Tuesday, October 16, 2012

తెలుగు నాటక సాహిత్యం



ఒక గొప్ప రచన

ముత్యాలముగ్గు సినిమాలో 'మాడా' - రావు గోపాలరావుతో బేరమాడుతూ, "మర్డరుకీ సెపరేషనుకీ యెంతవుద్ది, సెపరేషనుకీ మేరేజికీ యెంతవుద్ది, మర్డరుకీ, సెపరేషనుకీ, మేరేజికీ యెంతవుద్ది..........వోలుమొత్తానికి యెంతవుద్ది? కన్సెసనేమైనా వుందా?" అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పిన 'పొడవాటి ' డైలాగు గుర్తుందా?

అంతకు యాభయ్యేళ్ల క్రితమే ఓ నాటకంలో ఈ క్రింది సంభాషణని గమనించండి.

"అలాగైతే, సంబంధాల విషయంలో మీయభిప్రాయము ఏమిటో సంగ్రహముగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక చదువూ, సంప్రదాయమా? సంప్రదాయమూ సంపత్తా? సంపత్తూ చక్కదనమూనా? చక్కదనమూ చదువూ; చదువూ సంపత్తూ--ఈ విధముగా వుండవలెనా?"

ముళ్లపూడివారికి ఈ సంభాషణే స్పూర్తి యేమో!

ఈ సంభాషణ కాళ్లకూరి నారాయణరావుగారి "వరవిక్రయము" అనే నాటకం లోనిది.

1921 వ సంవత్సరంలో మొట్టమొదట ప్రచురింపబడి, తరువాత అనేక ముద్రణలు పొందుతూ, జాతీయోద్యమంలో భాగంగా కొన్నివేల ప్రదర్శనలకి నోచుకొన్న ఈ నాటకం మరుగునపడినా, అందులో విమర్శింపబడ్డ "వరకట్న దురాచారం" మాత్రం ఇంకా సమసిపోలేదు.

గురజాడవారు విమర్శించిన "కన్యా శుల్కం" అనే ఆచారం సహజ మరణం చెందడానికి కారణం, అప్పట్లో "విధవా వివాహాలు" చెయ్యవలసిరావడం జోరందుకోబట్టే, దానికి బ్రాహ్మణ్యం మింగలేక, కక్కలేక వూరుకోవడమే అనే వాదన నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ వరకట్నానికి సహజమరణం ప్రాప్తించేలా అన్ని కులాల్లోనూ యే ప్రక్రియా వూపందుకోకపోవడమే అది ఇప్పటికీ వర్ధిల్లడానికీ, వృధ్ధిపొందడానికీ కారణమేమో!

యేదైనా, ఈ నాటకాన్ని విరివిగా ప్రదర్శిస్తే కొంతలో కొంతైనా వుపయోగం వుంటుందేమో. ఇక కన్యాశుల్క నాటకాన్ని వదిలేసి, ఈ వరవిక్రయాన్ని మీడియావాళ్లూ, సాహితీపరులూ, సంస్కరణాభిలాషులూ తలకెత్తుకొంటే, యేమైనా వుపయోగముండచ్చేమో!

యేమంటారు?

(ఆ నాటకం లోని కొన్ని చక్కటి సంభాషణలు విడతలవారీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను--మీరు చదవడానికి ఆసక్తి చూపితే.)

Sunday, May 20, 2012

బాపు సృష్టి.....


.....శ్రీరామరాజ్యం

మన టీవీ వాళ్ల పుణ్యమా అని, ఇవాళ (20-05-2012) వుదయం ఓ ఛానెల్లో "లవకుశ"; సాయంత్రం ఇంకో ఛానెల్లో "శ్రీరామరాజ్యం" రెండు సినిమాలూ చూడగలిగాను. (ఇంతవరకూ శ్రీరామరాజ్యం చూసే అవకాశం రాలేదు.)

