Monday, September 19, 2011

తెలుగు సినీ సాహిత్యం



.....హిట్/ఫట్ పాటలు

ఓ ముఫై ఐదేళ్ల క్రితం అనుకుంటా, రేడియోలో ఓ కార్యక్రమం ప్రసారం అయ్యేది--అందులో ఒక పాటని ప్రసారం చేసేవారు. శీర్షిక "సినిమాలో మాత్రమే వినిపించిన పాట" అనో యేదో వుండేది. (అంటే బయట "హిట్" కాని, మంచి పాట అని అనుకుంటా వాళ్ల వుద్దేశ్యం). 

ఆ శీర్షికలో నాకు బాగా జ్ఞాపకం వున్న పాట, "బ్రహ్మ పట్నం పోదమంటే దారి తెలియదు అన్నయా! సూటిగా చుక్కానిపట్టీ నావ నడపవే చెల్లెలా!" అనేది. తరవాత ఇంకోపాట--"దేవీ సేమమా? దేవరవారూ సేమమా?" అనే పాట అని గుర్తు. 

మొదటి పాట సంగతి నాకు గుర్తులేదు గానీ, రెండో పాట వ్రాసినది మాత్రం, మా గురువుగారు, "ఆచార్య ఆత్రేయ"! అప్పట్లో ఓ జోకుండేది--కృష్ణశాస్త్రి వ్రాసి (జనాలని) యేడిపిస్తే, ఆత్రేయ వ్రాయక (నిర్మాతలని) యేడిపిస్తాడు--అని! ఇంకా, ఆత్రేయకి ఓ 5స్టార్ హోటల్లో బసయేర్పాటుచేసి, ఓ వారంపాటు జాగ్రత్తగా చూసుకొంటే (ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ నిరంతరాయంగా అందిస్తే) ఓ వారంలో ఖచ్చితంగా ఓ "హిట్" పాట వస్తుంది అని! (అదే స్కాచ్ బదులు ఇండియన్ విస్కీ అందిస్తే, ఇలాంటి పాటలే వస్తాయి అని కూడా చెప్పుకునేవారు!). ఇవన్నీ "పాప్యులర్ గాసిప్సే" అయ్యుండవచ్చు. తరువాత ఆయన "కోడెనాగు" సినిమాలో శోభన్ బాబుకి గురువుగా నటించారు కూడా.

ఇంకో గొప్పపాట, ఎస్ పీ కోదండపాణి పాడిన "ఇదిగో....దేవుడు చేసిన బొమ్మా....ఇది నిలిచేదేమో మూడురోజులు, బంధాలేమో పదివేలు!". చాలా మంచి పాట. ఆ విధంగా ఆయన తప్ప ప్రపంచంలో యెవరూ పాడలేరు మరి!

అలాగే, హిందీ గీత రచయిత "ఆనంద్ బక్షీ" ఉప్ హార్ అనే సినిమాలో ఓ పాట పాడారు--"బాగోం మే బహార్ ఆయీ, హోఠోం పే పుకార్ ఆయీ, ఆజా, ఆజా, ఆజమేరి రాణీ" అంటూ. అది కూడా అనితర సాధ్యం!

ఎస్ డీ బర్మన్ పాతకాలంలో పాడిన ఓ పాట వుంది--"ధీరెసె జానా ఖటియన్ మే, ఓ ఖట్ మల్, ధీరెసెజానా ఖటియన్ మే!" అనో, "ధీరెసెజానా బగియన్ మే, ఓ భౌఁరా, ధీరెసెజానా బగియన్ మే!" అనో!

ఇలాంటి చమక్కులు ఇప్పుడు లేవు!

ఇప్పుడన్నీ "ఓయ్, ఓయ్"; "డోయ్, డోయ్" లే మరి!


