Saturday, April 18, 2009

శ్రీ దేవులపల్లి


ఓ పెద్దాయన ప్రాక్టికల్ జోక్

కొన్ని దశాబ్దాల క్రితం, ఆలిండియా రేడియో, విజయవాడ కేంద్రం ఉద్దండులచే గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించే రోజుల్లో జరిగిన కథ……..

కేంద్ర సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావుగారు….ఓ సంక్రాంతి పండుగ సందర్భంగా, పిల్లలకోసం రూపొందించిన ఓ సంగీత రూపకం “బావొచ్చాడు”! దాని రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి.

కార్యక్రమం రూపొందడానికి చాలా ముందు, ఓ రోజు శ్రీ గొల్లపూడి మారుతీ రావు కనపడగానే, దేవులపల్లివారు (పాపం అప్పటికే బొంగురుగా ఒక్కొక్క మాటే మాట్లాడేవారు—ఆయన గొంతు శాశ్వతంగా మూసుకుపోవడానికి కొంచెం ముందు అన్నమాట) ‘మాష్టారూ!’ అని పిలిచి, కాగితం మీద “నేను వ్రాసిన సంగీత రూపకం లో మీరో ముఖ్య పాత్ర వెయ్యాలి! నేనే వేద్దునుగానీ, నా మొహం ఉత్త రాగి చెంబులా వుంటుంది! అందుకని" అని వ్రాశారట!

(నిజంగా రేడియోలో పాత్రలు కనపడవు అని ఆయనకి తెలియదా? తన మీద తనే జోకు వేసుకొనే ఆయన ప్రవృత్తీ, యెదుటివారి ప్రాముఖ్యతని గుర్తించామని పొగడడానికి సంకోచించక పోవడం!)

గొల్లపూడివారు ఉబ్బి తబ్బిబ్బై ఒప్పుకోగానే, ‘ఫలానా రోజున ప్రసారం…మీరు సిద్ధం అవండి’ అని వ్రాశారట.

కార్యక్రమం ప్రసారమయ్యే రోజు దాకా రిహార్సల్సూ లేవు, స్క్రిప్టు యేమిటో తెలియదు, తన పాత్ర యేమిటో, యెలా హావభావాలు పలికించాలో అని గుంపుతెంపులు పడుతున్నాడు శ్రీ గొల్లపూడి! పోనీ అడిగేద్దామంటే, పెద్దాయన!

సరే, ప్రసారవేళ రానే వచ్చింది. శ్రీ బాలాంత్రపు పిల్లల చేత పాటలు పాడిస్తున్నారట—పండుగ ప్రాశస్థ్యం గురించీ, అల్లుళ్ళు పండగకి అత్తారింటికి రావడం గురించీ, పిల్లల సరదాలూ—ఇలా అన్నీ దేవులపల్లివారు వ్రాసిన పాటలు ప్రసారమౌతున్నాయట! ప్రక్కగదిలో శ్రీ కృష్ణ శాస్త్రి చిరునవ్వుతో తిలకిస్తున్నారట!

కార్యక్రమం పూర్తి కావచ్చింది—చివరి నిమిషం వస్తూందనగా ఇంక వుండబట్టలేక ‘మరి నా హీరో పాత్ర…….’ అని నసిగారట గొల్లపూడివారు. వెంటనే గుర్తొచ్చినట్టు నవ్వి, ఓ చిన్న స్లిప్ మీద “యేమర్రా పిల్లలూ…..” అని వ్రాసిచ్చి, సైగ చేశారట.

చివర 50 సెకండ్లు వుండగా, రజనీకాంతరావు ఆయన్ని మైకు ముందుకు తోసి, డైలాగు చెప్పమనట్టు సైగ చేశారట.

గొల్లపూడి వారు, గొంతు సవరించుకొని, “యేమర్రా పిల్లలూ……..” అనగానే, పిల్లలందరూ “బావొచ్చాడు…బావొచ్చాడు” అని కేరింతలతో ఆయన చుట్టూ మూగుతుంటే, కార్యక్రమం ముగిసిందట!

చూశారా మన హీరో గారి ప్రాముఖ్యం!

(ఇది శ్రీ గొల్లపూడి 1982 లో వ్రాసిన ‘జీవనకాలం’ వ్యాసాల్లో స్వయంగా ఉటంకించిన ప్రహసనం)