లవకుశ సినిమాలో ప్రతీ ఫ్రేమూ ఇప్పటికీ నాకు గుర్తున్నా, మళ్లీ ఓ సారి పునశ్చరణ చేసుకొనే అవకాశం వచ్చింది.

ఇంక శ్రీరామరాజ్యం గురించి ఆ సినిమా విడుదల అయినప్పటినుంచీ అనేకమంది చేసిన వ్యాఖ్యలూ, సమీక్షలూ, పొగడ్తలూ, తెగడ్తలూ, వెకిలి విమర్శలూ.......అనేకం చదివాను, విన్నాను.

కానీ, చాలామంది పెద్దవాళ్లూ, పండితులూ కూడా దృష్టిసారించని, ప్రస్తావించని విషయం ఒకటి వుంది అందులో.

అది నిజంగా ఓ "దృశ్యకావ్యమే!"--ఇది అందరూ చేసినలాంటి పొగడ్త కాదు.

సాధారణంగా "రీమేకులు" ఒకసారి డబ్బుచేసుకొన్న కథని, ఇంకో భాషలో మళ్లీ డబ్బుచేసుకోడానికి తీస్తారు. మరి ప్రపంచ ప్రఖ్యాత బాపూ, రమణలకి ఆ అవసరం వుందా? ముమ్మాటికీ లేదు. అందుకే లవకుశని రీమేక్ చెయ్యలేదు వాళ్లు!

లవకుశని పూర్తిగా భక్తి భావంతో, ఇతిహాసం యెలా వుందో అలా చిత్రీకరించి, జనాల్లో భక్తి భావాన్ని రేకెత్తించినందుకు ఆ సినిమా విజయవంతమయ్యింది.

నిజంగా, ఇతిహాసం ప్రకారం, "రామరాజ్యం"లో, "సీతానింద" జరిగింది. దానిద్వారా, "శ్రీరామ నిందా" జరిగింది. అసలు దాన్ని "ఖండించడానికే" కంకణం కట్టుకొని,  వాల్మీకి వుత్తర రామచరిత వ్రాశాడన్నట్టూ, దానిద్వారా, కుశలవులచేత ఆ రామరాజ్యంలోనే ప్రచారం చేయించి, ఆ నిందలని దూరం చెయ్యడానికి ప్రయత్నించాడన్నట్టూ.......చాలా విపులంగా చెప్పారు!

అదీ ఆ సినిమా "హైలైట్"!

"అక్కడెక్కడో" లంకలో జరిగిన అగ్నిపరీక్ష గురించి, అయోధ్య ప్రజలకి యెలా తెలుస్తుంది? అందుకే నిందవేస్తున్నారు--అని చెప్పించి, దాన్ని చక్కగా డెవలప్ చెయ్యడం చాలా బాగుంది!

(అసలు అగ్నిప్రవేశ ఘట్టమే "ప్రక్షిప్తం"; వుత్తరరామ చరిత్రకోసమే అది సృష్టించారు అనేవాళ్లు కూడా వున్నారనుకుంటా).

(ఈ బ్లాగరు విధానం 'కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్' ప్రకారం అనేక లోటుపాట్లున్నాయి. కానీ, అవన్నీ--వారి దృష్టికి వచ్చినా, వ్యవధానంలేక, చూసీ చూడనట్టు వదిలేసినవే అని ఖచ్చితంగా చెప్పగలడు!)

శ్రీరాముడి మేకప్ గురించి కొంచెం శ్రధ్ధవహించవలసింది లాంటి విమర్శలన్నీ అలాంటివే. సీతాదేవిలో "ఐటం గర్ల్" యెవరూ కనపడలేదు. (భూమ్మీద బోర్లా పడుకొని, తన పళ్లన్నీ బయటపెడుతూ దుఃఖిస్తున్నప్పుడు మాత్రం అందవికారంగా వుంది.) ఇతరపాత్రలూ, పిల్లల నటనా, గ్రాఫిక్సూ, సమకాలీనంగా, బాగున్నాయి.