Thursday, September 1, 2011

రసఙ్ఞత



రసన

మనుషులకి (జంతువులక్కూడా) వుండే అవయవాల్లో ఈ రసన అనబడే నాలుక, ఓ అతి విచిత్రమయిన అవయవం.

మరి దానికి తోడు "అంగుడి"!

నాలుకమీదవేసుకోగానే, పదార్థం రుచిని గ్రహించి, దాన్ని అంగుడికి హత్తగానే--ఓహ్! ఇదే స్వర్గం అనిపించేలా చేస్తాయి ఈ రెండూ!

ఇంగ్లీషువాళ్లు కూడా రుచి ని చెప్పడానికి "ప్యాలటబుల్"; "ఫర్ ది ప్యాలేట్"....ఇలా వాడతారు. అదీ అంగుడి ప్రాధాన్యం.

ఆ రెండూ లేకపోతే, మనం కూడా ఆకులూ, అలమలతోపాటు, మట్టీ, మశానమూ తింటూ వుండేవాళ్లం!

సాహిత్యంలో ఈ రసనకి ఓ విశిష్ట స్థానం వుంది. అనేక పద్యాలు వున్నాయి. "వివాహభోజనంబు" లాంటి పాటలూ వున్నాయి. 

ఈ సందర్భంలో నాకో విషయం గుర్తొచ్చింది.

మా హైస్కూల్లో వుత్తరాంధ్రనుంచో, దక్షిణాంధ్రనుంచో ఇద్దరు ఆడపిల్లలు కొత్తగా చేరారు యేదో చిన్న క్లాసులో. మాకన్నా చిన్నవాళ్లు, అక్కచెల్లెళ్లు. ఆ సంవత్సరాంత  సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ ప్రదర్శన ఇచ్చారు.

తెల్లటి పొడుగుచేతుల చొక్కాలూ, షరాయిలూ వేసుకొని, కుచ్చు తలపాగాతో, చేతిలో కంజరి లాంటి డప్పులతో (కాళ్లకి గజ్జెలు కూడా కట్టుకున్నారేమో) ఓ చక్కని సరదా పాట పాడారు. విషయం సరిక్రొత్తదవడంతో, అందరూ తలమునకలుగా ఆనందించారు. ఆ పాట ఇలా సాగుతుంది--నాకు ఙ్ఞాపకం వున్న రెండుమూడు లైన్లు......

(ఒక వూరికి)"......వచ్చారూ ముగ్గురు షరాబులూ.....ఒకడికి అంగుడేలేదూ, ఇద్దరికి మింగుడేలేదూ"

"అంగుడి మింగుడు లేనివారలూ దున్నారూ మూడెకరాలూ.....ఒకడికి అరకేలేదూ, ఇద్దరికి యెడ్లే లేవూ"

"నాగలి యెద్దులు లేనివారలూ వేశారు మూడు విత్తనాలూ....ఒకటి యెండేలేదు, రెండు పండేలేదు!"

.......అలా సాగుతుంది. (పైన వ్రాసినవికూడా కరెక్టు కాకపోవచ్చు!)

వాళ్లు ఈపాటికి బ్లాగులు చదువుతూ, వ్రాస్తూ వుండి వుంటారని నా అంచనా.

యెవరికైనా ఈ గీతం/గేయం తెలిస్తే, వెంటనే పూర్తిగా ప్రచురించండి.....అందరికీ పరిచయం చెయ్యండి.

బుర్రుపిట్ట పాటల్లాగే, ఇదీ సాహిత్య సేవే! 

Sunday, July 3, 2011

అన్నమయ్య సాహిత్యం.....

 .....తి తి దే ప్రాజెక్టూ

నా ఈ ఆంతర్యం (బ్లాగు)లో "ముద్దు కారే" టపా వ్రాసిన నెలా పదిహేనురోజులకి ఓ స్పందన వచ్చింది వులిమిరి సూర్యనారాయణ గారి నుంచి. అంతలో మరో స్పందన--లలిత గారి నుంచి! ఇద్దరూ మంచి సమాచారం ఇచ్చారు. వులిమిరివారైతే, గరిమెళ్ల వారి పాటల లింకు రూపంలో వో ఖజానానే ఇచ్చారు. లలితగారు పిల్లలకోసం మంచి బ్లాగ్ నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ నా ప్రత్యేక అభినందనలు.

