్తి'…..ఇకలేరు!

గొప్ప కవి ఆయన—యెందుకంటే—అర్థం లేని అలతి అలతి పదాలతో, గొప్ప గొప్ప సినిమా పాటలు వ్రాసేశాడు.

గొప్ప కవిత్వం వ్రాశాడు ఆయన—కానీ దాన్ని ఖూనీ చేసి, ఆయన వ్రాసిన సినిమాకికాకుండా వేరే సినిమాలో చిత్రీకరించి, ఆయన వ్రాసిన సన్నివేశానికి కాకుండా, వేరే సన్నివేశం లో చిత్రీకరించి, ఆయన వ్రాసిన వరుస(క్రమం)లో కాకుండా వేరే క్రమం లో చరణాలని మార్చేసి చిత్రీకరించి—కళాఖండాలు నిర్మించారు కళా తపస్వులు!

ప్రముఖ ‘కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం (అన్నీ)’ చేసేవాళ్ళకి ‘ఘోస్ట్’ గా వ్రాసిన పాటల దగ్గర నించీ, ఆయన మంచిపాటలే వ్రాశాడు.

కాని నాకుమాత్రం, మొహమాటం లేకుండా చెపుతున్నా—వ్రేళ్ళ మీద లెఖ్ఖ పెట్ట దగినన్ని పాటలే నచ్చాయి! (సినిమాలలో వచ్చినవి!)

‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ…..’ ఆయన వెళ్ళాడనీ, అక్కడైనా చక్కని కవిత్వం వ్రాసుకుంటాడనీ, ఆశిస్తాను.

Wednesday, May 5, 2010

పద్యసాహిత్యం

ఆణిముత్యాలు

"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్పవింటివో! కలనైనన్ రఘూద్వహుడు కానలలోనను త్రోయబంచునే?"

ఈ పద్య పాదం కంకంటి పాపరాజు వ్రాసిన 'ఉత్తర రామ చరిత్ర' లోది.

పాపరాజు చక్కటి తెలుగులో ఖండకావ్యాలూ, కావ్యాలూ వ్రాశారు. 

సన్నివేశం--లక్ష్మణుడు, సీతని గర్భవతిగా వున్నప్పుడు, రాముడు ఆవిడ కోరిక ప్రకారం వనసీమలలో విహారానికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్పి, అక్కడికి చేరాక, చావుకబురు చల్లగా చెప్పాడు--అక్కడ వదిలేసి రమ్మన్నాడని.

అప్పుడు ఒక్కసారిగా షాక్ తిన్న సీత, ఆ షాక్ లక్షణాలని లక్ష్మణుడికి ఆపాదిస్తూ, 'నువ్వే కలవరపాటు తో ఇలా చెపుతున్నావో? లేక ఆయన చెప్పిన మాటలు పరాగ్గా వుండి యేమి విన్నావో! కలలోనైనా, రాముడు నన్ను అడవుల్లో త్రోయమని పంపిస్తాడా!' అని ప్రశ్నిస్తుంది సీత.

ఆవిడకెంత నమ్మకమో రాముడి మీద--పిచ్చి తల్లి!

పద్యం పూర్తిగా గుర్తుకి రాలేదు--యెవరూ పూరించలేదు!

సరే.

"రంతుల్ మానుము కుక్కుటాధమ......ఉలూఖల.....తండులముల్...."

యెవరైనా పూరించగలరా?

Tuesday, April 13, 2010

పద్య సాహిత్యం

ఆణిముత్యాలు

'గండరగండడై యలవు గండను మెండుగ తాండవింప.......' అనే పద్య పాదం "పలనాటి వీర చరిత్ర" అనే పద్య కావ్యం లోనిది. యుధ్ధం లో బాల చంద్రుడి పరాక్రమాన్ని వర్ణించేది.

వ్రాసిన వారు కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి గారనుకుంటా.

ఆయన 'పాంథశాల' కి వచ్చినంత ఫేం మిగిలిన కావ్యాలకి వచ్చినట్టులేదు.

పద్యం యెవరైనా పూర్తిగా ప్రచురిస్తే, సంతోషిస్తాను.


ఇంకో పద్య పాదం......

"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్ప వింటివో, కలనైనన్

రఘూద్వహుడు కానలలో నను త్రోయబంచునే?"

ఈ పద్యాన్ని పూరిస్తారా యెవరైనా?