ఈ సినిమాని ఆంధ్రదేశం మొత్తం మీద, ప్రతీరోజూ, యేదో ఒక థియేటర్లో కొన్ని సంవత్సరాలపాటు ప్రదర్శిస్తూ, జనాలకి దాన్ని చూసే భాగ్యం యెవరైనా కల్పిస్తే సంతోషించేవాళ్లలో మొదటివాణ్ని నేను.

(టీవీలో యే ఛానెల్ అయినా అలా ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది)

ఆ బాపూ రమణలకీ, జొన్నవిత్తులవారికీ నా పాదాభివందనాలు. (యేదైనా లోపం యెక్కువగా వుందంటే--అది ఇళయరాజా సంగీతమే!)

శుభంభవతు!

Sunday, March 11, 2012

వేదికలపై......



......వాక్ప్రవాహాలు

మీరెన్నయినా చెప్పండి......అతి సర్వత్ర వర్జయేత్!

ఈమధ్య అనేక సభలూ, సమావేశాల్లో, సన్మానాల్లో, వివిధ కార్యక్రమాల్లో మనం చూస్తూనే వున్నాము. స్వడబ్బాలు అంతగా లేకపోయినా, పరడబ్బాలూ, పరస్పర డబ్బాలూ యెక్కువై పోయాయి.

ప్రతీ వ్యక్తీ తన జీవితకాలంలో తగిన సాఫల్యం చెందాలనే తన ప్రయాణం ప్రారంభిస్తాడు. 

ఓ కళాకారుడైనా, కవీ, రచయితా, సినీ కవీ--ఇలా యెవరైనా అందుకు కఠోర దీక్షతో శ్రమిస్తారు. కానీ కొంతమందికే "సాఫల్యం"......యేదో ఒక రూపంలో లభిస్తుంది.

వుదాహరణకి, పింగళీ, ఆత్రేయా, వేటూరీ, సిరివెన్నెలా.....ఇలా అందరూ కొన్ని వేల పాటలు వ్రాశారు. ఫలానా పాటకి ఫలానాది స్పూర్తి...అని కూడా ప్రకటిస్తూ వుంటారు. 

వాళ్లు వ్రాసిన పాటల్లో నిజంగా "మంచి పాటలు" ఒక శాతం కూడా వుండవు. సమీక్షకులూ, విమర్శకులూ, సాహితీ బంధువులూ వగైరాలూ, వారి వెనుక జనసామాన్యం "మంచిపాటలు"గా గుర్తించినవి ఓ 2 నుంచి 3 శాతం వుండొచ్చు. 

రికార్డు కంపెనీలూ, క్యాసెట్ కంపెనీలూ, ఇప్పుడు సీడీ/డివీడీ కంపెనీలూ "హిట్"లుగా చెప్పేవి ఓ 5 శాతం వుండొచ్చు. 

కానీ, మిగిలిన వాటి సంగతేమిటీ? ఆ మాత్రానికి....అంత అవసరమా?  

ఆవేశంలో వచ్చినట్టే, వుద్వేగంలో మాటలొచ్చేస్తాయి-- 

సంతోషం ప్రకటించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, పొగడ్డానికి--ఇలా ప్రవాహంగా వచ్చేస్తూ వుంటాయి!

మనసులో యేర్పడుతున్న ఆలోచనల గొలుసుకట్టుని వెంటవెంటనే మాటల్లోకి మార్చుకొని, చక్కగా వారి భావాలని శ్రోతలకి, మనసుల్లోకి చొచ్చుకొనిపోయేలా చెప్పడం అనేది--పుంభావ సరస్వతులకి మాత్రమే సాధ్యం!

కాళా తపస్వులకీ, ఎస్పీ బాలు లాంటివాళ్లకీ, సిరివెన్నెల లాంటి వాళ్లకీ, సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల--ఇలా చాలా మందికి అది వుగ్గుతో అబ్బిన విద్య.