కానీ--నేను విమర్శిస్తూవస్తున్నది తి తి దే వారి సోకాల్డ్ అన్నమాచార్య ప్రాజెక్టునీ, అందువల్ల తెలుగు వాళ్లకి వొనగూడిన "ప్రయోజనాన్నీ"! ఆ ప్రాజెక్టూ, వాళ్లు పరిష్కరించామని చెప్పుకుంటున్న అప్పటి తెలుగు లిపి గురించీ! నా ఇదివరకు టపాలలో, "పదివేల శేషులు" యెక్కడనించి వచ్చారూ? "పన్నగంపు" అంటే యేమిటీ? "దోమతెరలు" అప్పుడు వున్నాయా?--ఇలాంటి వాటి గురించి వ్రాశాను. మెచ్చుకున్నవాళ్లు మెచ్చుకున్నారు. ఇప్పుడే కాస్త "సబ్జెక్ట్" వున్నవారి స్పందనలు వచ్చాయనుకుంటా.

నా బాధంతా, పాతకాలంలో కూడా వాళ్లకి "అందుబాటులోవున్న పరిమిత" వనరుల ఆథారంగా, మల్లంపల్లివారూ, రాళ్లపల్లివారూ, తాపీ వారూ, తూమాటివారూ, అక్కిరాజువారూ--మనకి తెలియని, యెప్పటికీ తెలుసుకోలేని, పాళీ, పైశాచీ, ప్రాకృత, ప్రాచీన తెలుగు లాంటి భాషలలో వున్న శాసనాలూ వగైరాలని, "మనకి అర్థం అయ్యేలా, సంతృప్తి కలిగేలా" వివరించగలిగారు.

మరి "జాను తెనుగు"లో వ్రాసిన అన్నమయ్య కీర్తనలని, సామాన్య భక్తుల మనోభావాలని ప్రతిబింబిస్తూ, వ్రాసిన అన్నమయ్య కీర్తనలు అర్థం లేనట్టుగా, మనకి అర్థం కానట్టుగా యెందుకు పరిష్కరించారు? వాటిని మనం గుడ్డివాళ్లలా అనుసరించాలా? ఇవీ ప్రశ్నలు.

మేము హైస్కూల్లో వున్నప్పుడు, మా తెలుగు పాఠ్య గ్రంధాల్లో, "కమలాక్షునర్చించు కరములు, కరములు" లాంటి పద్యాలూ, అందులో అలంకారాలూ చదువుకున్నాము. అలాగే అప్పటికి అందుబాటులో వున్న కొన్ని అన్నమయ్య కీర్తనలగురించీ, ఆయన జీవితం గురించీ, 32 వేలకు పైగా కీర్తనలు వ్రాశాడనీ, వాటిని ఓ రాజుగారు రాగిరేకులమీద వ్రాయించి భద్రం చేశాడనీ చదువుకున్నాము. వాటిలో సందేహాలేమాత్రం లేవు.

మరి శోభారాజులు ప్రాచుర్యంలోకి తెచ్చిన "అదివో! అల్లదివో"; "విన్నపాలు వినవలె"; "ముద్దుకారే యశోద" లాంటి కీర్తనల్లోనే యెందుకు సందేహాలు వస్తున్నాయి? గరిమెళ్లవారుగానీ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గానీ, లతా మంగేష్కర్ గానీ, మంగళంపల్లి గానీ--తమకి అందుబాటులో వున్న "సాహిత్యానికి" ట్యూన్లు కట్టి, వీనులవిందుగా పాడారేగానీ, ఆ సాహిత్యాన్ని "ప్రశ్నించే" ప్రయత్నం చెయ్యలేదు! చాపక్రింది నీరులా, ఆ "సాహిత్యమే" వ్యాపించి, పూజలందుకొంటోంది!

నాకు తెలిసీ, తెలుగు సాహిత్యంలో విశ్రాంతి యెరుగకుండా, అలుపన్నది లేకుండా, (తనకి అంత సమయం యెలా వచ్చేదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే!)  కృషి చేసినవాడు "ఆరుద్ర!" ఆయన "సమగ్రాంధ్ర సాహిత్యం", "నిఘంటువు", "వేమన్న వేదం" లాంటి యెన్నో "బృహద్గ్రంధాలని" వ్రాశాడు. (నేనేమీ ఆరుద్ర అభిమానిని కాదు. ఇంకా అంటే "కె రా" అభిమానిని!).

వుదాహరణకి, ఆయన వ్రాసిన వేమన్న వేదంలో ప్రతీ పద్యానికీ, "మదరాసు ప్రాచ్య లిఖిత భాండాగారం" లోని 54 సంపుటాలలో వున్న పద్యాలనే "ప్రామాణికంగా" తీసుకొన్నాడు. పైగా, వాటిని "బ్రౌన్ దొరగారు" సేకరించిన పద్యాలతోటీ, ఆయన నిఘంటువులోని పద "అర్థాల"తోటీ బేరీజు వేస్తూ, ఆయన రచన కొనసాగించాడు. వుదాహరణకి లలితగారు తమ ఆంతర్యంలో పెట్టిన, అంతర్జాతీయంగా ప్రతి తెలుగువాడూ ఇప్పుడు అదే సరియైనది అనుకుంటున్న "అనువుగాని చోట" పద్యం తీసుకొంటే, వేమన వ్రాసిందీ(?!), ఆరుద్ర చెప్పిందీ--అసలు పద్యం.......

"అనువుగానిచోట నధికులమనరాదు, యొదిగి యొక్కవంక నుండవలయు, మర్రియాకుపైన మాధవుడుండడా? విశ్వదాభిరామ వినురవేమ!"

ఇదీ అసలు పాఠం! (ఇలాంటివి కొన్నివేలున్నాయి--శ్రధ్ధ పెడితే!)

(అప్పట్లో తమిళనాడుని "మదరాసు" రాష్ట్రం అనేవారు. దాని ముఖ్యపట్టణం (నేటి చెన్నై) ని కూడా "మదరాసు" అనే అనేవారు. ఆరుద్ర చెప్పిన "ప్రాచ్య లిఖిత భాండాగారం", తంజావూరులో నెలకొన్న "సరస్వతి మహల్" వొకటేనో వేరువేరో నాకు తెలీదు).

కానీ, "వెయ్యేళ్ల ప్రాచీన భాష" గా తెలుగుని గుర్తించి, కేంద్రం ఇచ్చిన యెన్నో కోట్లతో మనం యేమి చేశామో? కనీసం ఆ ప్రాచ్య లిఖిత భాండారాల్లోనుంచి మన "తెలుగు" కి సంబంధించిన "తాళ పత్రాలనీ", ఇతర "అముద్రిత" గ్రంధాలనీ మన "రాష్ట్రానికి" తెచ్చుకున్నామా? కనీసం ప్రయత్నం చేశామా?

అమెరికలో "తానా" మహాసభలూ, ఇంకేవో (చిట్టెన్ రాజుగారన్నట్లు 'తంతా') సభలూ వగైరా నిర్వహిస్తున్నాం. కానీ, "యెవరాతల్లి? యెవడికి తల్లి?" అన్నవాణ్ని యేమంటాము?

......తరువాయి మరోసారి.

Wednesday, May 18, 2011

అన్నమయ్య కీర్తనలు



ముద్దు కారే....