కానీ.......

అక్కడే సంయమనం అవసరం. 

చూసేవాళ్లకీ, వినేవాళ్లకీ "అంతుందా?" అనిపిస్తే, మీ నటన (అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్) యేమి సాధించినట్టు?

ఎస్పీ ఈ మధ్య కొంతవరకు సంయమనం పాటిస్తున్నాడు....ఇంతకన్నా నేను ఇంక యెక్కువ మాట్లాడను....అనేస్తున్నాడు. 

రెండు సంవత్సరాలుగా, శివరాత్రిరోజున, "పాడుతా తీయగా"కి తనికెళ్ల భరణి ని ఆహ్వానించి, ఆయన "తుస్....బుస్....ఖస్....శంకరా" అంటూ చదువుతున్న కవితలని బాగా మోసేస్తున్నాడు. సందేహం లేదు--భరణి అలౌకిక ప్రజ్ఞ కల కవీ, రచయితా. 

కానీ......

"హూష్.....
స్పేస్........
సుభాష్...
చంద్రబోస్ లా.....

అంతా ఖామోష్!"

ఇది వ్రాసిందెవరో గుర్తొచ్చిందా?

మరెందుకీ శషభిషలు?

"ఆయన నాకు తండ్రితో సమానం...వాడిక్కూడా తండ్రితో సమానం అంటున్నాడుకాబట్టి, వాడు నాకు సోదరుడితో సమానం....." ఇలా భాషణం సాగాల్సిన అవసరం వుందా?

పెద్దలు నామాటలని "విమర్శగా" కాకుండా, ఓ సలహాగా స్వీకరిస్తే సంతోషిస్తాను. 

ముఖ్యంగా......ఇలాంటివాటివల్ల కొన్నివర్గాల ప్రేక్షకులనీ, శ్రోతలనీ, సామాన్య జనాన్నీ దూరం చేసుకొంటున్నారని గమనిస్తే......ఇంకా సంతోషం!

గ్రహించండి.

Saturday, February 11, 2012

తెలుగు సాహిత్యం



సాహిత్యం అంటే....

(ఇదివరకటి నా టపా "చక్కని సాహిత్యం అంటే....ఇలా వుండాలి ట" కి కొందరైనా సాహితీపరులు స్పందిస్తారనుకున్నాను. అంతకు ముందు టపాలకి కూడా స్పందన లేదు....యెందుకో మరి)

కవీ, రచయితా, చిత్రకారుడు, ఇంకా చాలా అయిన "బహుముఖ ప్రజ్ఞావంతుడు" అడివి బాపిరాజు 1946 లో వ్రాసిన "కోనంగి" నవలలోనివి ఆ టపాలో వ్రాసిన పేరాలు.....అక్కడక్కడా సేకరించినవి.

ప్రతి పిచ్చిరాతా "సాహిత్యం"గా చెలామణి అయిపోతున్న ఈ రోజుల్లో, అలాంటి సాహిత్యం అరుదుగా కనిపిస్తుంది అనే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాశాను.

ఒక సమయంలో, సినీ పరిశ్రమలో అ, ఆ లు అంటే, "అక్కినేని, ఆదుర్తి" అనేవారు. అవేరోజుల్లో, అక్కినేని "అ ఆ లు" (అక్కినేని ఆలోచనలు) అనే పేరుతో కవితలు వ్రాస్తే, "వీడికి అదొక్కటే తక్కువ" అన్నవాళ్లున్నారు. 

ఇప్పుడొస్తున్న కవితలూ, తవికలూ, హైకూలు, నానీలు, నానోలు, తాతీలు, తాతూలు లాంటి "కవిత్వం" తో పోలిస్తే, అవి గొప్పకవితలు అనిపిస్తాయి.

అవి ఇప్పుడు యెక్కడైనా దొరుకుతున్నయో లేదో!