అప్పటికి మూడున్నరేళ్ల నా మనుమడు మా యింటి ముందున్న, వేంకటేశ్వర స్వామి గుళ్లో, ప్రతిరోజూ వాయించేస్తున్న ఈ కీర్తనని వింటూ, ఓ రోజు పాడేశాడు...."ముడ్డికారే యశోద....." అంటూ! వాడి తప్పేమైనా వుందా?

మన తితిదే వారు కొన్ని పదుల సంవత్సరాల క్రితమే, కొన్ని కోట్ల ఖర్చుతో "అన్నమాచార్య ట్రస్ట్" స్థాపించి, కొంతమందిని ఆయన కీర్తనలని తాళ పత్రాల్లోంచీ, రాగి రేకుల నుంచీ "దీ కోడ్" చెయ్యమని నియమించారు. 

ఆ "పరిశోధకులు" యెస్వీ యూనివర్సిటీ నుంచి "డాక్టరేట్లు" తెచ్చుకున్నారు--వాటిని పరిష్కరించడమే కాదు--తమకి తోచిన రాగ, తాళ, లయ లతో, పాడేశారు కూడా. వొక్క (ఛార్లెస్ కాదు) శోభారాజు గురించేకాదు నేను వ్రాస్తున్నది.

(నా చిన్నతనంలోనూ, నేను పుట్టక క్రితం కూడా, మల్లంపల్లి వారూ, తాపీ వారూ, తూమాటి వారూ, అక్కిరాజు వారూ.....ఇలా చాలా మంది, తమకి అందుబాటులో వున్న "పరిమిత" వనరులతో, "సిధ్ధాంత" వ్యాసాలు వ్రాశారు. దానిగురించి మరోసారి.)

అన్నమయ్య, తాను వ్రాసిన ప్రతీ గేయానికీ/గీతానికీ, నిర్దిష్టంగా ఓ రాగాన్ని, తాళాన్ని (మన ప్రాచీన వాగ్గేయకారులు త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్ ల లాగ) నియమించారు. 

శంకరాభరణం శంకరశాస్త్రి చెప్పినట్టు, మన "పరిశోధకులు" తమ "మిడిమిడి" ఙ్ఞానంతో వాటిని "భ్రష్టు" పట్టించారు! దానికి మన ప్రభుత్వ, తితిదే వారి ప్రోత్సాహం తోడు!

ఇంతకీ, అన్నమయ్య వ్రా/డిన ఈ గీతం యేమిటీ?

"ముద్దుకాడే! యశోద ముంగిటి ముత్యము వీడు" అని. 

అంటే, ఇక్కడ "శ్లేష"....ముద్దు కాడా? అనీ, "ముద్దుకాడు"--చెలికాడు, విలుకాడు, వన్నెకాడు--ఇలా (అంతేగాని కన్నడంలో లా కాడు అంటే "అడవి" అనీ, మన తెలుగులోలా "వల్లకాడు" అనీ కాదు!) ముద్దువచ్చేవాడు అని. 

మరి ముద్దు "కారడం" యేమిటి? అందులోనూ యశోదకి?

ఇప్పటికైనా సరిదిద్దండి--పాడేవారూ, వినిపించేవారూ వగైరాలు.

Friday, May 6, 2011

తెలుగు హాస్య సాహిత్యం-2



"గణపతి"

(ఇలా వ్రాసి, క్రింద "గణపతి" లోని ఆ భాగాన్ని ప్రచురిస్తే బాగుంటుందని ఇది తయారు చేశాను. కానీ, కొంచెం సస్పెన్స్ వుంటే బాగుంటుందేమో అనిపించి, ఆ భాగాన్ని ముందు ప్రచురించాను.) 