Friday, December 23, 2011

చక్కని సాహిత్యం అంటే……

......ఇలా వుండాలి(ట)!


అనంతలక్ష్మి దేహంలో మనస్సులో నిర్మలత్వం ఉంది. రఘునాధరాయని హృదయ మహారాజ్యం ఆక్రమించి, చక్రవర్తియై రాజ్యమేలిన దివ్యసుందరి, భూమికి దిగివచ్చిన పరమాప్సరస సుందరి మధురవాణి అందమంతా ఈ బాలికలో ప్రత్యక్షమైంది. కొంచెం కోల, కొంచెం గుండ్రని మోము, అయిదడుగుల ఎత్తు, పొట్టి పొడుగుకాని ముక్కు, సమమైన కోలతనంలో దవడలో, బుగ్గలు ఫాలము ఏకరేఖా ప్రవాహ సామ్యం కుదిరి వుంటాయి. అలాంటి మోము గుంటలుపడే బుగ్గలు, కొంచెం పైకి తిరిగిన పై పెదవి, కొంచెం అంటే కొంచమే ఎత్తయిన క్రింది పెదవీ, సుడులుపడే సమ చుబుకమూ ఉండి, ఆ మోము కాసు బంగారం రంగు కలిగి, ఆ రంగుకు తగినట్లు లేత గులాబీ రాగం అప్పుడప్పుడా బుగ్గలకి ప్రసరిస్తూ ఉంటే, అలాంటి సౌందర్య నిధులన్నీ చేకూరినచోట, ఆ నిధులకు కిరీటంలాంటి కళ్ల అందం వెలసిందనుకొంటే, ఆ దివ్య సౌందర్యవదనం అనంతలక్ష్మిది. కాంచనమాలను, సుబ్బలక్ష్మిని, నళినీజయవంత్ ను ముగ్గురినీ కరిగించి పోతపోస్తే అనంతలక్ష్మి అవుతుంది.

ఆవును. అనేకమందికి చక్కని హృదయాలనన్నీ గబగబ పువ్వుపుణికినట్లు పుణికే శక్తిగల సౌందర్యపూర్ణమైన మోము ఉంటుంది. అంతే. ఆ మోముకు తగిన తలగానీ, తలకట్టుగానీ ఉండవు. ఆతి పెద్ద లంకగుమ్మడి లాంటి తలో, పొన్నకాయలా మెదడులేని తలో ఉంటాయి. ఆనంతలక్ష్మికి తలకట్టు, తోడిరాగాలాపన ఆమె కేశ సౌభాగ్యము. కేశరంజనివారి ప్రకటన చిత్రాల తలకట్టులకు పాఠాలు నేర్పుతుంది. 




……………

ప్రేమ అనే మహోత్తమ స్థితి మనుష్యుని జీవితంలో ఊరికేరాదు. భర్తతో స్నేహమూ, స్త్రీ పురుష సంబంధ ప్రీతీ సమ్మిశ్రితమై ఒకరకమైన ప్రేమగా పరిణమిస్తాయి. ఒకనాడాస్థితి సంపూర్ణ ప్రేమ కావచ్చును.

కాని అసలు ప్రేమే స్త్రీకిగాని, పురుషునికిగాని సంభవిస్తే, అది అమృత మహానది. సరస్సు కట్టలు తెగినట్లవుతుంది.



* * *

“ఆకలి అవుతున్నది గాని (జావ) సహించడంలేదు లక్ష్మీ!”
“మీ వంట్లో ఒక వీశెడు క్వినయిను ప్రవేశించింది. అందుకనేగాదండీ మిమ్మల్ని పళ్లరసం తెగతాగమంటారు డాక్టరు!”

“సరేలే! రెండుమూడురోజులలో పైత్యనాడి తిరగకపోతుందా ఏమిటి? తిరక్కపోతే పైత్తకారినే అయిపోతాను!”


“అయితే గురువుగారూ, మీరు ఎప్పుడూ అల్లా నవ్వువచ్చే మాటలు మాట్లాడుతూనే ఉంటారా?”

“నాకు ఏడుపు మాటలు చేతకావు. కృష్ణశాస్త్రిగారి శిష్యరికంచేసి ఇంత ఏడుపు కవిత్వం రచించడమన్నా నేర్చుకోవాలి!”
“నవ్వుకవిత్వం, ఏడుపు కవిత్వాలేగాని, ఇంకోరకం కవిత్వం తెలుగులో లేనేలేవా అండి?”
“లక్ష ఉన్నాయి. రాయప్రోలువారి ప్రియురాలే చెల్లెలు కవిత్వం, వేదులవారి పూవుల కవిత్వం, నండూరివారి పల్లెటూరి కవిత్వం, తుమ్మలవారి రైతు కవిత్వం, విశ్వనాథవారి ఎత్తుకొండల కవిత్వం, కాటూరి పింగళుల తేనేపెరడు కవిత్వం, కవికొండలవారి అటుకులు, జీడిపప్పు కవిత్వం, దీక్షితులవారి బువ్వాలాట కవిత్వం……”
“అదేమిటండీ! ఒకటడిగితే ఇరవై చెబుతారు ఇంతనీరసంగా ఉన్నారు కూడా?”
“ఈలా మాట్లాడుతూ ఉంటే, కాస్త జావకూడా సయిస్తుంది. ఇంకో వెండిగిన్నెడు జావా, దానితోపా సాతుకుడిరసం ఒక పెద్ద గ్లాసుడూ పట్టుకురా అనంతయ్యగారూ!”



……….


ఆమె పరుగెత్తుతూ ఉంటే ఆమె దేహ సౌష్టవచంద్రిక వెన్నెల కురుస్తుంది అనుకొన్నాడు…..ఎక్కడా అపశ్రుతిలేని శరీరాంగ నిర్మాణం ఈమెలో చేతులూ, వక్షనిధులు, నడుము, కటి, కాళ్లు, పాదాలు బ్రహ్మదేవుడు దివ్యలలిత కళాపారవశ్యకతతో సృషించి ఉంటాడనుకున్నాడు. ఆందమైన బాలికలు ఉండడమే లోకానికి ఆపత్తు. ఆందం సూదంటురాయి. మగవాళ్లు అనే ఇనుప శకలాలను ఆకర్షిస్తే ఏలాగు తనబోటి దద్దమ్మల బ్రతుకు!
(అంతలో కాస్త చరిత్ర)

"డాక్టరు రంగనాయకులు రష్యా ప్రియుడు, కమ్యూనిస్టువాది. కాంగ్రెసులో పనిచేసి దేశంలో ఉన్న శక్తులను కాంగ్రెసు కట్టుకురాలేకపోతున్నదని, అహింసా వాదమువల్ల ఎదుటివాడి హృదయం మార్చడం అనే ఆశయం ఉద్భవం అవుతుందనీ, ఈలోగా తిండిలేక మాడిపోతూ ఉంటారు ప్రజలు అనీ నిర్ధారణచేసుకున్నాడు. ఆచార్య నరేంద్రదేవు, జోషీ, జయప్రకాష్ మొదలగువారి వాదనలు నచ్చాయి. ఆ రోజుల్లో కాంగ్రేసు ఎడమచేతి వాదన వారుండేవారు. వారు కాంగ్రెసు సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనీ.

జోషి మీరట్ కేసులో ఉన్నాడు జైలుకి వెళ్లాడు. ఆ సందర్భంలోనే ఆ తర్వాతనే జోషి, డాంగే మొదలగువారు కమ్యూనిస్టులుగా ఉండి రహస్యంగా సామ్యవాదాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. వారిలో చాలామంది కాంగ్రెసు సభ్యులే.