నేను నా జిన్నతనముననే వావిళ్లవారో నెవరో బ్రచురించిన జిలకమర్తివారి గణపతి ని జదివితిని. తరువాత, నా యున్నత విద్యా కాలమున మరల "ఎమెస్కో" (ఇది నామవాచకమైనందున బదము మొదటి యచ్చు దప్పదు!) వారో మరి యెవరో బ్రచురించిన గణపతిని మరలజదివితిని. అదే కాలములో నాకాశవాణి ద్వారా బ్రసారము కాబడిన నండూరి వారు గణపతిగా నటించిన (శ్రవణించిన) యా నాటకమో, నాటికనో--బలుసార్లు వింటిని. టేపురికార్డరను నొక సాధనము (అన్వేషణ యను జలన చిత్రమున జూపించినటువంటిది) నాదగ్గరుండుటచే, ఆ "రేడియో" నాటికను "రికార్డు"జేసుకొని, మరల మరల వినియానందించుచుంటిమి మా యింటిల్లపాదియును!

మొన్ననీమధ్యన "విశాలాంధ్ర" వారు "చంద్ర"యనునొక నార్టిస్ట్ వ్రాసిన (గణపతి తన బొగజుట్ట నుండి వెలువరించుచున్న బొగతో "గణపతి" యని వ్రాసినట్లు బ్రచురించిన ముఖజిత్రముతో) పునర్ముద్రించిన బుస్తకమునుగూడా గొంటిని. నా "యింటి గ్రంధాలయమున" బ్రస్తుతమా బుస్తకమున్నది.

నా దెలుగు బ్లాగ్మితృలకునోజిన్న గానుకనొసంగగోరి, నీక్రింది టపాను బ్రచురించుచున్నాను. 

(తెలుగు బ్లాగ్ మితృలూ, బ్లాగ్ పోలీసులూ, పైన వ్రాసిన వాక్యాల్లోని "అచ్చులనీ, హల్లులనీ", "పరుషాల"నీ, "సరళాల"నీ వాటి "స్థానాలనీ" గమనించగోర్తాను. అరసున్నాలుండవలసిన చోట అవి వ్రాయడానికోపిక లేక వదిలేశాను. దయచేసి అవి వున్నట్టే భావించవలసినదిగా ప్రార్థన.)

"గణపతి" ప్రథమ భాగము, నాల్గవ ప్రకరణము, నుండి (నేను జదివిన, విన్న, యంశములుమాత్రమే, యథాతథముగా) వ్రాయుచున్నాను....నా బ్లాగు సహోదరులవధరింప బ్రార్థన.

....తరువాయి మరియొకసారి.

Thursday, May 5, 2011

తెలుగు హాస్య సాహిత్యం




ఇది చదివారా?

"వివాహ సంబంధములైన వేడుకలు విశేషముగా వర్ణింపదలచుకొనలేదు. అయినను, ముఖ్యమైన వొకటి రెండు గలవు. పప్పుభొట్లవారితో నన్నంభొట్లవారు వియ్యమందినప్పుడు వారి కుభయులకు ననాది బంధువులైన నేతివారు దయచేసి వారితో గలసి మెలసి వివాహమునకెంతో శోభదెచ్చిరి. నేతివారుగాక ముఖ్యముగ నన్నంభొట్ల వారికి బంధువులైన కందావారు, చెమ్మకాయలవారు, బీరకాయలవారు, చేమకూరవారు, వంకాయలవారు, మిరియాలవారు, దోసకాయలవారు దయచేసి, రేయింబవళ్లు తిరిగి, రెక్కలు ముక్కలగునట్లు పనిచేసి మెప్పువడసిరి. ఉప్పువారు మొదటినుండియు నచ్చటనేయుండిరి. కాని వారికన్నంభొట్లవారితో నంతయైకమత్యము లేదు. ఉప్పువారికిని మన పప్పువారికిని నతికినట్లన్నంభొట్లవారితో నతకదు. ఉప్పువారికిని బంధుమిత్రులకుగూడ నెక్కువ కలయిక యుండెను. గొల్లప్రోలు నుండి చల్లావారు మొదట నేకారణముచేతనో రాక కడపట విచ్చేసిరి. కడపట విచ్చేసిననను మొదటి నుండియు నన్నంభొట్లవారికాప్తులగుటచేత వారి సమాగమ మెంతో రసవంతముగ నుండెను"  