ఫ్రభుత్వం కమ్యూనిస్టు సంఘాలను నిషేధించింది. ఆ కారణం చేత కమ్యూనిస్టులు కాంగ్రెసులోనే ఉండి పనిచేస్తూ వుండిరి.
జయప్రకాష్ నారాయణ్, మెహరల్లీ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైనవారంతా కాంగ్రెస్ లో సోషలిస్టులుగా (సాంఘికవాదులుగా) ఉండేవారు.
డాక్టరు వీరి వ్రాతలు చదివేవాడు. బోల్షివిజం ను గురించి చదివేవాడు. 1928లోనే పరీక్ష పూర్తిచేసి, 1930లో మదరాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. ……1930లో కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభించింది. 1931 తిరిగి వచ్చింది. మళ్లీ 1932 కాంగ్రెసువారినందరినీ కారాగారాలలో బంధించారు. కాని చాలా మందిని ప్రభుత్వంవారు లాఠీ ప్రయోగం చేసి మాత్రం వదులుతూ ఉండేవారు.........."
(అవునా?)


Saturday, December 3, 2011

మన సినీ సాహిత్యం



ఓ.......కోలవెరి!

ఈ మధ్య "త్రీ" సినిమా కోసం కుర్రాళ్లు ట్యూన్ చేసి పాడిన కోలవెరి పాట ప్రపంచ వ్యాప్త హిట్ అయి, అందరినోళ్లలోనూ నానుతోంది!

అందులో యేమిటీ గొప్పతనం? గొప్ప సాహిత్యం వుందా? గొప్ప సంగీతం వుందా? గొప్ప వాయిద్యసహకారం వుందా? మరేమిటి?

శంకరాభరణం శంకర శాస్త్రి "బ్రోచేవారెవరురా" గురించి అన్నట్టు--"ఆ కీర్తన అణువణువులోనూ 'ఆర్ ద్రత' నిండివుంది దాసూ!"--అదీ సంగతి.

కొన్ని నెలలుగా గుళ్లలో వినిపిస్తున్న పాటలని--ఈ మధ్య కుర్రపిల్లలు విడుదలచేశారని పేపర్లలో మెచ్చుకొంటున్న "......పూజలు" సిరీస్ సీడీల్లాంటివేమో అనుకున్నాను. 

పెద్దల బ్లాగులు చదవగా తెలిసింది అవి "శ్రీరామ రాజ్యం" సినిమాలోవని!

లవకుశ పాటలన్నీ ఇప్పటికీ హిట్ గా  యెందుకున్నాయి, ఈ పాటల ఆయుర్దాయం యెంత అని యెవరైనా ఆలోచిస్తే......నిజం తెలీదూ?

పైగా, పాటల రచయితల "స్వకుచమర్దనం" ఒకటీ! ఆపాటకి స్ఫూర్తి...అలా...అంటూ!

ఇప్పటి చిన్నారులకి పద్యాలు వినిపిస్తే మీచేతులు కొరికి పారిపోతున్నారా? వాటి అర్థం మీకే తెలీదుకాబట్టిగానీ, ఇది వరకు మా చిన్నారులకి మేము వినిపించలేదా? వాళ్లు మా చేతులు కొరికి పారిపోయారా? 

"శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా....." అంటే వాళ్లకి అర్థం కాదు అని మీరు నిర్ధారిస్తే, అది యెవరి తప్పు? 

అదీ తెలీకపోతే, "నాదు జపము తపమూ, నా కావ్యమే వృధా"!

Friday, September 30, 2011

తెలుగుభాషా......




.......వికసనం

మన తెలుగు భాషలోని "పందికొక్కు" అనే మాటని ఇంగ్లీషువాళ్లు స్వీకరించి, వాళ్ల భాషలో "బేండికూట్" అని చేర్చుకొన్నారట! అలాగే కదా భాష వికసించేది! 

ఇంకా యెన్ని విధాలుగా వికసించగలదో అనే ఆలోచన వచ్చేసరికి కొన్ని పాత విషయాలు జ్ఞాపకానికొచ్చాయి. 

మేం రెండో ఫారం (యేడో క్లాసు) చదివేటప్పుడు--1962లో--మా క్లాసు టీచరు--డేనియల్ మేష్టారు వుండేవారు. 

"నేను రోజూ సైకిలుమీద 'సఖం చెరువు ' (వారి స్వగ్రామం) నుంచి వస్తాను. తొమ్మిదింటికి స్కూలు అంటే, నేను యెప్పుడు బయలుదేరుతానో, ప్రొద్దున్నే యెన్నింటికి లేస్తానో వూహించండి. అలాంటిది, ఈ వూళ్లోనే వున్నవాడివి లేటుగా వస్తావా?" అని దులపరించేసేవారు లేటుగా వచ్చిన విద్యార్థులని బోర్డు ప్రక్కన గోడకానుకొని నిలబెట్టి! 

విషయానికొస్తే, ఆయన వూరి పేరు "సంఘం చెరువు". మునుపెప్పుడో డచ్చివాళ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రోజుల్లో, స్థానిక "సాలె"వారు తయారు చేస్తున్న అద్భుతమైన "అద్దకం" వస్త్రాలని చూసి, ముగ్ధులై, ఆ వస్త్రాలని అనేకసార్లు వుతకవలసిన అవసరాన్ని గమనించి, వారికి గ్రామ గ్రామానా చెరువులని "వ్రాసి ఇచ్చారు". 

వివిధ వూళ్లలో వాటిని "వూరి చెరువు"; "వూర చెరువు"; "సంఘం చెరువు".....ఇలా పిలిచేవారు. మా నరసాపురానికి దగ్గర్లో వున్న చెరువుని సంఘం చెరువు అనేవారు(ట). రానురానూ, ప్రజల పలుకుబడిలో అది "సగం చెరువు" ఐపోయింది. మరి "సగం" అంటే "అర్థ" అని అర్థం కదా? సగం అనేది పామర భాష....దానికి సరైన రూపం "సఖం" అని ఆయన అభిప్రాయం! యేది రైటంటారు?! 

(ఇప్పుడలాంటి చెరువులు లేవు. కొన్ని కబ్జా అయిపోయి కాలనీలు వెలిశాయి, కొన్ని పూడ్చబడి మునిసిపాలిటీలూ ప్రభుత్వం ఆక్రమించుకొన్నాయి. గత 50 యేళ్లుగా ఆ చెరువులని మాకు స్వాధీనం చెయ్యండి అంటూ పోరాడుతున్నారు ఆ కళాకారులు వివిధ కోర్టుల్లో!)

ఇంకో మేష్టారు వుండేవారు ప్రసాదంగారు అని. 

మామూలుగా జనం "సీతాఫలం" ని సీతాబళా పండు అనీ, "రామాఫలం"ని రాంబళా పండు అనీ, "లక్ష్మణఫలం"ని లక్షంబళం అనీ--దీన్ని చాలామంది చూసి వుండరు--అంటారు. 

అలాగే, క్రీస్తు పుట్టే సమయానికి ఆకాశంలో ఓ నక్షత్రం పొడిచి, దాని ఆథారంగా తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు పుట్టిన చోటికి చేరి, "సాంబ్రాణి"; "బోళము" వగైరాలు అర్పించారు(ట). 

ఇంక మా మేష్టారు, సైన్స్ పాఠం చెపుతూ, "మనగుండె 'రామబోళము ' ఆకారములో వుండును" అని చెప్పేవారు. (రాంబళా అనడం తప్పు, రామ ప్రక్కన వుండవలసింది 'బోళము ' అనడమే కరెక్టు అని ఆయన వుద్దేశ్యం!

ఇలా ఇప్పటికీ, చాలామంది మన భాష 'వికసనానికి ' తమవంతు సేవ చేస్తూవస్తున్నారు!

మీకు తెలిసినవాళ్లగురించి కూడా చెప్పండి.