Saturday, April 30, 2011

యేకవచన ప్రయోగం



తెలుగు వారికి నా విఙ్ఞప్తి

తెలుగువారికీ, ముఖ్యంగా తెలుగు బ్లాగరు సోదరులకీ, నేను సంస్కృత/తెలుగు వ్యాకరణాలూ, ఇంగ్లీషు గ్రామరూ బోధిస్తున్నాను అనుకోక, నా చెప్పు ముక్కలు తమ చెవిని వేసుకొని, ఆలోచించమని ప్రార్థన. 

సంస్కృతంలోనైనా, తెలుగులోనైనా, నామవాచకాలు, సర్వనామాలూ వగైరాలు వున్నాయి. నామ వాచకమంటే, ఓ వ్యక్తి, వస్తువు లకు వ్యవహరింపబడే పేర్లు. సర్వనామాలంటే, ఆ నామవాచకాలని మళ్లీ మళ్లీ చెప్పవలసిన అవసరం లేకుండా, ప్రత్యామ్నాయంగా వాడే పదాలు.

ఓ నామవాచకం యొక్క స్థితిని తెలియచెయ్యడానికి సంస్కృతంలో "శబ్దాలూ", తెలుగులో "విభక్తులూ" వున్నాయి. అదే ఇంగ్లీషులో ఆ స్థితి వాచకాలు కూడా భాషా భాగాల్లో ఒకటిగానే వున్నాయి.

వుదాహరణకి, సంస్కృతంలో "రామః = రామ నామం కల వ్యక్తి". అదే తెలుగులో, "డు, ము, వు, లు--ప్రథమా విభక్తి" చేరి, "రాముడు" అవుతుంది ఆ వ్యక్తి పేరు. (ఛీ! యేకవచనమేమిటీ? శ్రీ రాములవారు.....అనాలి అందామా? ఈనాడు వారిలాగ?)

రాముని (ద్వితీయ), చేత (తృతీయ), కొరకు (చతుర్థీ), వలన (పంచమీ), కి, యొక్క (షష్ఠి), యందు (సప్తమీ)--కాకుండా "వాణ్ని" పిలవాలంటే, "ఓ రామా!"; "ఓరి రామా"; "ఓయి రామా" అనీ, అదే సీతనైతే, "ఓసి సీతా" అనే పిలవాలి--మన తెలుగు వ్యాకరణం ప్రకారం!

అంతేగాని, "రాములూ" వగైరా బహువచన ప్రయోగం యెందుకు?

అదే ఇంగ్లీషులో అయితే, 'ప్రిపొజిషన్స్' అని భాషాభాగాల్లోనే చేర్చుకొన్నారు వాళ్లు. "బై రామా", "ఫర్ రామా" ఇలాగ.

గత కొన్నేళ్లుగా, ప్రైవేటు కళాశాలలవాళ్లు "స్కోరింగు" సబ్జెక్ట్ గా సంస్కృతం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారట. మరి ఆ విద్యార్థులు ఆ "శబ్దాలనీ" వాటినీ సరిగ్గా వుచ్చరించగలుగుతున్నారో, వ్రాయగలుగుతున్నారో లేదోదానీ, మార్కులు మాత్రం వచ్చేస్తున్నాయట. అదే తెలుగులో 40 వేలమందికి పైగా "సున్నాలు" తెచ్చుకొన్నారట! రావూ మరి?! సంస్కృతం "రాని" మేష్టర్ల కన్నా, తెలుగు "రాని" మేష్టర్ల సంఖ్య యెక్కువ! 

మరి సర్వనామాలు, తెలుగులో, "అతడు, అమె, అది, ఆ" అనేవి. ఇంగ్లీషులో, "హి, షి, ఇట్, దె" అనేవి. 

తెలుగులో గ్రాంథికంలో అతడు, ఆమె అనేవి వాడినా, వ్యావహారిక భాషలో, వాటికి ప్రత్యామ్నాయంగా, వాడు,అది వారు/వాళ్లు అనే ప్రయోగాలు వచ్చేశాయి.

తెలుగు సాహిత్యం లో కూడా, భగవంతుణ్ని అయినా, వాడు, వీడు అనే అంటారు. "కలడు, కలండనెడి 'వాడు' కలడో, లేడో!" అనీ, "బ్రోచేవారెవరు 'రా'..." అని!

ఇంగ్లీషులో కూడా, వుదాహరణకి, "జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. హి (వాడు/అతడు) శాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఆన్ ది క్రాస్" అంటారు కదా?

"మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్నే ఆయుధం చేసుకొన్నాడు. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు".....అంటారు గానీ, "మహారాజశ్రీ మహాత్ములవారు గాంధీగారు"....చేసుకొన్నా"రు"....తెచ్చా"రు" అంటారా?

ఇక, వా 'రు'; తమ'రు' లాంటి ప్రయోగాలు మన బానిసతనానికి చిహ్నంగా భాషలోకి ప్రవేశపెట్టబడ్డవి. అప్పటి దేశపాలకులని, అప్పటి బానిస వ్యక్తులు అనవసరంగా కీర్తిస్తూ వాడిన పదాలవి. "సర్" ని "అయ్యా"/"ఆర్యా" అనీ;(మ్‌లేఛ్ఛుడు ఆర్యుడు యెలా అవుతాడు?) "నువ్వు" (ఇంగ్లీషులో యు) ని మీ'రు' అనీ, మళ్లీ ఆ మీరు ని తమ 'రు' అనీ; "ఘనతవహించిన"; "మహాఘనతవహించిన"; "శాయంగల విన్నపములు"; "దయయుంచి" (ప్లీజ్); "కరుణతో" (కైండ్లీ); "దఖలు"/"దాఖిలు"/"దాఖలు" చేస్తున్నాను (సబ్మిట్); (హిందీలో దాఖిల్ కర్నా అంటే విన్నపం చేస్తున్నాను, లేదా, మీ దృష్టికి తెస్తున్నాను/సమర్పిస్తున్నాను అని). 

ఇవన్నీ అవసరమా? 

{ఇప్పటి ఆఫీసుల్లో కూడా, ఇంగ్లీషులో యేదైనా వ్రాస్తే, దాంట్లో యెన్ని 'రిక్వెస్టులూ', 'ప్లీజ్ లూ', 'కైండ్లీలూ', 'సబ్మిట్ లూ' వున్నాయో చూసుకొని, పైన 'రెస్పెక్టెడ్' వుందా లేదా చూసుకొని, చివర థాంకింగ్ యూ తరవాత "సర్" వుందా లేదా చూసుకొని, అవన్నీ లేకపోతే, "వీడు వొట్టి (స్వంత చిరునామా లేనివాళ్లని--కేరాఫ్ గాళ్లనీ 'అనామకం గాడు (నస్మరంతి)' అనే అనుకుంటా బాపూ-రమణలు అన్నది) ఇన్ సబార్డినేట్ గాడు" అని ముద్రవేసేస్తారు!}

చెప్పొచ్చేదేమిటంటే, మనం ఇంగ్లీషు వాళ్లమూ కాదు, భారతీయులమూ కాదు, తెలుగు వాళ్లమూ కాదు--ఓ ప్రత్యేక జాతి! 

ఈ దౌర్భాగ్యాలు మనని వదిలేదెప్పుడో??!!